CM Chandrababu: కనకదుర్గ దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించాం..
ABN , Publish Date - Oct 13 , 2024 | 12:35 PM
ఇంద్రకీలాద్రిపై విజయవాడ కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ ఏడు నిర్వహించామని, భక్తులకు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మద్యమం ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఇంద్రకీలాద్రి (Indrakiladri) పై కనక దుర్గమ్మ (Kanakadurgamma) దసరా శరన్నవరాత్రి మహోఉత్సవాలు (Dussehra Sharannavaratri Celebrations) అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సామాజిక మద్యమం (Social Media) ఎక్స్ (X) వేదికగా వ్యాఖ్యలు చేశారు. ఇంద్రకీలాద్రిపై విజయవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈ ఏడు నిర్వహించామని, భక్తులకు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మన పండుగలు కేవలం ఉత్సవాల నిర్వహణకే కాదని... మన సంస్కృతి, సాంప్రదాయాలకు, వారసత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భక్తులకు సౌకర్యాలు పెంచడంతోపాటు దేవాలయాల పవిత్రతను , సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
అలాగే తిరుమల తిరుపతిలో సాలకట్ల బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అభినందిస్తున్నామన్నారు. తిరుమలలో ఏడాదికి 450 పండుగలు నిర్వహిస్తామని, వాటన్నింటిలోకి బ్రహ్మోత్సవం విశిష్టమైనదని అన్నారు. ఈ ఏడాది ఇప్పటికే శ్రీవారి మూలవిరాట్‌ను ఆరు లక్షల మంది దర్శించుకున్నారని, 15 లక్షల మంది భక్తులు వాహన సేవలో పాల్గొన్నారని, 26 లక్షల మంది భక్తులు ఈసారి బ్రహ్మోత్సవాలకు వచ్చారని తెలిపారు. ఈ సంఖ్య గతేడాది 16 లక్షల మంది మాత్రమే భక్తులు వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వెదికగా వ్యాఖ్యానించారు.
కాగా దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం ఉదయం ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా దేవాలయ ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామారావు, దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి రామచంద్ర మోహన్ పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా ఈ పూర్ణాహుతి కార్యక్రమం ముగిసింది.
మరోవైపు దసరా నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు శనివారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. దీంతో దేవాలయంలోకి వెళ్లే అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. ఇంకోవైపు దుర్గమ్మ మాల ధారణతో వచ్చిన భవానీలు సైతం భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.