Amaravati: గిరిజన సోదరులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు
ABN , Publish Date - Aug 09 , 2024 | 10:50 AM
అమరావతి: అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటని.. గిరిజనులకు మంచి భవిష్యత్ అందిస్తాం..
అమరావతి: అంతర్జాతీయ గిరిజన దినోత్సవం (International Tribals Day) సందర్భంగా గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu), మంత్రి లోకేష్ (Minister Lokesh) సామాజిక మాధ్యమం ఎక్స్ (X) వేదికగా శుభాకాంక్షలు (Congratulate) తెలియజేశారు. జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటని.. అందుకే నాటి తెలుగుదేశం హాయంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించామని, అరకు కాఫీకి, గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపుకోసం ప్రోత్సాహాన్ని అందించామన్నారు. గిరిజన జాతులను కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని సమున్నతంగా నిలబెట్టడమేనని.. రాబోయే రోజుల్లో కూడా గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడతామని, గిరిజనులకు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్‌ను అందిస్తామని తెలియజేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
మంత్రి నారా లోకేష్..
స్వచ్ఛమైన మనసులు... ప్రకృతిని ప్రేమించే మనుషులు. సమాజానికి ప్రకృతి సంపద పంచడమే తప్ప తిరిగి ఏమీ ఆశించని ఆదివాసీలు వ్యక్తిత్వం నిత్యస్ఫూర్తి అని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదరసోదరీమణులకు తన శుభాకాంక్షలు అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
వారు అడవితల్లి బిడ్డలు. అటవీ ఉత్పత్తులే ప్రధాన జీవనాధారం. ఎంత కష్టమైనా.. చెదరని ఆత్మవిశ్వాసం వారి సొంతం. కాగా.. తరాలు మారుతున్నా.. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. వారి తలరాతలు మాత్రం మారడం లేదు. కనీస రహదారులు లేక.. సక్రమంగా వైద్యసేవలు అందక.. ఇప్పటికీ ఎన్నో గిరిజన గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జిల్లాకు ఐటీడీఏ సైతం దూరమైన దుస్థితి నెలకొంది. సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లడంతో అభివృద్ధి కనుమరుగైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వమైనా.. తమ అభివృద్ధిపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని గిరిజనం వేడుకుంటోంది.
కాగా గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసి సమాజంలో సమానత్వాన్ని కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, శుక్రవారం అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు గిరిజన, శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లను గురువారం మంత్రి సంధ్యారాణి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, జేసీ నిధి మీనా, ఇతర అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేస్తారని, గిరిజన నృత్యాలను తిలకించి, గిరిజన ఉత్పత్తుల స్టాల్స్‌ను పరిశీలిస్తారన్నారు. ఆదివాసీలతో మమేకమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకొని గిరిజనుల అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల సమక్షంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి సంధ్యారాణి తెలిపారు.
కూటమి ప్రభుత్వంపై ఆశలు
గత వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు సంబంధించిన 11 సంక్షేమ పథకాలను రద్దు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు.. గిరిజనశాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు గ్రామాలకు రహదారులు సౌకర్యం, గర్భిణులకు వసతిగృహాలు, ఫీడర్ అంబులెన్స్‌లు, సబ్‌ప్లాన్, ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలని సూచించారు. జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని గిరిజనశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇవ్వడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.