Share News

CM Chandrababu: గిరిజన ప్రాంతాల అభివృద్ది, పథకాల ప్రగతిపై సమీక్షించిన సీఎం

ABN , Publish Date - Oct 22 , 2024 | 08:02 AM

గిరిజనుల సంక్షేమానికి, గిరిజన ప్రాంతాల అభివృద్దికి అమలు చేస్తున్న పలు పథకాల ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. గిరిజనుల సంక్షేమానికి, వారి ప్రాంతాల అభివృద్దికి కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తి స్తాయిలో వినియోగించుకోవాలని, అందుకు తగిన మ్యాచింగ్ గ్రాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వ పరంగా విడుదల చేసేందుకు తాను సిద్దంగా ఉన్నామని చెప్పారు.

CM Chandrababu: గిరిజన ప్రాంతాల అభివృద్ది,  పథకాల ప్రగతిపై  సమీక్షించిన సీఎం

అమరావతి: గిరిజనుల (Tribals) జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సంపూర్ణ సహకారం అందజేస్తానని, అందుకు తగ్గట్టుగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తూ గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్దికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కోరారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమావేశమై గిరిజనుల సంక్షేమానికి, గిరిజన ప్రాంతాల అభివృద్దికి అమలు చేస్తున్న పలు పథకాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమానికి, వారి ప్రాంతాల అభివృద్దికి కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తి స్తాయిలో వినియోగించుకోవాలని, అందుకు తగిన మ్యాచింగ్ గ్రాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వ పరంగా విడుదల చేసేందుకు తాను సిద్దంగా ఉన్నామని చెప్పారు. విద్య, వైద్య, ఆరోగ్యం, త్రాగునీటి సరఫరా, రహదారులు, కమ్యునికేషన్ తదితర మౌలిక వసతుల కల్పనతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చే అవసరమైన జీవనోపాధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు.


గిరిజనుల విద్యకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని, పిల్లలు అందరూ పాఠశాలల్లో చేరే విధంగా ప్రోత్సహించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అవసరమైతే ప్రత్యేక బ్రిడ్జి కోర్సులు నిర్వహించి పిల్లల అందరూ పాఠశాలల్లో చేరేలా చూడాలన్నారు. అక్షయ పాత్ర సంస్థ ద్వారా గిరిజన విద్యార్థులకు మంచి పోషకాహారాన్ని అందజేసే ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. దానికి అవసరమైన రూ.337 కోట్ల నిధులు మంజూరుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ అంశంలో ప్రత్యేక శ్రద్ద, రెండు రోజులకు ఒక సారి ఏ.ఎన్.ఎం.తో వారికి ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో రాత్రి వేళల్లో ఏ.ఎన్.ఎం. అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.

తల్లీ, బిడ్డల మోర్టాలిటీ రేటును తగ్గించే విధంగా.. సికిల్ సెల్ వ్యాధిని పూర్తి స్థాయిలో నివారించేందుకు ప్రణాళికా బద్దంగా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. ద్వారా గిరిజన ప్రాంతాల్లోని అన్ని గ్రామాలకు రహదారుల సౌకర్యాన్ని కల్పించేందుకు రూ.1200 కోట్లతో ప్రత్యేక ప్రాజక్టును చేపడతామని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నాటికి బి.ఎస్.ఎన్.ఎల్. తో పాటు ఇతర కమ్యునికేషన్ నెట్ వర్కులను పూర్తి స్థాయిలో ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. గిరిజ ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెద్ద ఎత్తున పెంచే విధంగా ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం అమలు చేస్తామన్నారు. గిరిజనుల జీవనోపాధి మెరుగుకై కాఫీ, మిరియాల సాగును మరింత ప్రోత్సహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 2.5 లక్షల ఎకరాల్లో జరుగుచున్న కాఫీ సాగును మరో ఒక లక్ష ఎకరాల మేరకు విస్తరించే విధంగా తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.


ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. ద్వారా కాఫీ పంట సాగును విస్తరించేందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వ పరంగా అందజేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ప్రభుత్వ, ప్రవేటు బాగస్వామ్యంతో కాఫీ సాగును మరింత ప్రోత్సహించి, పెద్ద ఎత్తున గిరిజనులకు ఆదాయం వచ్చే విదానాన్ని రూపొందించాలని, అందుకు అవసరమైన స్పెషల్ పర్పస్ వెహికిల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పసుపు సాగును జాయింట్ వెంచర్ పై ప్రోత్సహిస్తే గిరిజనులకు మరింత మేలు జరుగుతుందని, ఆ దిశగా అదికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అదే విధంగా తేనె దిగుబడిని పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా డాబర్ లాంటి ప్రైవేటు కంపెనీల సహకారాన్ని పొందాలన్నారు. ట్రైకార్ ద్వారా గిరిజనులకు తగిన ఆర్థిక సహకారo అందే విధంగా కేంద్ర ప్రాయోజిత పథకాలను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలన్నారు. కాగా ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఆరోగ్య శాఖ స్పెషల్ సి.ఎస్. ఎమ్.టి.కృష్ణబాబు, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, జీసీసీ అధికారులు, అన్ని ఐటిడిఏల పీవోలు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

‘దీపం’తో దీపావళి!

జగన్‌.. దమ్ముంటే అసెంబ్లీకి రా!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 22 , 2024 | 08:02 AM