YSRCP: ఒక్కొక్కటిగా బయటికొస్తున్న వైసీపీ బాగోతాలు..!
ABN , Publish Date - Jul 29 , 2024 | 08:32 AM
వైసీపీ (YSRCP) పాలనలో కృష్ణా నదిలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాల బాగోతాలు ఇప్పుడు బయట పడుతున్నాయి. నాడు ప్రభు త్వంలోని పెద్దల అండదండలు ఉండడంతో ఇష్టాను సారంగా తవ్వకాలు చేశారు..
విజయవాడ : వైసీపీ (YSRCP) పాలనలో కృష్ణా నదిలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాల బాగోతాలు ఇప్పుడు బయట పడుతున్నాయి. నాడు ప్రభు త్వంలోని పెద్దల అండదండలు ఉండడంతో ఇష్టాను సారంగా తవ్వకాలు చేశారు. పెనమలూరు మండలం చోడవరంలో కృష్ణానదిలో అనధికారికంగా తవ్వకాలు జరిపిన జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీపై కృష్ణా జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నోటీసులు జారీ
ఈసీ (ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్), సీఎఫ్‌వో (కన్‌సెంట్ ఫర్ ఆపరేషన్స్), సీఎఫ్‌ఈ (కన్‌సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్), ఏఎంపీ (అప్రూవ్డ్ మైనింగ్ ప్లాన్) లేకుండా ఈ సంస్థ ఇసుక తవ్వకాలు చేసిందని ఫిర్యాదు పేర్కొన్నారు. సంయుక్త తనిఖీలు నిర్వహించినప్పుడు చోడవరం సమీపం లోని నదిలో పలు ప్రదేశాల్లో తవ్వకాలు చేసినట్టు గుర్తిం చారు. రెండు నెలల క్రితం నుంచి ఈ సంస్థ ఇసుక తవ్వకాలను చేసి, సరఫరా చేసినట్టు రెవెన్యూ అధికారి ఈ తనిఖీ బృందానికి వివరించారు. అనంతరం జీసీకేసీ సంస్థ ప్రతినిధి అర్మూర ధనంజయకు ఈనెల 24న అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఎంఎం(డీఅండ్‌ఆర్) చట్టం 1957లోని 4(1), 21(1), 21(4), ఏపీఎంఎసీ 1966 చట్టంలోని 26(2)(1), ఐపీసీ 379 కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ కార్యాలయం విజ యవాడ ఆర్టీసీ కాలనీలోని సాయిబాబా ఆలయం వీధిలో ఉంది. ఇక్కడ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.