Share News

AP News: మా పోరాటానికి మద్దతివ్వండి.. పవన్‌కు న్యాయవాదుల విజ్ఞప్తి

ABN , Publish Date - Jan 05 , 2024 | 02:36 PM

Andhrapradesh: న్యాయవాదులతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్, నాదెండ్ల మనోహన్ శుక్రవారం జనసేన కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. బెజవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ల అధ్యక్షులు, పలువురు సభ్యులు, సీనియర్ న్యాయవాదులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన భూహక్కుల చట్టం ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌‌పై న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

AP News: మా పోరాటానికి మద్దతివ్వండి.. పవన్‌కు న్యాయవాదుల విజ్ఞప్తి

అమరావతి, జనవరి 5: న్యాయవాదులతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan), నాదెండ్ల మనోహన్ (Nadendla Manohar) శుక్రవారం జనసేన కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. బెజవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ల అధ్యక్షులు, పలువురు సభ్యులు, సీనియర్ న్యాయవాదులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన భూహక్కుల చట్టం ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌‌పై న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. తమ పోరాటానికి మద్దుతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్‌కు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.

జనసేన లీగల్ సెల్ ఛైర్మన్ ప్రతాప్ మాట్లాడుతూ.. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌‌పై న్యాయవాదులంతా కలిసి కట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన భూ హక్కు చట్టం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే విధానం ఇది అని మండిపడ్డారు. అన్యాయం జరిగితే.. న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. ఈ చట్టంపై న్యాయవాదులంతా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారన్నారు. నిపుణులతో చర్చించకుండా.. ప్రభుత్వం ఏకపక్షంగా ఈ చట్టం చేసిందన్నారు. హైకోర్టులో ఇంకా అమల్లో లేదని చెబుతూనే... క్షేత్రస్థాయిలో మాత్రం అమలు చేస్తున్నారన్నారు. అంటే ప్రజలను, కోర్టును కూడా తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.


బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా భూహక్కు చట్టం చేసిందన్నారు. అరాచకాన్ని, అశాంతిని కలిగించే దుర్మార్గమైన చట్టాన్ని తెచ్చారన్నారు. సమాంతర న్యాయవ్యవస్థను తీసుకురావడం దుర్మార్గమని మండిపడ్డారు. వివాదాలు లేని ఆస్తులకు.. వివాదాలు సృష్టించే అవకాశం కల్పించారన్నారు. ఎక్కడ స్థిరపడినా... స్వగ్రామంలో ఆస్తులు ఉంచుకోవడం ఆనవాయతీ అని అన్నారు. సెక్షన్ 28 ప్రకారం అయితే ల్యాండ్, బిల్డింగ్, ప్లాట్స్ ఏదైనా అన్యాక్రాంతం చేయవచ్చన్నారు. రికార్డు ఆఫ్ టైటిల్, డిస్ప్యూట్, ఛార్జెస్ మూడు విధాలుగా స్థలాల కబ్జాకు శ్రీకారం చుట్టారన్నారు. రూపాయి ఖర్చు లేకుండా అర్జీ పెట్టుకుంటే... వివాద భూమి కింద పెట్టేస్తారంట... అంటే భూమి హక్కుదారుడు వెళ్లి ఫిర్యాదుదారుడి కాళ్లు పట్టుకోవాలా అని ప్రశ్నించారు.

వీటిపై పోరాటం చేస్తున్న న్యాయవాదుల మధ్య కూడా చిచ్చు పెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో న్యాయవాదులను కూడా రెండు గ్రూపులుగా మార్చేశారన్నారు. పేరుకు ఆస్తులు ఉన్నా వివాదంలోకి వెళితే.. రుణం రాదు.. అమ్ముకోలేడన్నారు. న్యాయవ్యవస్థ ప్రజలకు ఇచ్చిన స్వేచ్చను హరించేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వ్యాఖ్యలు చేశారు. వివాదం లేని భూమిని వివాదం అని చెబితే... సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. తాము సమావేశాలు పెడితే... ప్రజల్లోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారన్నారు. ప్రజలు కూడా ఆలోచించించాలని.. ఇటువంటి దుర్మార్గపు చట్టాలపై పోరాటంలో భాగస్వామ్యం కావాలని కోరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 05 , 2024 | 02:36 PM