Share News

Minister Nimmala: జగన్ రాజకీయాలకు అనర్హుడు.. నదుల అనుసంధానం సృష్టి కర్త చంద్రబాబు..

ABN , Publish Date - Jul 08 , 2024 | 01:36 PM

విజయవాడ: ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం గోదావరి, కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దీక్ష, దక్షతకు, సీఎం చంద్రబాబు ముందుచూపుకు పట్టిసీమ నిదర్శనమని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా కరవు నిర్మూలించవచ్చని కెయల్ రావు చెప్పారని, దానిని అమలు చేసి రైతులకు నీరు ఇచ్చిన నేత చంద్రబాబు అని కొనియాడారు.

Minister Nimmala: జగన్  రాజకీయాలకు అనర్హుడు.. నదుల అనుసంధానం సృష్టి కర్త చంద్రబాబు..

విజయవాడ: ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) సోమవారం గోదావరి (Godavari), కృష్ణా నదుల (Krishna Rivers) పవిత్ర సంగమం వద్ద పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని (MP Keshineni Shivnath Chinni), మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ.. దీక్ష, దక్షతకు, సీఎం చంద్రబాబు (CM Chandrababu) ముందుచూపుకు పట్టిసీమ నిదర్శనం అని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా కరవు నిర్మూలించవచ్చని కెయల్ రావు చెప్పారని, దానిని అమలు చేసి రైతులకు నీరు ఇచ్చిన నేత చంద్రబాబు అని కొనియాడారు. గోదావరి నుంచి మూడు వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వదులుతున్నారని, వృధా అవుతున్న నీరుని కృష్ణాడెల్టా కు మళ్లించారని చెప్పారు.


శ్రీశైలం నీరు రాయలసీమకు ఇచ్చి కరవును పారదోలాలని సీఎం చంద్రబాబు భావించారని, పోలవరం పూర్తికి ఆలస్యం అవుతుందనే పట్టిసీమ నిర్మాణం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మొత్తం 24 పంపులను‌ విడతలవారీగా రన్ చేసి ఎనిమిది వేల క్యూసెక్కుల నీరు డెల్టాకు అందిస్తున్నామని చెప్పారు. గోదావరి నీరు వృధా కాకుండా కృష్ణా నదిలో కలపడం గొప్ప విషయమన్నారు. చంద్రబాబు ముందుచూపుతో పది లక్షల ఎకరాలకు సాగు నీరు, ముప్పై లక్షల మందికి తాగు నీరు ఇచ్చారని తెలిపారు. పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్న జగన్ రాజకీయాలకు అనర్హుడని, కనీసం అవగాహన లేకుండా ప్రాజెక్టులను పూర్తి గా నాశనం చేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 50 వేల కోట్ల ఆదాయం రైతులకు పట్టిసీమ ద్వారా వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.


అసలు రాజకీయాలకు జగన్ అనర్హుడని, రైతులు, ప్రజల ప్రయోజనాలు పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పట్టిసీమ లేకపోతే అసలు కృష్ణా డెల్టా పరిస్థితి ఏమిటో అందరూ ఆలోచన చేయాలన్నారు. పులిచింతల నిండాలంటే శ్రీశైలం, సాగర్ నిండితేనే వచ్చే పరిస్థితి అని అన్నారు. ప్రతి యేడాది 35 టీఎంసీల నీటిని నిల్వ పెట్టుకుని రైతులు పంటలు పండిస్తారని, గత ఐదెళ్లల్లో జగన్ పాలనలో పులిచింతలను కూడా ఎండ పెట్టారని మంత్రి దుయ్యబట్టారు. కనీసం అర టీఎంసీ నీరు కూడా లేకుండా జగన్ చేయడం సిగ్గు చేటన్నారు. ప్రజలను భక్షించే విధంగా జగన్ పాలన సాగిందని, పోలవరం పూర్తి అయ్యే వరకు పట్టిసీమ డెల్టాని కాపాడుతుందన్నారు. మూడు రోజుల్లో 12 అడుగుల నీటి మట్టం చేరుతుందని, ఆ తరువాత సాగు, తాగు నీటిని కిందకి విడుదల చేస్తామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.


ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ.. నదుల అనుసంధానం సృష్టి కర్త సీఎం చంద్రబాబు అని, 2014 లోనే ముందు చూపుతో పట్టిసీమ నిర్మాణం చేశారని అన్నారు. కృష్ణా డెల్టాను ‌కాపాడి రైతుల ఇంట్లో పండుగ తెచ్చారని, జగన్ వచ్చాక పట్టిసీమను పడుకోపెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ ఐదేళ్లల్లో రైతులు ఇబ్బందులు పడ్డారని, దేవినేని ఉమ అప్పట్లో ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్టును పూర్తి చేయించారన్నారు. పవిత్ర సంగమం వద్ద గతంలో లాగా హారతులు కార్యక్రమం చేపట్టాలని, పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలన్నారు. పట్టిసీమతో కృష్ణా డెల్టా సస్యశ్యామలం అవుతుందని, చంద్రబాబు ముందు చూపుకు అన్నదాతల్లో ఆనందం వెల్లి వెరిస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 01:38 PM