Share News

Nara Lokesh: వారి ఆశయం త్వరలోనే నేరవేరుతుంది: నారా లోకేష్

ABN , Publish Date - Jan 25 , 2024 | 09:41 AM

కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి నిలబడి.. ప్రజా రాజధాని అమరావతి కోసం 15 వందల రోజులుగా నియంతపై పోరాడుతున్న రైతులకు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.

Nara Lokesh: వారి ఆశయం త్వరలోనే నేరవేరుతుంది: నారా లోకేష్

అమరావతి: కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి నిలబడి.. ప్రజా రాజధాని అమరావతి కోసం 15 వందల రోజులుగా నియంతపై పోరాడుతున్న రైతులకు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. వారి ఆశయం త్వరలోనే నేరవేరుతుందని లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుందని లోకేష్ అన్నారు.

రాష్ట్రం కోసం, రాజధాని కోసం వేలాది ఎకరాలు తృణప్రాయంగా త్యజించి, జగన్‌ ప్రభుత్వ నయవంచనకు బలై విధిలేని పరిస్థితిలో మొదలైన అన్నదాతల అమరావతి ఉద్యమం 1500 రోజులుగా కొనసాగుతూనే ఉంది. రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు, దళిత, బహుజన బిడ్డలు ఏకమై మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని సాగిస్తూనే ఉన్నారు. పోలీసుల నిర్బంధాలు, లాఠీల కరాళ నృత్యాలు, దేహాలపై రక్తమోడుతున్న గాయాలు.. ఏవీ వారి పోరాట పటిమను దెబ్బతీయలేకపోయాయి. అందుకే ఆ మహోద్యమం మరిచిపోలేని విజయాలతో ముందుకు సాగిపోతోంది. దేశ చరిత్రలో సుదీర్ఘ సమరశీల పోరాటంగా నిలిచిపోయింది. దేవతల రాజధానిగా పేరొందిన ఏపీ సరికొత్త రాజధాని అమరావతిని నాశనం చేస్తూ వైసీపీ ప్రభుత్వం.. మూడు రాజధానుల ప్రకటన చేసింది మొదలు రాజధాని రైతులు ఉద్యమానికి దిగారు. అయితే, వారి ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు భగ్నం చేసేందుకు సర్కారు చేయని ప్రయత్నం లేదు. మహిళలు స్నానం చేసే సమయంలో డ్రోన్‌ కెమెరాలు తిప్పి.. దీనిని అడ్డుకున్న 40 మందిపై కేసులు పెట్టి 20 రోజులపాటు జైలుపాలు చేసింది. ఇప్పటి వరకూ 2600 మందిపై 600కు పైగా కేసులు బనాయించారు. నాలుగేళ్లలో 250 మంది రైతులు గుండెలు పగిలి చనిపోయారు. బెదిరించడం, భయపెట్టడం, అవమానపరచడం, లేదంటే రెచ్చగొట్టడం, అదీ కాదంటే అక్రమంగా కేసులు పెట్టి జైళ్లలో కుక్కడం.. ఇలా రోజుకో రకంగా రైతులను వేధించారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు.

పోరాటానికి నాంది ఇలా..

రాజధాని అమరావతి నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వానికి 29 గ్రామాల పరిధిలో ఉన్న 34,322 ఎకరాల భూములను 29,881 మంది రైతులు భూ సమీకరణ కింద ఇచ్చారు. వారిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. కానీ 2019, డిసెంబరు 17న సీఎం జగన్‌ శాసన సభలో చేసిన మూడు రాజధానుల ప్రకటన రాజధాని వాసులను కుదిపేసింది. ఆ మర్నాడే రాజధాని ఉద్యమం ఊపిరిపోసుకుంది. తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో మొదలైన ఉద్యమం క్రమంగా రాజధాని గ్రామాలను చుట్టేసింది. అదే నెల 19వ తేదీన రైతులు బంద్‌ నిర్వహించారు. ఈ ఉద్యమానికి అధికార వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ సంఘీభావం ప్రకటించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌, అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ, సీపీఎం కార్యదర్శులు రామకృష్ణ, మధు గ్రామాల్లో పర్యటించి రైతులకు మద్దతు తెలిపారు.

Updated Date - Jan 25 , 2024 | 10:48 AM