YS Jagan: జగన్ మరో కుట్రకు తెరలేపారా.. వరుస ట్వీట్‌ల వెనుక కారణం అదేనా..!
ABN , Publish Date - Jun 08 , 2024 | 01:27 PM
గత ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడుపుతూ.. రాజకీయ ప్రత్యర్థులపై ఎన్నో కుట్రలకు తెరలేపారన్న విమర్శలు వైసీపీ అధినేత జగన్ మూటగట్టుకున్నారు. ఎన్నికల ముందు కూడా అధికారాన్ని, అధికారులను అడ్డం పెట్టుకుని ఎన్నో కుట్రలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
గత ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడుపుతూ.. రాజకీయ ప్రత్యర్థులపై ఎన్నో కుట్రలకు తెరలేపారన్న విమర్శలు వైసీపీ అధినేత జగన్ మూటగట్టుకున్నారు. ఎన్నికల ముందు కూడా అధికారాన్ని, అధికారులను అడ్డం పెట్టుకుని ఎన్నో కుట్రలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజాపాలనను పక్కనపెట్టి.. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించారనే అపవాదు జగన్‌పై ఉంది. మొత్తానికి ఐదేళ్ల పాలనపై విసుగుచెందిన ప్రజలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా తీర్పునిచ్చారు. మరో నాలుగు రోజుల్లో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రభుత్వం ఏర్పడకముందే జగన్ టీడీపీపై మరో కుట్రకు తెరలేపారనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
AP Politics: వైసీపీని ఓడించింది వాళ్లే.. జగన్ తీరుపై సొంత నేతల ఆగ్రహం..
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. ప్రతిపక్ష పార్టీ నాయకులపై వైసీపీ మూకల దౌర్జన్యాలు పెరిగిపోయాయని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు చెప్పినా.. పట్టించుకోని జగన్.. ప్రస్తుతం రెండు రోజుల వ్యవధిలో రెండు రకాల ట్వీట్లు చేయడం అనేక అనుమానాలను కలిగిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఏర్పడకుండానే రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించాని.. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయయని.. ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చిందంటూ జగన్ ట్వీట్ చేయడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయట. రాష్ట్రప్రజల్లో లేనిపోని అనుమానాలు కలిగించడం, ప్రభుత్వం ఏర్పడకముందు నుంచే.. కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో ఓ రకమైన వ్యతిరేకత ఏర్పడేలా చేసేందుకు జగన్ ఈ విధంగా ట్వీట్స్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా శాంతి, భద్రతలపై ఎన్నో ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం.. అధికారం నుంచి దిగిపోగానే శాంతి,భద్రతలు రాష్ట్రంలో లేవంటూ మాట్లాడటం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Congress: ఢిల్లీ అశోక హోటల్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
గతంలో ఫిర్యాదులు వచ్చినప్పుడు సీఎంగా ఉండి స్పందించని వ్యక్తి.. రాష్ట్రంలో వాతావరణం ప్రశాంతంగా ఉన్నా.. ఏదో జరిగిపోతుందనే రీతిలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే ఆలోచనతోనే జగన్ వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతుందట. ఓవైపు వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. టీడీపీ శ్రేణులు తమపై దాడులు చేస్తున్నారనే ప్రచారం చేయడం ద్వారా కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో మొదటి రోజు నుంచే వ్యతిరేకత ప్రారంభమయ్యేలా చేసేందుకే వైసీపీ ఈ విధంగా చేస్తుందనే చర్చ నడుస్తోంది.
Chennai: అన్నామలైకి కేంద్రమంత్రి పదవి? అదేగాని జరిగితే ఇక రాష్ట్రంలో అధికారపార్టీకి...
గత ఐదేళ్లూ అరాచకమే..!
వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు నిర్వహించినప్పుడు ప్రత్యర్థి పార్టీల నాయకులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసిన ఘటనలు ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. ఐదేళ్లుగా శాంతి,భద్రతలను ఏ విధంగా గాలికొదిలేశారు.. వైసీపీ నాయకులు ఏ విధమైన అరాచకాలు సృష్టించారు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీ నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది రాష్ట్రప్రజలు చూశారు. అయితే ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో శాంతి,భద్రతలకు ఎలాంటి విఘాతం ఉండదనే ఓ నమ్మకం ప్రజల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు కలిగించడం కోసం, కొత్త ప్రభుత్వంపై విశ్వాసం పోయేలా చేయడానికి జగన్ కొత్త కుట్రకు తెరలేపారనే ప్రచారం జరుగుతోంది. లేదా గత ఐదేళ్లు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయం ఇప్పుడు గుర్తొచ్చి.. తమ ప్రభుత్వంలో పరిస్థితి ఇలా ఉండేదని.. తెలియజేసే ఉద్దేశంతోనే జగన్ ఈ విధమైన ట్విట్ చేసి ఉంటారంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా కొత్త ప్రభుత్వం మెరుగైన పాలన అందించి.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రతిపక్ష పార్టీలు తగిన సహకారం అందించడం ప్రజాస్వామ్య గొప్పతనం.. కానీ ప్రభుత్వం ఏర్పడకుండానే కొత్త ప్రభుత్వాన్ని బలహీనర్చడంతో పాటు.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని.. ఇప్పటికైనా తన తీరును జగన్ మార్చుకోవాలంటూ పలువురు సూచిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుంటారా... లేదా అనేది వేచిచూడాలి.
Ganababu: మరో నెలలో వైసీపీ సగం ఖాళీ
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Andhra Pradesh News and Latest Telugu News