Share News

దసరా సందడి

ABN , Publish Date - Oct 12 , 2024 | 12:25 AM

దసర ఉత్సవాల్లో భాగంగా అశ్వయిజ శుద్ద మహర్నవమి శుక్రవారం పట్టణంలో వెలసిన వాసవీ కన్యకా పరమేశ్వరి, చౌడేశ్వరి అమ్మవార్లు మహిషాసురమర్థని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

దసరా సందడి
ఆత్మకూరులో పూల అంగళ్ల వద్ద సందడి

ఆత్మకూరు, అక్టోబరు 11: దసర ఉత్సవాల్లో భాగంగా అశ్వయిజ శుద్ద మహర్నవమి శుక్రవారం పట్టణంలో వెలసిన వాసవీ కన్యకా పరమేశ్వరి, చౌడేశ్వరి అమ్మవార్లు మహిషాసురమర్థని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా పట్టణంలోని జంబులాపరమేశ్వరీదేవి, మల్లెలమ్మ, కాళికాంబ, అంబాభవానీ ఆలయాల్లో కూడా దేవతామూర్తులు ప్రత్యేక అలంకరణలో కొలువుదీరారు. దసరా రోజున సాయంత్రం భక్తులు పట్టణ శివార్లలోని శ్రీశైలం రస్తాలో వున్న శమీ వృక్షం చుట్టూ ప్రదక్షణలు చేసి మొక్కులు తీర్చుకోనున్నారు. అక్కడి నుంచి ఆలయాలను దర్శించి తరించనున్నారు. ఇందుకోసం ఆయా ఆలయాల కమిటీ నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దసర పండుగ సందర్భంగా శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని పలు దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. అలాగే మామిడి తోరణాలు, అరటి ఆకులు, పూలు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు జనం తరలిరావడంతో పట్టణంలోని కప్పలకుంట, గౌడ్‌సెంటర్‌ తదితర ప్రాంతాల్లో రద్దీ నెలకొంది.

నందికొట్కూరు: దసరా సందర్భంగా నందికొట్కూరు పట్టణం రద్దీతో కిటకి లాడింది. ఏ షాపు చూసినా జనంతో రద్దీగా కనిపించింది. దసరా పండుగా సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు సరుకులు, కొత్త దుస్తులు, పండుగ సరుకు కోసం పట్టణానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. పండుగ సందర్భంలో రైతులు, వ్యాపారులు బంతిపూలు, మామిడాకులను రోడ్డుపైన పోసి అమ్మారు. పట్టణంలోని జమ్మిచెట్టును సిద్ధం చేశారు. పండువ సందర్భంగా జమ్మికి వెళ్లేందుకు కమిటీ సభ్యులు, మున్సిపల్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో మేళతాళాలపై జమ్మికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ దాసి సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Oct 12 , 2024 | 12:25 AM