శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం: ఈవో
ABN , Publish Date - Dec 21 , 2024 | 12:18 AM
శ్రీశైలం మహాక్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు.
శ్రీశైలం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహాక్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం సహకారంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అంతా కృషి చేయాలన్నారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్ల గురించి సంబంధిత ఆయా విభాగాధిపతులతో కూలంకషంగా చర్చించి పలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా వైదిక సిబ్బంది, ఆలయ విభాగాధిపతులు పరస్పర సమన్వయంతో ఉత్సవ కార్యక్రమాలు, స్వామి, అమ్మవార్ల కైంకర్యాలన్నీ ఎలాంటి లోటు లేకుండా సంప్రదాయబద్ధంగా జరిపించాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి విభాగం కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించి కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. యాక్షన్ ప్లాన్‌కు అణుగుణంగా ఏర్పాట్లను వెంటనే చేపట్టాలన్నారు. ఉత్సవాల్లో నిర్వహించాల్సిన వైదిక కార్యక్రమాలు, వాహన సేవలు, స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ, ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన తదితర వాటిపై చర్చించారు. పాదయాత్రగా తరలివచ్చే భక్తులకు అటవీశాఖ అధికారుల సహకారంతో ఆయా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బందోబస్తు, వసతి, వైద్య సదుపాయం, క్షేత్రపరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, పారశుద్ధ్య చర్యలు, సౌచాలయాల ఏర్పాట్లు, పాతాళగంగ వద్ద ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ, విద్యుత్ దీపాల ఏర్పాటు, సూచికబోర్డుల ఏర్పాటు తదితర వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆయా విభాగాధిపతులను ఆదేశించారు. దేవస్థానం యూనిట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, దేవస్థానం అన్ని విభాగాల అధిప తులు, పర్యవేక్షకులు, తహసీల్దార్ కేవీ శ్రీనివాసులు, అటవీశాఖ రేంజ్ అధి కారి సుభాష్‌రెడ్డి, మండల ప్రాథమిక వైద్యశాల వైద్యురాలు డాక్టర్ ఆర్.శ్రీవాణి, దేవస్థానం వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో వైద్యులు డాక్టర్ టి.శశిధర్, ఏఎస్‌ఐ బీసీ గురువయ్య, తదితరులు పాల్గొన్నారు.