స్తంభించిన జన జీవనం
ABN , Publish Date - Sep 02 , 2024 | 12:35 AM
నంద్యాల, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించి పోయింది.
నంద్యాల, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించి పోయింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. పంటలు నీట మునిగాయి. మట్టి మిద్దెలు కూలిపోయాయి. వర్షాల కారణంగా తీవ్ర నష్టం కలిగిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మకూరు, సెప్టెంబరు 1: ఆత్మకూరు ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం మధ్యా హ్నం వరకు 135.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పట్టణంలోని లోతట్టు కాలనీల్లో, రోడ్లపై వర్షపు నీరు నిలిచి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై పలు చోట్ల భారీగా వర్షపు నీరు నిలిచింది. మార్కెట్ యార్డు ప్రాంగణంలో కూడా వర్షపు నీరు చేరింది. పట్టణం మీదుగా ప్రవహించే గుండ్లకమ్మ, పీతురు వాగులు ఉధృతంగా ప్రవహించాయి. పెనుగాలుల ధాటికి పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. తహసీల్దార్ రత్నరాధిక పలు చోట్ల వరదబాధితులను పరామర్శించి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మధ్యాహ్నం కొంతమంది వరద బాధితులకు ఆహార సదుపాయం కల్పించారు.
ఆత్మకూరు పట్టణ శివార్లలోని భవనాశి నదితో పాటు పడేవాగు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో ఆత్మకూరు నుంచి కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాలతో పాటు ఆత్మకూరు మండలంలోని కురుకుంద, కొట్టాలచెరువు గ్రామాల రాకపోకలకు అంతరాయం నెలకొంది. అదేవిధంగా పడేవాగు, భవనాశి నదీ నీరు పట్టణంలోని పశువుల ఆసుపత్రికి వెళ్లే రహదారితో పాటు చుట్టుపక్కల పంటపొలాలను ముంచెత్తాయి. భవనాశి, పడేవాగు వంతెనలపై ప్రజలు వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, రూరల్ సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటనారాయణ రెడ్డి ఉధృతంగా ప్రవహిస్తున్న ఆయా వాగులను సందర్శించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. నల్లమల ఘాట్ రోడ్డులో శనివారం రాత్రి చెట్టు విరిగిపడి ట్రాఫిక్ సమస్య వాటిల్లడంతో ముందస్తు జాగ్రత్తలతో రహదారిని పర్యవేక్షించారు. భారీ వాహనాలు నల్లమల ఘాట్‌లోకి వెళ్లనివ్వకుండా చర్యలు చేపట్టారు. శ్రీశైలానికి వెళ్లే భక్తులు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆత్మకూరు డీఎస్పీ సూచించారు. టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రామలింగారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా పట్టణంలోని పలు కాలనీల్లో జరుగుతున్న వరద సహాయక చర్యలను పరిశీలించారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో వరద బాధితులకు అన్నదానం చేపట్టారు.
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు మండలంలో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటపొలాలు నీటమునిగాయి. దీంతో మండలంలోని రైతులు సాగు చేసిన పంట పొలాల్లోకి నీరుచేరి వరి, మినుము పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భవనాశివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆత్మకూరు నుంచి వడ్లరామాపురం, కురుకుంద గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు వరద రాజ స్వామి ప్రాజెక్టు నుంచి నాలుగు గేట్లను ఎత్తడంతో వరద నీరు వడ్లరామాపురం గ్రామంలోని చిన్న మల్లెలమ్మ, పెద్ద మల్లెలమ్మ చెరువులు నిండుకుండలా మారి వరద నీరు గ్రామంలోకి చేరింది. దీంతో గ్రామంలో లోతట్టు ప్రాంతం వాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందిరేశ్వరం, శ్రీపతిరావుపేట గ్రామ శివార్లలోని ఈదుల వాగు, బందం వాగులు ఉప్పొంగాయి. ముఖ్యంగా సిద్ధాపురం, సంజీవ్‌నగర్ తతండా, వడ్లరామాపురం తదితర గ్రామాల్లో లోతట్టు కాలనీలలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, మినుము పొలాలు నీట మునగడంతో పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని రాళ్ళవాగు నుంచి సిద్ధాపురం చెరువుకు వరద నీరు చేరుతుండటంతో సిధ్దాపురం చెరువులో నీరు 18 అడుగులకు చేరుకుంది. చెరువులకు చేరడంతో ఆయా ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీవో మోహన్‌కుమార్ ఇళ్లలోకి నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించారు.
బండిఆత్మకూరు: మండలంలోని పలు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మద్దిలేరువాగు, జుర్రాగు, రాళ్ళ వాగు, రాధావంక, జళ్ళవాగులు పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. బండిఆత్మకూరు, శింగవరం, సోమయాజులపల్లె, ఓంకారం మధ్య మద్దిలేరు వాగు ప్రవాహం రాకపోకలను నిలపివేసింది. అలాగే జీసీపాలెం వద్ద తెలుగుగంగ కాలువ ఉదృత ప్రవాహం నారాణపురం, శింగవరం, లింగాపురం గ్రామాల మధ్య రాకపోకలను నిలిపివేసింది. పలు గ్రామాల్లోని లోతట్టు వరినాట్ల పొలాలు నీట మునిగాయి. పెద్దదేవళాపురం, బండిఆత్మకూరు జగనన్న కాలనీలలో వరద నీరు చుటుముట్టింది. దీంతో విషపురుగుల బెడదతో ఆయా కాలనీలోని వాసులు బెంబేలెత్తిపోతున్నారు.
గోస్పాడు: రెండు రోజులుగా కరుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని రాయపాడు, తేళ్లపురి గ్రామాల మద్య ఉన్న కుందూనది బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తు ప్రమాదకరంగా మారింది. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అధికారులను, ఆ గ్రామాలలోని టీడీపీ నాయకులతో మాట్లాడి జాగ్రత్తలు తీసుకోవాలని, రాకపోకలు నిలిపివేయాలని ఆదేశించారు. బ్రిడ్జి గండ్లకు గుర్రపుడెక్క ఆకు అడ్డుపడటంతో సర్పంచ్ కాటంరెడ్డి సుధామణి, ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు. ఎండీఓ నాగఅనసూయ, తహసీల్దారు షేక్ మొహిద్దీన్, ఎస్‌ఐ వెంకటప్రసాద్ కుందూ ప్రవాహాన్ని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. టీడీపీ మండల కన్వీనర్ కాటంరెడ్డి తులసీశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి కుందూ బ్రిడ్జిపై వాహనాలు తిరగకుండా ట్రాక్టర్‌లను అడ్డుపెట్టి వలంటీర్లుగా టీడీపీ కార్యకర్తలను పెట్టి వాహనదారులకు ప్రమాద హెచ్చరికలు వివరిస్తూ వచ్చే వాహనాలను వెనక్కు పంపించారు. రాత్రి జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు. రాయపాడు, తేళ్లపురి, కూలూరు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వెలుగోడు: రైతులు వర్షాలు కురుస్తుండటంతో తమ పంటలను కాపాడు కునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఏవో పవన్‌కుమార్ సూచించారు. మండలంలోని బోయరేవుల, మోతుకూరు గ్రామాల్లో పంటలను పరిశీలించారు.
మిడుతూరు: మండలంలోని వీపనగండ్ల, తలముడిపి, రోళ్లపాడు, చింతలపల్లి, చెరుకుచెర్ల, గ్రామాల్లో ఇంటిగోడలు పడిపోయి చెరుకుచెర్ల గ్రామంలో గోడ పడి రెండు గొర్రెలు మృతి చెందగా మరో ఐదు గొర్రెలకు గాయాలు అయ్యాయి. మిడుతూరు గ్రామంలో చాకలి శ్రీనివాసులు అను వ్యక్తి నివాసంలో ఉన్న మట్టి మిద్దె మెత్తు కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది.
నందికొట్కూరు రూరల్: నందికొట్కూరు మండలంలోని వడ్డెమాను గ్రామంలో నాలుగు మట్టిమిద్దెలు కూలిపోయాయి. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య కూలిన మట్టి మిద్దెలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. తగిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అధికారులు కూడా ఎక్కడికక్కడ గ్రామాలలో అందుబాటులో ఉండాలన్నారు. ఎంపీపీ స్కూల్‌లో వసతి కల్పించారు.
పాములపాడు: మండలంలోని భవనాశి, శుద్ధవంక వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చెలిమిళ్ళ, ఇస్కాల గ్రామాలకు రాకపోకలు నిలచి పోయాయి. బానుముక్కల, చెలిమిళ్ళ గ్రామాలలోని గ్రామ శివార్లలో గల ఎస్సీ కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవనాశి నది, నిప్పులవాగు, శుద్దవంక తదితర పరివాహక ప్రాంతాల్లోని ఇస్కాల, వేంపెంట, ఎర్రగూడూరు, బానుముక్కల, కంబాలపల్లి గ్రామాలలో దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలిస్తున్నారు. పాములపాడు నుంచి ఇస్కాల, చెలిమిళ్ళ డ్రామాలకు వెల్లే రహదారులలో వాగులు పొంగి పొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇస్కాల, బానుముక్కల గ్రామాలలో లోతట్టు ప్రాంతాలలోకి వర్షపు నీరు చేరింది.
పాములపాడు, చెలిమిళ్ళ మధ్యలో పొంగి ప్రవహిస్తున్న భవనాశి, ఎద్దులవంక వాగుల ఉధృతిని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పరిశీలించారు. ప్రవాహం అధికంగా ఉన్నందున రాకపోకలను అనుమతించవద్దని అధికారులకు సూచించారు. ఇస్కాల, చెలిమిళ్ళ, లింగాల గ్రామాలలో నీట మునిగిన మెక్కజొన్న పంటను పరిశీలించారు. అనంతరం బానుముక్కల గ్రామంలోని ఎస్సీ కాలనీని వరదనీరు ముంచెత్తుతుండ టంతో కాలనీలో పర్యటించారు. బాధిత కుటుంబాలతో ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు వసతి, భోజనం, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఇళ్లను ఖాళీ చేసి అధికారులు ఏర్పాటు చేసిన ప్రాంతానికి వెళ్లాలని ప్రజలకు సూచించారు. టీడీపీ మండల కన్వీనర్ రవీంద్రరెడ్డి, వెంకటేశ్వరరావు, చెల్లె హరినాథరెడ్డి, మధుకృష్ణ , చంద్రశేఖర్, గోవిందు, సురేశ్, కరీంబాషా, మద్దిలేటి, మల్లికార్జున, లింగస్వామి, నాగలక్ష్మిరెడ్డి, రాము, సురేశ్, కలీముల్లా పాల్గొన్నారు.
కొత్తపల్లి: భారీ వర్షాలకు మండలంలోని ఆయా గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. శివపురం, లింగాపురం గ్రామాల మధ్య ఉన్న ఎద్దులేరు వాగు ఉధృతి తగ్గకపోవడంతో పది గ్రామాలకు పగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయింది. మండలంలోని దుద్యాల, నందికుంట, శివపురం, కొక్కెరంచ, ముసలిమడుగు, లింగాపురం తదితర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆదివారం పరిశీలించారు. మండలంలోని దుద్యాల గ్రామంలో గ్రామ శివారులో ఉధృతంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న భవనాసి పడేవాగును, దుద్యాలలోని మైనార్టీ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరిన లోతట్లు ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. నందికుంట గ్రామంలోని కుంట ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లు జలమయమైన ప్రాంతాలను ఎమ్మెల్యే సందర్శించారు. శివపురం శివారులోని ఎద్దులేరు వంతెన వాగు నిర్మాణానికై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట నాయకులు నారపురెడ్డి, లింగస్వామిగౌడు, రఫీ, మన్సూర్, జహరుల్లా, చంద్రశేఖర్ యాదవ్, నాగేశ్వరరావు యాదవ్, శేఖర్, మారెన్న, రాదాకృష్ణారెడ్డి ఉన్నారు.
పాణ్యం: పాణ్యం బస్టాండు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున మహబూబ్‌బాషా ఇంటి పైకప్పు కూలింది. ఆ సమయంలో పక్కనున్న గదిలో నిద్రిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వీఆర్వోలు శ్రీనివాసులు, బీరేంద్ర, సచివాలయ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, పంచాయతీ సిబ్బంది రఫిలు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులకు 20 కిలోల బియ్యం అందజేశారు. గృహ నిర్మాణానికి సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తామన్నారు. టీడీపీ నాయకులు ఖాదర్‌బాషా ఉన్నారు. ఎస్సార్బీసీ బ్లాకులకు భారీగా సాగునీరు చేరడంతో కాలువ గట్టు కోతకు గురై నీరు పంట పొలాల్లోకి చేరింది. కాలువ గట్టు కోతకు గురైనా మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. బ్లాకుల గట్లు శిథిలావస్థకు చేరడంతో నీరు పాణ్యం జూటూరు రహదారిపై పారి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. గగ్గటూరు సమీపంలోని మునుకుందువాగు ప్రమాదకరంగా మారింది. ప్రముఖ శైవక్షేత్రమైన సుబ్బరాయుని కొత్తూరుకు భక్తులు నంద్యాల ప్రాంతం నుంచి వెళ్లడానికి ఈవాగు ఆటంకంగా మారింది. అలాగే కొత్తూరు, నందివర్గం, ప్రాంతాలనుంచి నంద్యాలకు వెళ్లడానికి వాహనాలకు అంతరాయమేర్పడుతోంది.
కుందూ పరివాహక ప్రాంతాలలోని తొగర్చేడు, మద్దూరు, అనుపూరు గ్రామాల పరిధిలోని కుందూ ప్రాంతాలను తహసీల్దార్ నరేంద్రనాథరెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో నాలుగు మిద్దెలు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. ఆర్‌ఐ మహేశ్వరరెడ్డి, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారి సుందరరాజు సూచించారు.
గడివేముల: వర్షాల వల్ల గ్రామాల్లోని వీధులు జలమయమయంగా మారాయి. లోతట్టు పంట పొలాలు నీట మునిగాయి. రెండు రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో గడివేముల, బూజనూరు, బిలకలగూడురు గ్రామాల్లో మట్టి మిద్దెలు కూలేలా ఉన్నాయి. కొర్రపోలూరు గ్రామ సమీపంలో ప్రమాదకరంగా మారిన ఎస్‌ఆర్‌బీసీ బ్రిడ్జిని ఆదివారం ఈఈ వేణుగోపాల్‌రెడ్డి పరిశీలించారు. కేసీ కెనాల్‌లో చెత్తా చేదారం చేరడంతో నీళ్లు కాలువపై నుంచి పారి ఎస్‌ఆర్‌బీసీ బ్రిడ్జికి ఒక వైపు ఉన్న మట్టి కట్ట కోతకు గురి చేసింది. మట్టి కట్ట లేకపోవడంతో ఎస్‌ఆర్‌బీసీ బ్రిడ్జిపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో కొర్రపొలూరు సర్పంచ్ మాలిక్‌బాషా కోతకు గురైన ఎస్‌ఆర్‌బీసీ బ్రిడ్జి సమస్యను ఎమ్మెల్యే గౌరు చరిత దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎస్‌ఆర్‌బీసీ ఈఈ వేణుగోపాల్‌రెడ్డి ఎస్‌ఆర్‌బీసీ బ్రిడ్జి వద్ద కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. మట్టి కట్టను వేసేందుకు చర్యలు తీసుకుంటామ న్నారు. కొర్రపోలూరు నాయకులు, రైతులు ఉన్నారు.