Share News

Macharla Police: పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్‌

ABN , Publish Date - Jun 17 , 2024 | 05:21 AM

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు.

 Macharla Police: పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్‌
Pinnelli Ramakrishna Reddy

  • వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై 14 కేసులు

  • సోదరుడు వెంకట్రామిరెడ్డిపై 9 కేసులు నమోదు

  • ఇద్దరిపైనా హత్యాయత్నం కేసులు: డీఎస్పీ

మాచర్లటౌన్‌, జూన్‌ 16: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. ఇద్దరిపైనా విడివిడిగా రౌడీషీట్లు తెరిచినట్టు గురజాల డీఎస్పీ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఇక నుంచి వారిపై నిరంతరం నిఘా ఉంటుందని వివరించారు. రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం సహా 14 కేసులు నమోదయ్యాయని, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై కూడా హత్యాహత్నం సహా 9 కేసులు నమోదైనట్టు వివరించారు.

నేరాలు-ఘోరాలు!

మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల గెలుపొందేందుకు తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి హింసకు పాల్పడ్డారు. పోలింగ్‌కు ముందు రోజు మొదలుకొని పోలింగ్‌ రోజు, ఆ మరుసటి రోజు దారుణాలకు పాల్పడ్డారు.

  • మే 12న రెంటచింతలలో పిన్నెల్లి అనుచరుడు మోర్తాల ఉమమహేశ్వరరెడ్డి టీడీపీ ఏజెంట్లు మల్లయ్య, సిద్ధయ్యపై దాడి చేసి గాయపరిచాడు. మే 13 పోలింగ్‌ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెంటచింతల మండలంలోని పాలువాయిగేటు గ్రామంలో 202 పోలింగ్‌ బూత్‌లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేశారు.


  • అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై మారణాయుధాలతో దాడి చేయించారు. రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్‌ కింద కేసు నమోదైంది.

  • వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడెంలో టీడీపీ ఏజెంట్‌ రేఖ్యానాయక్‌పై దాడి చేసిన ఘటనలో కూడా రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్‌ కింద కేసు నమోదైంది.

  • పోలింగ్‌ మరుసటి రోజు కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై జరిగిన దాడిలో రామకృష్ణారెడ్డిపై 307 కేసు నమోదైంది.

  • ఇవి కాక మరో 11 ఘర్షణల్లో వివిధ సెక్షన్ల కింద రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పోలింగ్‌ మరుసటి రోజు మే 14న కారంపూడి పట్టణంలో వందలాది రౌడీ మూకలతో మారణాయులతో టీడీపీ కార్యాలయం, ప్రైవేటు ఆస్తుల ధ్వంసంలో పాల్గొనగా అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపై దాడి చేసిన సంఘటనలో 307 సెక్షన్‌ కింద కేసు నమోదైంది.

  • పోలింగ్‌ రోజు మాచర్ల పట్టణంలో టీడీపీ నేత యెనుముల కేశవరెడ్డి ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలను తన వాహనంతో ఢీకొట్టి మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటనలో గాయపడ్డ ఆదూరి అలైక్యరావుతోపాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలైన సంఘటనలో 307 కేసు నమోదైంది.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 17 , 2024 | 07:53 AM