Share News

Manda Krishna Madiga : ఊరూవాడా ‘దండోరా’!

ABN , Publish Date - Aug 02 , 2024 | 05:05 AM

మూడు దశాబ్దాలకుపైగా అలుపెరగని ఉద్యమం! అనేక బలిదానాలు... వేలాది కేసులు! భారీ బహిరంగ సభలు! నిరాహార దీక్షలు... చైతన్య యాత్రలు! ఏళ్లు గడుస్తున్నా వెనుకడుగు వేసిందే లేదు! గమ్యం చేరేదాకా తగ్గేదే లేదు. ఇది.. ఎమ్మార్పీఎస్‌ ‘వర్గీకరణ’ ఉద్యమం సాగిన తీరు.

Manda Krishna Madiga : ఊరూవాడా ‘దండోరా’!

  • అలుపెరగనిఎమ్మార్పీఎస్‌ ప్రస్థానం

  • వర్గీకరణకు సభలు, యాత్రలు, దీక్షలతో మంద కృష్ణ పోరాటం

  • చంద్రబాబు హయాంలో నాలుగేళ్లు ఫలాలు

  • సాంకేతిక కారణాలతో జీవోను నిలిపిన సుప్రీంకోర్టు

  • పార్లమెంటులో సవరణ బిల్లుకోసం ఎమ్మార్పీఎస్‌ పోరు

  • ఇన్నేళ్లకు రాష్ట్రాలకే అధికారమిచ్చిన సుప్రీం కోర్టు

30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. గాంధీభవన్‌ ముట్టడిలో ఎమ్మార్పీఎ్‌సకు చెందిన నలుగురు నాయకులు అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడగా... వారిలో ముగ్గురు మరణించారు.

23,560 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో మూడుసార్లు ఏకగ్రీవ తీర్మానాలు జరిగాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మూడు దశాబ్దాలకుపైగా అలుపెరగని ఉద్యమం! అనేక బలిదానాలు... వేలాది కేసులు! భారీ బహిరంగ సభలు! నిరాహార దీక్షలు... చైతన్య యాత్రలు! ఏళ్లు గడుస్తున్నా వెనుకడుగు వేసిందే లేదు! గమ్యం చేరేదాకా తగ్గేదే లేదు. ఇది.. ఎమ్మార్పీఎస్‌ ‘వర్గీకరణ’ ఉద్యమం సాగిన తీరు.

మాదిగలకు రిజర్వేషన్‌ ప్రస్తావన వస్తే గుర్తుకొచ్చేది.. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌), దండోరా ఉద్యమం, మందకృష్ణ మాదిగ! షెడ్యూల్డ్‌ కులాల జాబితాల్లో ఉన్న వారందరికీ సమానంగా రిజర్వేషన్‌ ఫలాలు అందించడానికి వర్గీకరణ సిద్ధాంతంతో ఇది ఆవిర్భవించింది.

ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ‘దండోరా’ పేరుతో ఉద్యమాన్ని కొనసాగించారు. ఎమ్మార్పీఎస్‌ మొదటి సమావేశం 1995 మే 31న ఒంగోలులో జరిగింది. ఉద్యోగ, విద్యార్థి, యువసేన, మహిళా సమాఖ్య వంటి విభాగాలను ఏర్పాటుచేసి శక్తిమంతమైన సంస్థగా ఎదిగింది.


చలో హైదరాబాద్‌..

1996 మార్చి 2న హైదరాబాద్‌ నిజాం కళాశాల మైదానంలో మందకృష్ణ నేతృత్వంలో సుమారు 5 లక్షల మంది మాదిగలతో తొలి రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. వర్గీకరణ పోరాటంలో ఇదో కీలక ఘట్టం. మార్చి 25న నిజాం కళాశాలలోని జగజ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద 80 వేల మంది మాదిగలతో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ర్యాలీ అనంతరం సమావేశానికి అప్పటి సీఎం చంద్రబాబు, మాదిగ మంత్రులు హాజరయ్యారు.

వర్గీకరణకు చంద్రబాబు హామీ ఇచ్చారు. 1996 సెప్టెంబరు 2న ఇందిరా పార్క్‌ నుంచి బాబూ జగజ్జీవన్‌రామ్‌ విగ్రహం వరకు జరిగిన భారీ ర్యాలీలో 2 లక్షల మందికి పైగా మాదిగలు పాల్గొన్నారు. టీడీపీకి చెందిన మాదిగ ఎమ్మెల్యేల బృందాన్ని పంపి... మాదిగలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాత్రి 10 గంటలకు స్వయంగా జోక్యం చేసుకుని 45 రోజుల్లోగా విచారణ జరిపి వర్గీకరణ చేస్తామని ప్రకటించారు.

కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కాగా, వర్గీకరణకు మద్దతుగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు మంద కృష్ణ మహా పాదయాత్ర (లాంగ్‌మార్చ్‌)లు నిర్వహించారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి నుంచి హైదరాబాద్‌లోని ఆయన అధికారిక నివాసం వరకు 1052 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

అదే సమయంలో కమిషన్‌ నివేదికను సమర్పించింది. 1997లో హైదరాబాద్‌లో మహాపాదయాత్ర ముగిసినప్పుడు ప్రభుత్వం తమ డిమాండ్‌ను అంగీకరించే వరకు వెళ్లేది లేదని దండోరా నాయకులు భీష్మించారు. అయితే, కమిషన్‌ నివేదిక ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీగా వర్గీకరిసూ టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


న్యాయ స్థానాల్లో...

వర్గీకరణ జీవోను సవాల్‌ చేస్తూ మాల మహానాడు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసింది. సాంకేతిక కారణాలతో జీవోను కోర్టు సస్పెండ్‌ చేసింది. సాంకేతిక సమస్యలను సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్‌ను సంప్రదించి మొత్తం సమాచారాన్ని సమర్పించింది.

1998 అక్టోబరు 1న ప్రభుత్వం వర్గీకరణపై ఆర్డినెన్స్‌ ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రివర్గం అంగీకరించి గవర్నర్‌కు పంపారు. గవర్నర్‌ దానిని రాష్ట్రపతి అభిప్రాయానికి పంపారు. 1999 నవంబరు30న రాష్ట్రపతి వర్గీకరణకు ఆర్డినెన్స్‌ జారీకి అనుమతించారు. 1999 డిసెంబరు 9న గవర్నర్‌ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2000 ఏప్రిల్‌ 1న జీవో ఇచ్చింది.

కానీ, మాల మహానాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వర్గీకరణ అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందంటూ 2004 నవంబరు 5న వర్గీకరణ జీవోను కొట్టివేసింది. ఈ నాలుగేళ్ల కాలంలో మాదిగలు వర్గీకరణ ఫలాలను అనుభవించారు.


వైఎస్‌ హయాంలో...

2004 నవంబరు 16న కడప జిల్లాలోని వైఎస్‌ జన్మస్థలం బలపనూరు నుంచి ‘చైతన్య యాత్ర’ ప్రారంభించిన మంద కృష్ణ జీపులో రాష్ట్రమంతా పర్యటించారు. ప్రభుత్వం 2004 డిసెంబరు 10న ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయినా వర్గీకరణ కల నెరవేరలేదు.

బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వరకు ‘మాదిగల ధర్మ యుద్ధ మహా పాదయాత్ర’, అమలాపురం నుంచి హైదరాబాద్‌కు ‘తిరుగుబాటు మహాపాదయాత్ర’లు చేశారు. యాత్ర ముగింపు రోజున ఇందిరా పార్కు వద్దకు వేలాదిగా మాదిగలు తరలివచ్చారు. రాజ్యాంగ సవరణకు 24 గంటల గడువిచ్చి ధర్నా ప్రారంభించారు. వైఎస్‌ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ప్రకటించింది. 2007 మే 17న లక్షలాదిమందితో విజయవాడ సింగ్‌నగర్‌ స్టేడియంలో విశ్వరూప మహాసభ నిర్వహించారు.

వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం కమిషన్‌కు చైర్మన్లను నియమించినా వారెవరూ బాధ్యతలు స్వీకరించలేదు. ఈ జాప్యాన్ని నివారించేందుకు మందకృష్ణ మాదిగ 2007 మే 17న సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు.

ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటం, ఉద్యమ తాకిడికి తట్టుకోలేని వైఎస్‌ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 2007 మే 21న ఉషా మెహ్రాను చైర్మన్‌గా నియమించేలా చూసింది. ఆమె నివేదిక సిద్ధం చేసినా సమర్పణలో జాప్యం జరిగింది. దీనిపై ఎమ్‌ఆర్‌పీఎస్‌ మరోసారి ఉద్యమం చేసింది. జస్టిస్‌ ఉషా మెహ్రా 2008 మే 1న నివేదికను సమర్పించారు.

డిసెంబరు14న మంద కృష్ణ నిరాహార దీక్ష ప్రారంభించి వర్గీకరణ బిల్లును పార్లమెంటులో పెట్టినప్పుడే విరమిస్తానని చెప్పారు. కాగా, జస్టిస్‌ ఉషా మెహ్రా కమిషన్‌ వర్గీకరణను సమర్థించినా తదుపరి చర్యలు తీసుకోకపోవడంతో 2009 ఫిబ్రవరి 16న విశ్వరూప మహా సభను నిర్వహించారు. ఫిబ్రవరిన 4న అసెంబ్లీని ముట్టడించారు. పార్లమెంటులో సవరణ బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో 2010 డిసెంబరు 4న నిజాం కళాశాలలో యుద్ధభేరి నిర్వహించారు. ఆ తర్వాత కృష్ణ వర్గీకరణపై రాజ్యాంగ సవరణపై హామీ ఇవ్వాలంటూ ఆమరణ దీక్ష చేపట్టారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ మేరకు విరమించారు.


వర్గీకరణ కోసం అనంతవాసి తొలి ఆత్మార్పణం

తాడిపత్రి, ఆగస్టు 1: ఎస్సీ వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణత్యాగం చేసిన తొలి వ్యక్తి తెల్లబండ్ల రవి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఈయన డిగ్రీ చదివారు. ఉద్యోగం రాకపోవడంతో గ్రామంలోనే వ్యవసాయ కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు.

Untitled-4 copy.jpg

ఎస్పీ వర్గీకరణ జరిగితేనే తనలాంటి వారికి న్యాయం జరుగుతుందని నమ్మేవారు. ఈ క్రమంలో ఎమ్మార్పీఎ్‌సలో చేరి.. 1994 నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 1998లో హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఆమరణ దీక్షకు దిగారు. ఆయనకు మద్దతుగా ఆ ఏడాది జూన్‌ 9న తెల్లబండ్ల రవి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు.

రవి శరీరం బాగా కాలింది. ఆయన్ను హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులు మృత్యువుతో పోరాడి జూన్‌ 14న రవి తుది శ్వాస విడిచారు. ఆయన ప్రాణత్యాగానికి గుర్తుగా యర్రగుంటపల్లిలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు స్తూపం నిర్మించారు.


ప్రకాశంలో పుట్టిన మాదిగ దండోరా.!

మాదిగ దండోరా (ఎమ్మార్పీఎస్‌ ఉద్యమం) పుట్టింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మారుమూల గ్రామం ఈదుముడిలో..! అదివరకే ఆ ఊరిలో సామాజిక స్పృహ కలిగిన మాదిగ యువకులు చెరువు నీళ్ళ కోసం, భూపంపకాల్లో సమన్యాయం కోసం పోరాడిన సందర్భాలున్నాయి. వారిలో కొమ్మూరి విజయకుమార్‌ ఒకరు.

కారంచేడు దుర్మార్గాన్ని నిరసిస్తూ పురుడుపోసుకొన్న ‘దళిత మహాసభ’లో జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో మాదిగలను తగిన ప్రాధాన్యత లభించడం లేదంటూ నాయకత్వాన్ని విజయకుమార్‌ ప్రశ్నించారు. ఆ తర్వాత ఒంగోలు వేదికగా జరిగిన ‘శక్తి ప్రదర్శన్‌’ సమావేశంలో విజయకుమార్‌ను దళిత మహాసభ నాయకులు వేదిక మీదకు ఆహ్వానించకుండా అవమానించారని ఒంగోలుకు చెందిన సామాజికవేత్త కత్తి కల్యాణ్‌ వివరించారు.

అదే సభలో పాల్గొనడానికి వచ్చిన మంద కృష్ణను కలిసిన విజయకుమార్‌.. విద్య, ఉద్యోగ అంశాలలో మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై సుదీర్ఘంగా చర్చించారు. జనాభాలో ఎక్కువగా ఉన్న మాదిగలకు రిజర్వేషన్‌ ఫలాలు అందడంలో తలెత్తుతున్న నష్టాన్ని వివరించారు. అప్పుడప్పుడే ప్రారంభమైన కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి స్ఫూర్తితో మరో 13 మంది స్థానిక మాదిగ యువతతో కలిసిన మంద కృష్ణ.. 1994, జూలై 7న ఈదుముడిలో ఎమ్మార్పీఎ్‌సను స్థాపించారు.

Updated Date - Aug 02 , 2024 | 05:13 AM