Share News

తల్లిని అవమానిస్తే సహించాలా?

ABN , Publish Date - Nov 15 , 2024 | 03:56 AM

శాసన మండలిలో విపక్షంపై మంత్రి నారా లోకేశ్‌ నిప్పులు చెరిగారు. చంద్రబాబు తమ హయాంలో శాసనసభకు రాకుండా పారిపోయారంటూ వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.

తల్లిని అవమానిస్తే సహించాలా?

శాసన మండలిలో విరుచుకుపడ్డ మంత్రి లోకేశ్‌

అసెంబ్లీలో నా తల్లిని అవమానించారు.. ఆ తర్వాతే సభను బాబు బహిష్కరించారు

గౌరవ సభగా మారాకే వస్తానన్నారు.. ఆయన పారిపోలేదు.. సింహంలా నిలబడ్డారు

నాడు టీడీపీ ఎమ్మెల్యేలంతా సభకు హాజరయ్యారు.. నేడు వైసీపీ ఎమ్మెల్యేలు రారేం?

మీలాగా మేం ఎన్నడూ మాట్లాడలేదు: లోకేశ్‌

నాటి ఘటనలను సమర్థించడంలేదన్న విపక్ష నేత బొత్స

టికెట్లు ఇవ్వడం సమర్థించడం కాదా అని లోకేశ్‌ ప్రశ్న

అమరావతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): శాసన మండలిలో విపక్షంపై మంత్రి నారా లోకేశ్‌ నిప్పులు చెరిగారు. చంద్రబాబు తమ హయాంలో శాసనసభకు రాకుండా పారిపోయారంటూ వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. నాడు అసెంబ్లీలో చంద్రబాబు సింగిల్‌గా, సింహంలా నిలబడ్డారని తెలిపారు. తన తల్లిని అవమానించిన తర్వాతే... ఈ కౌరవ సభలో అడుగు పెట్టేదిలేదని ప్రకటించి బహిష్కరించారని గుర్తు చేశారు. ఆ తర్వాత కూడా టీడీపీ సభ్యులు సభకు వచ్చారని తెలిపారు. జగన్‌తోసహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలున్నారని... వారు ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావడంలేదని లోకేశ్‌ నిలదీశారు. గురువారం శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. సభ ప్రారంభమైనప్పటి నుంచే వాతావరణం వేడెక్కింది. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు పడలేదని వైసీపీ సభ్యులు పదేపదే ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ వాటి అమలు ఎక్కడ అని ప్రశ్నించారు. దీనికి మంత్రులు గట్టిగా సమాధానమిచ్చారు. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలనూ అమలు చేయడంలేదంటున్నారని మంత్రులు మండిపడ్డారు. ‘‘వైసీపీ సభ్యులు అసత్యాలు, అర్ధ సత్యాలు చెబుతున్నారు.

వీళ్ల నాయకుడు శాసన సభకు రారు. వీళ్లు మండలిలో అసత్యాలు చెప్పి రెచ్చగొడుతున్నారు. వీళ్ల నాయకుడు సభకు రాకుండా పారిపోయారు. వీళ్లూ పారిపోతారు’’ అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. దీంతో తమ హయాంలో చంద్రబాబు సభ నుంచి పారిపోయారంటూ వైసీపీ సభ్యులు వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి లోకేశ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ హయాంలో చంద్రబాబు ప్రతి రోజూ అసెంబ్లీకి వచ్చారని, తన తల్లిని అవమానించిన తర్వాతే బాయ్‌కాట్‌ చేశారని చెప్పారు. కౌరవ సభ గౌరవసభ అయిన తర్వాతే వస్తానని ప్రకటించారు. ఆ తర్వాత కూడా తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. అదీ తమ చిత్తశుద్ధి అన్నారు. లోకే్‌శ్‌ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ... తల్లిని, చెల్లిని, కుటుంబ సభ్యులను అవమానిస్తే ఎవరూ ఒప్పుకోరన్నారు. గతంలో జరిగిన ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించడంలేదని తెలిపారు. దీనిపై లోకేశ్‌ మాట్లాడుతూ... ‘‘ఆ రోజు అవమానించినవారికే టికెట్లు ఇచ్చారు. కదా? అది సమర్థించడం కాదా?’’ అంటూ బొత్సను ప్రశ్నించారు.

Updated Date - Nov 15 , 2024 | 06:30 AM