AP Rains: మంత్రి లోకేష్ నిరంతర సమీక్ష.. ముమ్మరంగా సహాయక చర్యలు..
ABN , Publish Date - Sep 02 , 2024 | 07:12 PM
వరద సహాయక చర్యలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి లోకేష్ నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ముంపునకు గురైన సింగ్ నగర్, జక్కంపూడి, కండ్రిగ, అజిత్ సింగ్ నగర్, డాబా కొట్ల సెంటర్, లూనా సెంటర్ ప్రాంతాల్లోని..
అమరావతి, సెప్టెంబర్ 02: వరద సహాయక చర్యలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి లోకేష్ నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ముంపునకు గురైన సింగ్ నగర్, జక్కంపూడి, కండ్రిగ, అజిత్ సింగ్ నగర్, డాబా కొట్ల సెంటర్, లూనా సెంటర్ ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్‌పై అంతస్థుల్లో నివసిస్తున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు.
6 హెలీకాప్టర్ల ద్వారా పులిహోర, బిస్కెట్లు, మందులు, వాటర్ బాటిళ్లు, సాఫ్ట్ డ్రింక్స్ ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు పంపిణీ చేస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070 లకు వస్తున్న విన్నపాలపై ఎప్పటికప్పుడు స్పందించేలా ఏర్పాట్లు చేశారు. ఐవిఆర్ఎస్ ద్వారా వరద బాధిత ప్రాంతాల ప్రజల నుంచి సహాయ చర్యలను అధికార యంత్రాంగం వాకబు చేస్తోంది. వరద ముంపు ప్రాంతాల్లో 3.9లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
తగ్గుముఖం పట్టిన వరద..
కృష్ణా నది వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 11.41 లక్షల క్యూసెక్కుల నుంచి 11.33 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా కృష్ణలంక పరిసరాలన్నీ నీట మునిగాయి. అక్కడ ఉన్న శ్మశానం ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టకుండా వదిలివేయడం వల్లే ఈ నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు..
జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి చెరువులు అన్ని పరిమితికి మించి పొంగి పొర్లుతున్నాయి. వరదలు పోటెత్తుతున్నాయి. చెరువులు పొంగి వరద నీరు రోడ్లపై ప్రవహించటంతో పలు చోట్ల ప్రధాన రహదారులపై గుంతలు ఏర్పడ్డాయి. కొన్ని గ్రామాల మధ్య వరద రహదారులపై పోర్లటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువ నుండి వరదలు పోటెత్తడంతో చెరువులకు సైతం గండ్లు పడ్డాయి. దీంతో వరద నీరు పంట పొలాలను ముంచేత్తాయి.
తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వలన తిరువూరు ప్రారంతంలోని అన్ని చెరువులు పరిమితికి మించి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహంతో అక్కపాలెం కనుకుల చెరువు వంతెన రహదారిపై భారీ వృక్షాలు కుప్పకూలాయి. చెట్టు వంతెనపై అడ్డంగా పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరువూరు - మచిలీపట్నం రహదారిపై వాగు వరద రోడ్డుపై ప్రవహించటంతో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు అధికారులు.
ఇప్పటి వరకు 15 మంది మృతి..
ఆంధ్రప్రదేశ్‌లో వరదల కారణంగా ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వరదల్లో ముగ్గురు గల్లంతవగా.. 20 జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. 3,79,115 ఎకరాల్లో వ్యవసాయ పంట నష్టం జరిగింది. 34 వేల ఎకరాల్లో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. 1067.57 కిలో మీటర్లు మేర రోడ్లు దెబ్బతిన్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో అత్యధికంగా వరి పంటకు అపార నష్టం చోటు చేసుకుంది.