Share News

Minister Rampasada Reddy : ఆర్టీసీని గాడిలో పెడుతున్నాం

ABN , Publish Date - Dec 21 , 2024 | 03:52 AM

రాష్ట్ర ప్రజా రవాణా శాఖను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం.రాంప్రసాదరెడ్డి అన్నారు.

Minister Rampasada Reddy : ఆర్టీసీని గాడిలో పెడుతున్నాం

  • గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంస్థ దెబ్బతింది

  • సిబ్బంది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం

  • రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

  • విశాఖలో కార్గో పార్శిళ్ల డోర్‌ డెలివరీ ప్రారంభం

విశాఖపట్నం, డిసెంబరు 20(ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ప్రజా రవాణా శాఖను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం.రాంప్రసాదరెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్గోలో బుక్‌ చేసే పార్శిళ్లను డోర్‌ డెలివరీ చేసే సదుపాయాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా విశాఖ ద్వారకా బస్‌స్టేషన్‌లో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఏపీఎ్‌సఆర్టీసీని నిర్లక్ష్యం చేయడంతో సంస్థ బాగా దెబ్బతిందని, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తిరిగి గాడిన పెట్టే చర్యలు ప్రారంభించామని చెప్పా రు. ఇప్పటికే ఆర్టీసీకి కొత్తగా 700 బస్సులు అందజేశామని, త్వరలోనే మరో 550 ఇస్తామన్నారు. సిబ్బంది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న నైట్‌ అలవెన్సులను అందజేస్తూ జీవో జారీచేశామన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీలో పెనుమార్పులు తీసుకురాబోతున్నామన్నారు. ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించుకుంటామని, అన్యాక్రాంతమైన వాటిపై లోతుగా విచారణ జరిపిస్తామని చెప్పారు. అంతకుముందు మంత్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పాడేరు బస్సు ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. తర్వాత కాంప్లెక్స్‌ ఆవరణలో పరిశుభ్రతను, షాపుల్లోని ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. కాంప్లెక్స్‌ ఆవరణలో సీసీ కెమెరాలను తక్షణం మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఆర్టీసీ జోన్‌-1 చైర్మన్‌ దొన్నుదొర, ఇన్‌చార్జి రీజినల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు, చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.


రాష్ట్రాన్ని కీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం

విజయనగరం టౌన్‌: రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి అన్నారు. విజయనగరంలోని విజ్జీ క్రీడా ప్రాంగణంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఖేల్‌ ఇండియా మల్టీపర్పస్‌ ఇండోర్‌ హాల్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘గత వైసీపీ ప్రభుత్వం క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు కనీస ప్రోత్సాహం అందించలేదు. క్రీడా రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రాష్ట్రంలో తీసుకువచ్చాం. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌ను 2శాతం నుంచి 3 శాతానికి పెంచాం. అన్ని ప్రాంతాల్లో క్రీడా మైదానాలు, అకాడమీలు ఏర్పాటు చేస్తున్నాం. 2027లో అమరావతిలో జాతీయ క్రీడలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎ్‌సఎంఈ, సెర్ప్‌, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, విజయనగరం శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 03:52 AM