Share News

Minister Vasamshetty : పరిశ్రమలలో భద్రతపై సీఎం ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Dec 06 , 2024 | 05:45 AM

పరిశ్రమలలో భద్రతపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమను మరో మంత్రి సవితతో కలిసి గురువారం ఆయన సందర్శించారు. కియలో కార్మికుల భద్రత గురించి ఆరా తీశారు.

Minister Vasamshetty : పరిశ్రమలలో భద్రతపై సీఎం ప్రత్యేక దృష్టి

  • ఇతర పరిశ్రమలకు కియా ఆదర్శం: మంత్రి వాసంశెట్టి

హిందూపురం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): పరిశ్రమలలో భద్రతపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమను మరో మంత్రి సవితతో కలిసి గురువారం ఆయన సందర్శించారు. కియలో కార్మికుల భద్రత గురించి ఆరా తీశారు. కియా సేఫ్టీ అధికారి రియాజ్‌ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫైర్‌ మాక్‌డ్రిల్‌, గ్యాస్‌ లీకేజీ డెమోను మంత్రులు తిలకించారు. అకస్మాత్తుగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే పరిశ్రమలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్‌ మాట్లాడుతూ... ‘ఇతర పరిశ్రమలకు కియా ఆదర్శంగా నిలుస్తుంది. కియా అనుబంధ పరిశ్రమల్లో సుమారు 20వేల మంది ఉపాధి పొందుతుండటం హర్షణీయం. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పలు పరిశ్రమల్లో భద్రతా లోపాలు తలెత్తాయి. 34 మంది మరణించారు. అలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సీఎం చంద్రబాబు వసుధమిశ్ర కమిటీ ఏర్పాటు చేశారు. పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలు, భద్రతా లోపాలను కమిటీ పరిశీలించి.. నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. కియలో కార్మికుల భద్రత కోసం తీసుకున్న చర్యలను ఇతర పరిశ్రమలు కూడా పాటించాలి’ అని అన్నారు. కియా ట్రైనింగ్‌ సెంటర్‌లో యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సవిత సూచించారు. కియాతో రాష్ట్రానికి, జిల్లాకు ఎంతో గుర్తింపు వచ్చిందని అన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 05:45 AM