AP News: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చేదు అనుభవం
ABN , Publish Date - Jan 30 , 2024 | 08:56 AM
వైఆర్ఎస్ సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు ఇబ్రహీంపట్నం మండలంలో చేదు అనుభవం ఎదురయ్యింది. మూలపాడు గ్రామానికి సోమవారం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ రాగా మహిళలు తమ సమస్యలను చెప్పడం ప్రారంభించారు.
ఎన్టీఆర్ జిల్లా: వైఆర్ఎస్ సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు (Vasantha Krishna Prasad) ఇబ్రహీంపట్నం మండలంలో చేదు అనుభవం ఎదురయ్యింది. మూలపాడు గ్రామానికి సోమవారం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వచ్చారు. ఎమ్మెల్యే రాగానే మహిళలు తమ సమస్యలను చెప్పడం ప్రారంభించారు. గ్రామంలో మంచినీటి సదుపాయం లేదని, సరయిన రహదారులు లేవని నిలదీశారు. మహిళలు అడిగిన సమస్యలపై ఎమ్మెల్యే స్పందించలేదు. అక్కడినుంచి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వెళ్లిపోయారు.
సర్వేలో నెగిటివ్ రిపోర్ట్
మైలవరం అసెంబ్లీ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి వసంత కృష్ణ ప్రసాద్ గెలుపొందారు. ఈ సారి ఆయనకు వైసీపీ టికెట్ వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చేయించిన సర్వేలో కృష్ణ ప్రసాద్‌కు నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని సమాచారం. మైలవరం నుంచి మరొకరిని బరిలోకి దింపాలని సీఎం జగన్ భావిస్తోన్నారని తెలిసింది. ఇదే అంశాన్ని మీడియా ప్రతినిధులు కృష్ణ ప్రసాద్‌ను ప్రశ్నించారు. టికెట్ ఇస్తే పోటీ చేస్తానని ఆయన స్పష్టంచేశారు. ఫిబ్రవరి 4, 5వ తేదీల్లో మీడియా ముందుకు వస్తానని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తేల్చిచెప్పారు.
సొంత ప్రభుత్వంపై విమర్శలు
అంతకుముందు కృష్ణ ప్రసాద్ సొంత ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్లు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో చేసిన పనుల కోసం వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు రోజు తన ఇంటికి వస్తున్నారని పేర్కొన్నారు. సర్వేలో కృష్ణ ప్రసాద్‌కు నెగిటివ్ రిపోర్ట్ రావడం, సొంత ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడంతో టికెట్‌పై సందిగ్ధం ఏర్పడింది. అయినప్పటికీ నియోజకవర్గంలో కృష్ణ ప్రసాద్ పర్యటిస్తున్నారు. ఆ సందర్భంలో మహిళలు నిలదీశారు. మరోవైపు విపక్ష నేతల మాటల దాడి కంటిన్యూ అవుతోంది. ఇలా కృష్ణ ప్రసాద్‌కు ఇంటా, బయటా వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వీటిని ఆయన ఎలా ఎదుర్కొనున్నారో చూడాలి మరి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.