Fastest Checkmate : చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Dec 23 , 2024 | 03:56 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ తనయుడు.. నారా దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
175 క్లిష్టమైన పజిల్స్ 11.59 నిమిషాల్లో పూర్తి
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్
భారత చెస్ క్రీడాకారులే అతనికి ప్రేరణ: లోకేశ్
గర్వపడుతున్నా లిటిల్ గ్రాండ్ మాస్టర్: సీఎం
అమరావతి, హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ తనయుడు.. నారా దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొమ్మిదేళ్ల దేవాన్ష్.. చదరంగంలో 175 క్లిష్టమైన పజిల్స్‌ను రికార్డు స్థాయిలో 11 నిమిషాల 59 సెకన్లలోనే పూర్తిచేసి ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5,334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో ఈ పోటీ నిర్వహించగా... ఆదివారం లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్ అందింది. కాగా.. ఇటీవల దేవాన్ష్ చెస్‌లో మరో రెండు ప్రపంచ రికార్డులు కూడా సాధించాడు. 7 డిస్క్టవర్ ఆఫ్ ఆఫ్ హనోయిని కేవలం 1.43 నిమిషాల్లో పూర్తిచేశాడు. 9 చెస్ బోర్డులను కేవలం ఐదు నిమిషాల్లో అమర్చాడు. చిన్న వయసులోనే తనయుడు సాధించిన విజయంపై లోకేశ్ స్పందించారు. దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోక్‌సతో శిక్షణ పొందడం తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత చెస్ క్రీడాకారుల అద్భుత ప్రదర్శనల నుంచి దేవాన్ష్ ప్రేరణ పొందాడని అన్నారు. దేవాన్ష్‌కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు.
వెల్డన్.. దేవాన్ష్: చంద్రబాబు
దేవాన్ష్ ప్రదర్శనపై తాత, ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ‘వెల్డన్ నారా దేవాన్ష్’ అంటూ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ‘ప్రపంచ రికార్డు సాధించిన దేవాన్ష్‌కు నా అభినందనలు. దీని కోసం కొన్ని నెలలుగా ఎంతో శ్రద్ధతో కష్టపడ్డావు. నిన్ను చూసి గర్వపడుతున్నా లిటిల్ గ్రాండ్ మాస్టర్’ అని ట్వీట్ చేశారు. మంత్రులు కె.అచ్చెన్నాయుడు, రాంప్రసాద్‌రెడ్డి, కె.పార్థసారథి కూడా దేవాన్ష్‌కు అభినందనలు తెలిపారు. లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా తనయుడి ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.