Nara Lokesh : సంక్షేమానికి కోత పెట్టం
ABN , Publish Date - Aug 16 , 2024 | 04:48 AM
సీఎం చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలకు ఎలాంటి కండీషన్లు ఉండవని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అనవరమైన నిబంధనలతో సంక్షేమ కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లో కోత పెట్టబోమన్నారు.
సూపర్ సిక్స్ హామీలకు కండీషన్లు ఉండవు
స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి లోకేశ్
గుంటూరు, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలకు ఎలాంటి కండీషన్లు ఉండవని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అనవరమైన నిబంధనలతో సంక్షేమ కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లో కోత పెట్టబోమన్నారు. గురువారం ఉదయం గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి లోకేశ్ ముఖ్యఅతిథిగా పాల్గొని సందేశాన్నిచ్చారు. తొలుత జాతీయ జెండాని ఎగుర వేసి ఓపెన్ టాప్ వాహనంలో పరేడ్‌ని సందర్శించారు. అనంతరం వేడుకలకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
యువతకు 20 లక్షల ఉద్యోగా కల్పన హామీ అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ, ప్రతీ మహిళకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం, ప్రతీ రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని పునరుద్ఘాటించారు.
ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి, అహింస అనే ఆయుధాలతో స్వేచ్ఛని సాధించుకున్నారని మంత్రి చెప్పారు. ప్రజలు, ప్రజాసంఘాలు మాట్లాడేందుకు స్వేచ్ఛ లభించిందన్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చిందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్య్ర వేడుకల్లో అందరి కళ్లలో ఆనందం కనిపిస్తున్నదని చెప్పారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనకు అన్నతో సమానమని మంత్రి లోకేశ్ తన విధేయతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.