Nara Lokesh: ఐదేళ్లలో మూతపడిన బడులెన్ని?
ABN , Publish Date - Jun 16 , 2024 | 03:01 AM
విద్యా వ్యవస్థలో మార్పులకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారు. శనివారం ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్లకు కారణాలేమిటి?
ఏడాదిలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయాలి
ఇంటర్ విద్యార్థులకు నెలలోగా పాఠ్యపుస్తకాల పంపిణీ
ఇకపై పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు
ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన ఐటీ పాలసీ
పాఠశాల విద్య, ఐటీ శాఖలపై మంత్రి లోకేశ్ సమీక్ష
మధ్యాహ్న భోజనం అమలు, నాణ్యతపై ఆరా
పాఠశాల విద్య, ఐటీ, ఎలక్ర్టానిక్స్ శాఖలపై మంత్రి లోకేశ్ సమీక్ష
అమరావతి(ఆంధ్రజ్యోతి)/ మంగళగిరి, జూన్ 15: విద్యా వ్యవస్థలో మార్పులకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారు. శనివారం ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అందుకు కారణాలు కూడా తెలపాలని, గ్రామాల్లో విద్యార్థులకు బడులు ఎంత దూరంలో ఉన్నాయనే వివరాలు సేకరించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ర్టాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలన్నారు. బైజూస్ కంటెంట్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల వినియోగంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా స్టూడెంట్ కిట్లు అందజేయాలని, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు జూలై 15లోగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు అందించాలని ఆదేశించారు.
రీయింబర్స్‌మెంట్ బకాయిల వివరాలివ్వండి
రాష్ట్రవ్యాప్తంగా విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు ఇవ్వాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. వివాదాస్పద వీసీలు, వర్సిటీల్లో అవినీతి ఆరోపణలపై కూడా నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఐటీ ఎలకా్ట్రనిక్ హబ్బులుగా విశాఖ, తిరుపతి
రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన ఐటీ పాలసీ తీసుకొస్తామని మంత్రి లోకేశ్ చెప్పారు. ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖ ముఖ్య అధికారులతో సమీక్షించారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గాను, తిరుపతిని ఎలకా్ట్రనిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
‘ఉద్యాన’ వీసీని రీకాల్ చేయాలి
డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. వీసీని రీకాల్ చేయాలని, వీసీ పదవీ కాలంలో నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ జరిపించాలని వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కోరింది.
లోకేశ్ ‘ప్రజా దర్బార్’
మంగళగిరి సిటీ, జూన్ 15: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు మంత్రి లోకేశ్ శనివారం ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. మంగళగిరి ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. ప్రజా దర్బార్‌లో నియోజకవర్గ ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అన్నీ సావధానంగా విన్న లోకేశ్ వాటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.