Share News

Nara Lokesh : నియోజకవర్గానికో మోడల్‌ లైబ్రరీ

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:34 AM

రాష్ట్రంలో గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్టు ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు.

 Nara Lokesh :  నియోజకవర్గానికో మోడల్‌ లైబ్రరీ

  • దేశంలో బాగా పనిచేసే గ్రంథాలయాలపై అధ్యయనం

  • ఇక్కడా అలాగే పనిచేసేలా చర్యలు: లోకేశ్‌

  • సమయానికి తెరవని సిబ్బందిపై అసహనం

విశాఖపట్నం/అక్కయ్యపాలెం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్టు ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. శనివారం విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించిన అనంతరం ఆయన నగరంలోని విద్యా సంస్థల తనిఖీకి బయలుదేరారు. మార్గమధ్యంలో అక్కయ్యపాలెం నెహ్రూబజార్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం వద్ద ఆగారు. ఉదయం 9.45 గంటలైనా లైబ్రరీ తెరవకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. వెంటనే లైబ్రేరియన్‌కు ఫోన్‌ చేసి పిలిపించారు. ఉదయం ఎనిమిది గంటలకే లైబ్రరీని తెరవాల్సి ఉండగా, ఎందుకు తెరవలేదని నిలదీశారు.

ఎనిమిది మంది సిబ్బందికి గాను ప్రస్తుతం ముగ్గురమే ఉన్నామని లైబ్రేరియన్‌ చెప్పడంతో.. దానికీ, దీనికీ సంబంధం ఏమిటంటూ లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇదే అంశంపై కలెక్టర్‌ హరేంధిర్‌ ప్రసాద్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు యువకులు లోకేశ్‌ను కలవగా వారితో ముచ్చటించారు. జిల్లా గ్రంథాలయాలను పటిష్టం చేయడంతోపాటు ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్‌ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రతి గ్రంథాలయంలో పత్రికలు, పుస్తకాలు, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, కంప్యూటర్లు అందుబాటులో ఉంచుతామని, గ్రంథాలయాల పర్యవేక్షణకు ఒక అధికారిని నియమిస్తామని చెప్పారు. దేశంలో బాగా పనిచేసే లైబ్రరీలను అధ్యయనం చేసి ఆ ప్రకారం ఇక్కడా నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. తరువాత అదే భవనంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని లోకేశ్‌ సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. కుశల ప్రశ్నలు వేసి, రైమ్స్‌ చదివించారు. పిల్లలకు చాక్లెట్లు ఇచ్చి ఫొటోలు దిగారు.

Updated Date - Oct 20 , 2024 | 03:34 AM