Nara Lokesh : కార్యకర్తల కోసమే నా పదవి
ABN , Publish Date - Jun 29 , 2024 | 05:31 AM
‘నేను కార్యకర్తల కోసమే ఈ పదవి తీసుకొన్నాను. వారికి న్యాయం చేయలేకపోతే నేను నా పాత్ర సక్రమంగా చేయలేకపోయాననే భావిస్తా. పార్టీలో ప్రతి నాయకుడికి, కార్యకర్తకు అండగా ఉంటా.
యువ నాయకత్వాన్ని పెంచడానికే ప్రాధాన్యం
రాజకీయ ప్రేరేపిత కేసులను మూడు నెలల్లో,
కోర్టుకు వెళ్లిన వాటిని ఏడాదిలో
తీయించడానికి కృషి
కబ్జాదారులను, దోపిడీదారులను
వదిలేదే లేదు: పల్లా
టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు
స్వీకరించిన శ్రీనివాసరావు యాదవ్
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ‘నేను కార్యకర్తల కోసమే ఈ పదవి తీసుకొన్నాను. వారికి న్యాయం చేయలేకపోతే నేను నా పాత్ర సక్రమంగా చేయలేకపోయాననే భావిస్తా. పార్టీలో ప్రతి నాయకుడికి, కార్యకర్తకు అండగా ఉంటా. ఏ పని ఉన్నా పార్టీ కార్యాలయానికి వస్తే మీ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తా’ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షునిగా అధికారికంగా బాధ్యతలు తీసుకొన్నారు.
ఈ సందర్భంగా పల్లా మాట్లాడారు. ‘టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఎంతో మంది పార్టీ కార్యకర్తలు తమ సమయాన్ని, వనరులను వెచ్చించి పనిచేశారు. వారికి అండగా ఉండటం నా బాధ్యతగా గుర్తించి పనిచేస్తా. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనాపరమైన పనుల్లో పడిపోయి మంత్రులు, ఎమ్మెల్యేలు కిందిస్థాయి కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. అటువంటి ఫిర్యాదులకు తావు లేకుండా పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకొంటాం. 2024లో వచ్చిన ఎన్నికల ఫలితాలే 2029లో కూడా వచ్చేలా శక్తివంచన లేకుండా పనిచేస్తా.
గత వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలు, కార్యకర్తలపై వేల సంఖ్యలో అక్రమ కేసులు మోపింది. రాజకీయ ప్రేరేపిత కేసులను మూడు నెలల్లో తీయించడానికి కృషి చేస్తా. ఎఫ్‌ఐఆర్ నమోదై కోర్టుకు వెళ్లిన రాజకీయ ప్రేరేపిత కేసులను ఏడాదిలో తొలగించడానికి ప్రయత్నిస్తాం. ప్రతి నాయకుడు తన పరిధిలో ఎవరి మీద ఏ కేసులు ఉన్నాయన్న ఆ వివరాలను పార్టీ దృష్టికి తేవాలి’ అని ఆయన సూచించారు. అధికార దుర్వినియోగంతో అక్రమాలకు పాల్పడినవారిని, ప్రజా ధనాన్ని దోచుకొన్న వారిని, ప్రైవేటు ఆస్తులను కబ్జా చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. పార్టీ నాయకులు నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
ప్రజలకు ఉపశమనం కలిగించడానికి అధికారాన్ని వినియోగించాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ నుంచి బలహీన వర్గాలు, బీసీ వర్గాలకు పెద్ద పీట వేస్తూ వచ్చారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇప్పుడు నాకు ఈ బాధ్యత అప్పగించారు. పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్‌కు నా ధన్యవాదాలు. పార్టీలో అన్ని స్థాయిలో యువ నాయకత్వాన్ని పెంచడం నా ప్రాధాన్యాల్లో ఒకటిగా పెట్టుకొని పనిచేస్తా. పనిచేసేవారికి కీలక బాధ్యతలు అప్పగిస్తా’ అని పల్లా స్పష్టం చేశారు.
కిటకిటలాడిన పార్టీ కార్యాలయం
పల్లా బాధ్యతల స్వీకరణ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయం కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచీ భారీగా వచ్చారు. మంత్రులు లోకేశ్, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు కూన రవి కుమార్, తెనాలి శ్రావణ్ కుమార్, పార్టీ నేతలు టీడీ జనార్దన్‌రావు, కేఎస్ జవహర్, పిఠాపురం వర్మ, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, అశోక్ బాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.