Andhra Pradesh: జగన్‌కు ఝలక్.. ఇక నో హై సెక్యూరిటీ జోన్!
ABN , Publish Date - Jul 03 , 2024 | 04:38 AM
Andhra Pradesh: ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం మా ఇంటికి మమ్మల్ని వెళ్లనివ్వరా..? నిత్యం తిరిగే వాళ్లమైనా..
జగన్ నివాసం వద్ద టైర్ కిల్లర్లు తొలగింపు
అమరావతి-ఆంధ్రజ్యోతి/తాడేపల్లి టౌన్‌జూలై 2: ‘ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం మా ఇంటికి మమ్మల్ని వెళ్లనివ్వరా..? నిత్యం తిరిగే వాళ్లమైనా.. ధ్రువీకరణ పత్రాలు చూపించి ఆ మార్గంలో ప్రయాణించాలా? అదేమని ప్రశ్నిస్తే సీఎం నివాసం.. హై సెక్యూరిటీ జోన్ అంటారా’ అని తాడేపల్లిలో ఐదేళ్లు నరకయాతన అనుభవించిన స్థానిక ప్రజలు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ రాకతో ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం జగన్ నివాసం మీదుగా ఎవరైనా ప్రయాణించే విధంగా చర్యలు తీసుకున్నారు. తొలుత ,రోడ్డుకు అడ్డంగా కట్టిన అడ్డుగోడను తొలగించడంతో ఆ మార్గంలో రోజూ ప్రయాణించే విద్యార్థులు, రైతు కూలీలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా హైసెక్యూరిటీ జోన్ వ్యవస్థలో భాగమైన ఆటోమేటిక్ పరికరాలను తొలగించారు. ఎవరైనా అనుమతి లేకుండా వెళ్తే ఆ వాహనాలను ఆపడానికి జగన్ ఇంటి చుట్టూ గతంలో రెండు టైర్ కిల్లర్లు, నాలుగు హైడ్రాలిక్ బులెట్లు ఏర్పాటు చేశారు. ఇవి కరెంటుతో ఆటోమేటిక్ విధానంలో పని చేస్తాయి. గత ప్రభుత్వ హయాంలో ఆ నివాసం చుట్టూ సామాన్యులు ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేశారు. ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లే రావడంతో జగన్ మాజీ అయ్యారు. అంతేకాదు.. ప్రతిపక్ష నేత హోదా కూడా వచ్చే పరిస్థితి లేదు.
ఈ నేపథ్యంలో ఆ మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. సోమవారం రాత్రి ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భద్రత టెంట్లను తొలగించారు. మంగళవారం టైర్ కిల్లర్లు, హైడ్రాలిక్ బులెట్లను క్రేన్ సాయంతో తొలగించారు. రోడ్డుపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వైపు ఉన్న పోలీసు చెక్‌పోస్టులను సైతం ఎత్తివేశారు. తొలగించిన సామగ్రిని లారీలో తరలించారు. రహదారి వెంట నివాస కంటైనర్లు ఇంకా అలాగే ఉన్నాయి.
భద్రతాసిబ్బంది కోసం పక్కాగృహాలు
జగన్ ఇంటి ప్రహారీ గోడను ఆనుకుని భద్రతా సిబ్బంది కోసం ఏకంగా పక్కా గృహాలే కట్టేశారు. వీటికి తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు తీసుకోలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద కూడా ఇదే తరహాలో జగన్ సెక్యూరిటీ కోసం శాశ్వత కట్టడాలను నిర్మించారు. వాటిని అక్కడి అధికారులు తొలగించారు. అదే తరహాలో తాడేపల్లి నివాసం వద్ద భద్రతా సిబ్బందికి కట్టిన అక్రమ నిర్మాణాలను కూడా తీసివేయాలని సమీప గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.