Pawan Kalyan : 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు
ABN , Publish Date - Aug 20 , 2024 | 04:56 AM
రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో మునుపెన్నడూ లేని విధంగా ఈ నెల 23న ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ఉపాధి పనులకు ఆమోదం తీసుకోవాలి.. సిబ్బంది, ప్రజలు భాగస్వాములు కావాలి
దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి.. పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు
ఉపాధి సిబ్బంది పనితీరు మార్చుకోవాలి.. ప్రజలను మెప్పించేలా పనులు చేపట్టాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నిర్దేశం
అవినీతి ఏ స్థాయిలో జరిగినా క్షమించేది లేదని హెచ్చరికలు
అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో మునుపెన్నడూ లేని విధంగా ఈ నెల 23న ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు.
గ్రామసభపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా పరిషత్ సీఈఓలు, డీపీఓలు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలు తదితరులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ‘పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల్లో పనిచేయడమంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, నిరుపేద కూలీలకు సేవ చేయడమేనని నేను నమ్ముతున్నా.
ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నాం. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికీ సంవత్సరంలో 100రోజుల పని దినాలను కల్పిస్తున్న అంశంపై అవగాహన కల్పించడంతో పాటు, అధికారులు కూలీలకు గల హక్కుల గురించి తెలియజేసి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
ప్రజలందరూ అధిక సంఖ్యలో గ్రామ సభలో పాల్గొనేలా చూడాలి. గ్రామసభలు అర్థవంతంగా జరగాలంటే గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామ సభల్లో మనస్పూర్తిగా పాల్గొనాలి. గ్రామ సచివాలయాల్లో పనిచేసే అందరూ ఉద్యోగులు గ్రామ సభల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చేసి సభలు విజయవంతానికి కృషి చేయాలి’ అని పవన్ కోరారు.
ఫిర్యాదులొస్తే ఉపేక్షించేది లేదు..
2024-25లో చేపట్టనున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి గ్రామసభలో చర్చించి గ్రామ సభ ఆమోదం తీసుకోవాలని పవన్ స్పష్టం చేశారు. ‘ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు పేద కూలీలకు, రైతులకు, గ్రామానికి ఉపయోగపడే ఉత్పాదకతను పెంపొందించే పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలి. పనుల నాణ్యత విషయంతో రాజీపడవద్దు. పథకం అమలుకు సంబంధించి కొంత మంది డ్వామా పీడీలు గ్రామాలను సందర్శించడం లేదు. పని ప్రదేశాలను తనిఖీ చేయడం లేదు.
సోషల్ ఆడిట్ సభలకు హాజరు కావడంలేదు. ఏపీఓలు, ఈసీలు, టీఏలు తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని ఫిర్యాదులొస్తున్నాయి. గ్రామ స్థాయిలో పనిచేసే అధికారులు బోగస్ అటెండెన్స్ సహా పనికిరాకుండా హాజరు వేయడం, పనిచేయకుండా చేసినట్లు చూపడం, తక్కువ పనిచేసి ఎక్కువ పనిని నమోదు చేయడం వంటి అవకతవకలు చేస్తున్నట్టు గమనించాం.
సోషల్ ఆడిట్ విభాగంలో కూడా అవినీతి జరుగుతోందని ఫిర్యాదులు వస్తున్నాయి. అవినీతి ఏ స్థాయిలో జరిగినా క్షమించేది లేదు. అదే సమయంలో సమర్థంగా పనిచేసే అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తాం.
ఇక మీదట ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అందరం సమష్టిగా కలిసి పనిచేసి మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధిద్దాం’ అని ఆకాంక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మాట్లాడుతూ సోషల్ ఆడిట్ పబ్లిక్ హియరింగ్‌కు డ్వామా పీడీలు విధిగా హాజరు కావాలన్నారు.