Pawan Kalyan: పవన్ ఆన్ ఫైర్.. ఆ నివేదిక ఇవ్వాలని అధికారులకి ఆదేశం
ABN , Publish Date - Jun 27 , 2024 | 08:05 PM
రోడ్ల కోసం కేటాయించిన నిధులను ఏం చేశారో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అలాగే.. ఎంత కాలం నుంచి రోడ్లు మరమ్మత్తులు చేయలేదనే వివరాలను...
రోడ్ల కోసం కేటాయించిన నిధులను ఏం చేశారో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అధికారులను ఆదేశించారు. అలాగే.. ఎంత కాలం నుంచి రోడ్లు మరమ్మత్తులు చేయలేదనే వివరాలను కూడా సమర్పించాలని కోరారు. గ్రామాలవారీగా చేపట్టిన పనుల వివరాలను సైతం స్థానిక ప్రజలకు తెలిపేలాగా బోర్టులను ఏర్పాటు చేయాలని చెప్పారు. గురువారం పీఆర్ & ఆర్డీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ విభాగాల సమీక్షలో భాగంగా.. ఆయన ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు.
వైసీపీ వాళ్లు చివరకు డేటా ఎంట్రీ ఆపరేటర్లను సైతం విడిచిపెట్టలేదని, వారిని కూడా వేధింపులకు గురి చేసిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించలేదని అన్నారు. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే.. వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. కొందరు కాంట్రాక్టర్లు బ్లాక్‌లిస్టులో ఉన్నారని, అలాంటి వారికి పనులు ఎలా అప్పగించారని అధికారులపై ఫైర్ అయ్యారు. ఆ కాంట్రాక్టర్లకు ఏ మేరకు బిల్లులు చెల్లించారో వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు.
అంతకుముందు.. జల్‌జీవన్ మిషన్‌లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరారు. ఈ పథకం ద్వారా వచ్చిన నిధులను గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయిందని మండిపడ్డారు. ఇటీవల డయేరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న తరుణంలో.. తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జల్‌జీవన్ మిషన్ పథకం నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
Read Latest Andhra Pradesh News and Telugu News