Rice Scam : పేర్ని నాని బియ్యం దందా
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:36 AM
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రేషన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దందా బయటపడింది. పౌరసరఫరాల శాఖకు ఆయన అద్దెకు ఇచ్చిన గోదాముల్లో సుమారు 250 టన్నుల బియ్యం మాయమైంది.
‘ఆయన గోదాముల’ నుంచి ఎన్నికల ముందు 250 టన్నులు మాయం
ఆయన పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చిన గోదాముల నుంచి తరలింపు
కూటమి ప్రభుత్వం వచ్చాక వెలుగులోకి
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రేషన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దందా బయటపడింది. పౌరసరఫరాల శాఖకు ఆయన అద్దెకు ఇచ్చిన గోదాముల్లో సుమారు 250 టన్నుల బియ్యం మాయమైంది. దీని విలువ రూ.కోటి పైచిలుకు ఉంటుందని అంచనా. ఎన్నికలకు ముందే బియ్యం మాయమైనా అప్పట్లో అధికారులు ఈ విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం, పౌరసరఫరాల శాఖ అధికారులూ బదిలీలు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు విచారణ చేయగా... పేర్ని నాని సూచనల మేరకే బియ్యం తరలించానని గోదాము ఇన్‌చార్జి వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పౌరసరఫరాల శాఖకు రెండుచోట్ల గోదాములు ఉన్నాయి. చిలకలపూడి వద్ద సెంట్రల్ వేర్ హౌసింగ్ గోదాములు ఉన్నాయి. మంగినపూడి బీచ్ సమీపంలో బందరు రూరల్ మండలం కొత్తపూడి పంచాయతీ పొట్లపాలెం గ్రామంలో పేర్ని నానికి సుమారు 2 ఎకరాల్లో గోదాములు ఉన్నాయి. వీటిని పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు.
ఆ శాఖ వీటిని బఫర్ గోదాములుగా వినియోగిస్తోంది. వీటి సామర్థ్యం సుమారు లక్ష టన్నులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ గోదాముల నుంచి సుమారు 250 టన్నుల బియ్యం మాయమైంది. అయినా ఈ విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. సాధారణంగా గోదాములను అద్దెకు ఇచ్చిన తర్వాత యజమానికి ఎలాంటి సంబంధం ఉండదు. మొత్తం బాధ్యత పౌరసరఫరాల శాఖ అధికారులదే.
అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో పేర్ని మనిషినే బఫర్ గోదాముల వద్ద ఔట్‌సోర్సింగ్ ద్వారా ఇన్‌చార్జిగా నియమించారు. గోదాముల నుంచి పెద్దఎత్తున బియ్యం మాయమైన ఘటనకు ఇన్‌చార్జితో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులను బాధ్యులను చేయాల్సి ఉంది.
ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. గోడౌన్ ఇన్‌చార్జిని విచారించారు. తనకేం సంబంధం లేదని, పేర్ని నాని సూచనల మేరకే బియ్యం తరలించానని ఆయన చెప్పారు.
అడ్డంగా బుక్కైన మాజీ మంత్రి
250టన్నుల బియ్యాన్ని మాయం చేసిన పేర్ని నాని దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో నిండా మునిగిపోయారు. డబ్బులు చెల్లించి గుట్టుచప్పుడు కాకుండా తప్పును కప్పి పెట్టాలనే యోచనతో జేసీకి లేఖ రాయడం ద్వారా చేసిన తప్పును నాని స్వయంగా ఒప్పుకొన్నట్లయింది. ప్రభుత్వానికి చెందిన బియ్యాన్ని పక్కదారి పట్టించడం తీవ్రమైన నేరం. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
మరో 100 టన్నులు మాయం!
పేర్ని నాని గోదాముల నుంచే గాక చిలకలపూడి వద్ద ఉన్న సెంట్రల్ వేర్ హౌసింగ్ గోదాముల నుంచి కూడా ఎన్నికలకు ముందు సుమారు 100 టన్నుల బియ్యం మాయమైనట్లు సమాచారం. విచారణలో ఈ విషయం వెలుగుచూడగానే అక్కడ ఇన్‌చార్జిగా ఉన్న వ్యక్తి ఆ బియ్యాన్ని బయట కొనుగోలు చేసి గుట్టుచప్పుడు కాకుండా సర్దేయడంతో ఈ విషయం అంతటితో ముగిసిపోయింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న గోదాముల నుంచి బియ్యాన్ని పక్కదారి పట్టించారంటే నాడు వైసీపీ నాయకులు వ్యవస్థలను ఎంతలా నిర్వీర్యం చేశారో అర్థమవుతోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశముంది.
నానికి అధికారుల సహకారం
బియ్యం మాయమైన ఘటనలో పేర్ని నానిపై అధికారులు కేసు నమోదు చేయాల్సి ఉంది. కానీ నానికి సన్నిహితంగా ఉండే కొందరు అధికారులు ఈ విషయాన్ని ఆయనకు తెలియజేసి, విషయం బయటకు పొక్కకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీంతో తన గోదాముల్లో మాయమైన బియ్యానికి ఖరీదు ఎంతో తెలిపితే ఆ మొత్తాన్ని చెల్లిస్తానని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌కు నాని లేఖ రాశారు. జేసీ ఈ లేఖను పౌరసరఫరాల శాఖ ఎండీకి పంపి, తగిన సూచనలు చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం.