Civil Supplies Department : కేసు మాఫీకి కాసులు!
ABN , Publish Date - Dec 17 , 2024 | 03:45 AM
పీడీఎస్ బియ్యం స్వాహా కేసులో డబ్బులు కట్టి బయటపడేందుకు మాజీ మంత్రి పేర్ని నాని వేసిన ఎత్తులు ఫలించేలా లేవు. ఈ ఘటనలో జరిమానా సుమారు రూ.1.72 కోట్లు చెల్లించినా క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
పీడీఎస్ బియ్యం మాయం ఘటనలో 1.72 కోట్ల జరిమానా చెల్లించిన పేర్ని నాని
14న కోటి..సోమవారం రూ.72 లక్షలు
అయినా కేసు ముందుకే.. మరోసారి గోదాముల్లో తనిఖీలు
విజయవాడ/మచిలీపట్నం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): పీడీఎస్ బియ్యం స్వాహా కేసులో డబ్బులు కట్టి బయటపడేందుకు మాజీ మంత్రి పేర్ని నాని వేసిన ఎత్తులు ఫలించేలా లేవు. ఈ ఘటనలో జరిమానా సుమారు రూ.1.72 కోట్లు చెల్లించినా క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట ఉన్న గోదాముల్లో రేషన్ బియ్యం మాయమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో సుమారు 187 టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించినట్టు ఇటీవల వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ స్వాహా పర్వం వెలుగు చూడలేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలాకాలం పాటు పేర్ని నానికి అనుకూలమైన అధికారులే పౌరసరఫరాల శాఖలో ఉండటంతో ఈ ఘటన వెలుగులోకి రాలేదు. ఎట్టకేలకు కొద్దిరోజుల క్రితం బియ్యం స్వాహా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం టీడీపీ నాయకులకు తెలియడానికి ముందే పేర్ని నానికి చేరిపోయింది. కేసు తీవ్రత గుర్తించిన పేర్ని నాని తప్పించుకునేందుకు తొలి నుంచీ ప్రయత్నిస్తున్నారు. నవంబరు 25న నెలవారీ తనిఖీల్లో భాగంగా పౌరసరఫరాల శాఖ అధికారులు గోదాములకు వెళ్లారు. తనిఖీలు చేస్తే తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న ఉద్దేశంతో తాళాలు లేవంటూ వారిని తిప్పి పంపేశారు. ఆ మరుసటి రోజే నవంబరు 26న ఆయన కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌కు లేఖ రాశారు. తన గోదాముల్లో వేబ్రిడ్జిలో లోపాల కారణంగా బియ్యం షార్టేజి వచ్చినట్టు తెలిసిందని, ఎంత మొత్తంలో తక్కువ వస్తే ఆ మేరకు నగదు చెల్లిస్తానంటూ లేఖ రాశారు.
ఈ లేఖతో అప్రమత్తమైన అధికారులు జిల్లాలోని బఫర్ గోదాముల్లో తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. నవంబరు 28, 29, 30 తేదీల్లో అధికారులు బఫర్ గోదాముల్లో తనిఖీలు చేశారు. పేర్ని నానికి చెందిన గోదాముల్లో 3,708 బ్యాగుల బియ్యం 187 టన్నులు తగ్గినట్టుగా తేలింది. ఈ మేరకు జేసీకి నివేదిక ఇచ్చారు. ఈ అంశంపై తదుపరి చర్యల కోసం జేసీ పౌర సరఫరాల శాఖ ఎండీకి లేఖ రాశారు. తగ్గిన బియ్యం ధరకు రెట్టింపు అంటే సుమారు రూ.1.70 కోట్లు జరిమానాగా కట్టించుకుని క్రిమినల్ కేసు నమోదు చేయాలని జేసీకి సూచించారు. జరిమానా నోటీసులు అందిన వెంటనే పేర్ని నాని ఆగమేఘాలపై పావులు కదిపారు. తన సతీమణిపై క్రిమినల్ కేసు నమోదైతే ఆమెను అరెస్టు చేస్తారని ఊహించి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడంతో పాటు జరిమానా సొమ్మును చెల్లించేశారు. ఈ నెల 11న కేసు నమోదు చేస్తే 14న ఆయన కోటి రూపాయలు చెల్లించేశారు. సోమవారం మిగిలిన రూ.72 లక్షలు కట్టేశారు. సోమవారం రోజే జిల్లా కోర్టులో పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఉండటంతో ఆ రోజుకు మొత్తం జరిమానా చెల్లించేస్తే కోర్టు నుంచి ఊరట పొందవచ్చన్న ఆలోచనతో పేర్ని నాని పావులు కదిపారు. అయితే అధికారులు మాత్రం జరిమానా చెల్లించినా పేర్ని జయసుధ క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కాగా జిల్లా 9వ అదనపు కోర్టు న్యాయమూర్తి పిటిషన్‌పై విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు.
మళ్లీ గోదాముల్లో తనిఖీ
మాజీ మంత్రి పేర్ని నాని గోదాములను అధికారులు రెండో విడతగా సోమవారం సాయంత్రం నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడున్న పీడీఎస్ బియ్యాన్ని లెక్కగట్టి మచిలీపట్నం మార్కెట్ యార్డులోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత పది రోజులుగా అధికారులు సకాలంలో సరైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తుండటంతో పౌరసరఫరాలు, రెవెన్యూ, పోలీస్ బృందాలు తాజాగా ఈ గోడౌన్‌లను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక్కడున్న పీడీఎస్ బియ్యం లెక్కలు చూసే పనిలో ఉన్నారు. సోమవారం రాత్రి సమయానికి ఒకలారీలో బియ్యాన్ని మచిలీపట్నం ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించారు. హమాలీలు వెళ్లిపోవడంతో బియ్యం తరలించే పనిని నిలిపివేసి లెక్కలు చూస్తున్నారు. గోదాముల్లోకి మీడియాను అనుమతించ లేదు. మొత్తం బియ్యం లెక్కలు చూసి, తరలించేందుకు రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. లెక్క లు చూసిన తరువాతనే ఇక్కడ ఎంతమేర బియ్యం మాయమైందనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉన్న రెండు గోడౌన్లను 2021 నుంచి పౌరసరఫరాల శాఖ అధికారులు అద్దె ప్రాతిపదికన బఫర్ గోడౌన్‌లుగా నిర్వహిస్తున్నారు. గతేడాది నవంబరు 16వతేదీ నాటికి ఒక గోడౌన్ అద్దె ఒప్పందం ముగిసింది. వచ్చే ఏడాది జనవరి నెలలో మరో గోడౌన్ అద్దె ఒప్పందం ముగుస్తుంది. అయినా ఇక్కడ పీడీఎస్ బియ్యాన్ని ఖాళీ చేయకుండా అధికారులు కొనసాగించారు.
నానికి అధికారుల సహకారం
పేర్ని నాని గోదాముల్లో బియ్యం మాయమైనట్టు నవంబరు 28, 29, 30 తేదీల్లోనే అధికారుల తనిఖీల్లో స్పష్టమైంది. వెంటనే స్పందించి కేసు నమోదు చేయాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు సుమారు రెండు వారాల పాటు మీనమేషాలు లెక్కించారు. ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో పేర్ని నానికి కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు సూచనలు కూడా ఇచ్చినట్టు సమాచారం. తాపీగా ఈ నెల 11న కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అన్నీ పేర్ని నాని ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు జరిగిపోయాయి. పౌరసరఫరాల శాఖలో కొందరు ఉన్నతాధికారులే పక్కా ప్లాన్‌తో పేర్ని నాని కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.