Share News

Pinnelli Ramakrishna Reddy: నెల్లూరు సెంట్రల్ జైలుకి పిన్నెల్లి

ABN , Publish Date - Jun 27 , 2024 | 10:46 AM

నెల్లూరు సెంట్రల్ జైలుకి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు తరలించారు. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జీ ఎదుట పిన్నెల్లిని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈవీఎంల ధ్వంసం, ఓటర్లని భయపెట్టిన నాలుగు కేసుల్లో విచారణ కొనసాగుతోంది. రెండు కేసుల్లో‌ బెయిల్ మంజూరు చేశారు. మరో రెండు కేసులకి సంబంధించి 14 రోజులు రిమాండ్ విధించారు.

Pinnelli Ramakrishna Reddy: నెల్లూరు సెంట్రల్ జైలుకి పిన్నెల్లి

నెల్లూరు: నెల్లూరు సెంట్రల్ జైలుకి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు తరలించారు. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జీ ఎదుట పిన్నెల్లిని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈవీఎంల ధ్వంసం, ఓటర్లని భయపెట్టిన నాలుగు కేసుల్లో విచారణ కొనసాగుతోంది. రెండు కేసుల్లో‌ బెయిల్ మంజూరు చేశారు. మరో రెండు కేసులకి సంబంధించి 14 రోజులు రిమాండ్ విధించారు. నరసరావుపేట ఎస్పీ కార్యాలయం వద్ద నుంచి పిన్నెల్లిని భారీ బందోబస్తుతో నెల్లూరుకి పోలీసులు తరలించారు. మాచర్లలో రాజకీయ అరాచకాలకు వైసీపీ మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేరాఫ్‌గా మారారు. అలాంటి పిన్నెల్లి ఆట ఎట్టకేలకు ముగిసింది. ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి, టీడీపీ ఏజెంట్లపై దౌష్ట్యానికి పాల్పడిన కేసుల్లో నరసరావుపేటలో బుధవారం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.


ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిన్నెల్లి వేసిన పిటిషన్లు బుధవారం తిరస్కరణకు గురయ్యాయి. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మధ్యాహ్నం 3.47 గంటల సమయంలో పిన్నెల్లిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అరెస్టు వార్తను ఎస్పీ మల్లికాగార్గ్‌ రాత్రి 7 గంటల సమయంలో ధ్రువీకరించారు. ఆ వెంటనే పిన్నెల్లిని వైద్య పరీక్షల నిమిత్తం ఎస్పీ కార్యాలయం నుంచి నరసరావుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి 8 గంటల సమయంలో తరలించారు. అనంతరం 9.13 గంటలకు ఆస్పత్రి నుంచి ఎస్పీ కార్యాలయానికి తిరిగి తీసుకొచ్చారు. మాచర్ల నియోజకవర్గంలో కేసులు నమోదు కావడంతో ఆయనను మాచర్ల కోర్టులో హాజరు పరచాలని పోలీసులు నిర్ణయించారు. రాత్రి 10 గంటల సమయంలో ఎస్పీ కార్యాలయం నుంచి పిన్నెల్లిని మాచర్ల కోర్టులో హాజరు పరిచేందుకు తరలించారు. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత మొత్తం పిన్నెల్లిపై 14 కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు హత్యాయత్నం కేసులు ఉన్నాయి.

Updated Date - Jun 27 , 2024 | 10:46 AM