CM Jagan: ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన.. అధికారుల అత్యుత్సాహం..
ABN , Publish Date - Apr 07 , 2024 | 07:43 AM
ప్రకాశం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కనిగిరి, మర్కాపురం నియోజకవర్గాల మీదుగా జగన్ బస్సుయాత్ర సాగుతుంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కనిగిరి ప్రధాన రహదారిలో భారీ వృక్షాలను నరికించారు.
ప్రకాశం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదివారం ప్రకాశం జిల్లా (Prakasam Dist.)లో ఎన్నికల ప్రచారం (Election Campaign) నిర్వహించనున్నారు. కనిగిరి (Kanigiri), మర్కాపురం (Markapuram) నియోజకవర్గాల మీదుగా జగన్ బస్సుయాత్ర (Bus Yatra) సాగుతుంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కనిగిరి ప్రధాన రహదారిలో భారీ వృక్షాలను నరికించారు. విద్యుత్ లైన్ తీగలను తొలగించి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా విద్యుత్ లైన్ తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రకాశం జిల్లాపై తీవ్ర నిర్లక్ష్యమే కొనసాగింది. గత ఎన్నికల ప్రచారంలోనూ, అంతకు ముందు ఓదార్పు యాత్ర పేరుతో జిల్లాలో పర్యటన సాగించిన సమయంలోనూ జగన్‌మోహన్‌రెడ్డి హామీలు గుప్పించారు. తీరా గెలిచాక మాట తప్పి మడమ తిప్పేశారు. ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వచ్చిన ప్రతిసారీ హామీల వర్షం కురిపించారు. కానీ శాశ్వత అభివృద్ధి, ఉపాధి కల్పన, మౌలిక రంగాలకు సంబంధించి ఏఒక్క అంశంలోనూ నిర్థిష్ట చర్యలు తీసుకోలేదు. సాగు, తాగునీటి రంగాలను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. పారిశ్రామిక ప్రగతిని పట్టించుకోకుండా గాలికొదిలేశారు. చివరకు గత ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ అందించిన పశ్చిమప్రాంత ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జిల్లా విభజన చేశారు. మరోసారి ఎన్నికలలో తన పార్టీని గెలిపించాలంటూ సిద్ధం పేరుతో కార్యకర్తలను, ప్రజలను కలుసుకొనేందుకు ఆది, సోమవారాల్లో జగన్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు ఏమి చేశావు జగన్? గతంలో ఇచ్చిన హామీలు ఒక్కటైనా నేరవేర్చావా? అసలు అవి కనీసం గుర్తున్నాయా? అని ప్రజానీకం ప్రశ్నిస్తోంది.
ప్రకాశం జిల్లాలో పేరులో తప్ప అభివృద్ధిలో, ప్రజల జీవితాల్లో వెలుగులు లేవన్నది నిర్వివాదాంశం. వ్యవసాయం, పాడి పరిశ్రమ ఇక్కడి ప్రజల జీవనాధారం కాగా అందుకు ఉపకరించే సాగునీటి సౌకర్యం పరిమితం. అత్యధిక ప్రాంతాల్లో తాగునీటి ఇక్కట్లు ఏడాది పొడవునా ఉంటాయి. ఇక శ్రమచేసే ప్రజానీకం ఉన్నప్పటికీ పనులు లేక ఉపాధి మార్గాలు కనిపించక జిల్లా నుంచి వలసలు భారీగా ఉంటున్నాయి. విద్య, వైద్యం, మెరుగైన రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితులు ఉన్న జిల్లాలో గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో ఆయా రంగాలలో చేసిన కృషి వల్ల కొంత ఊరట కలిగింది. అయితే వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో ఏఒక్క రంగంపైనా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. అన్నింటా తీవ్ర నిర్లక్ష్యమే కొనసాగింది. గత ఎన్నికల ప్రచారంలోనూ, అంతకు ముందు ఓదార్పు యాత్ర పేరుతో జిల్లాలో పర్యటించిన సమయంలోనూ, ఇతరత్రా పలు సందర్భాల్లో జిల్లా అభివృద్ధి, ఉపాధి కల్పన, మౌలిక రంగాల అభివృద్ధిపై జగన్ అనేక హామీలు ఇచ్చారు. ప్రజల సమస్యలపై మాట్లాడారు. అయితే అధికారంలోకి వచ్చాక వాటిలో ఏ ఒక్కదానినీ పట్టించుకున్న పరిస్థితి లేదు.