Andhra Pradesh: బస్తీ వాసులకు బిగ్ షాక్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
ABN , Publish Date - Apr 12 , 2024 | 07:45 AM
చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆస్తిపన్ను(Property Tax) పెంచలేదు. అయినా సరే... ‘బాదుడే బాదుడు’ అంటూ జగన్(YS Jagan) ఊరూరా మైకు పట్టుకుని ఊదరగొట్టారు. ఆయన అధికారంలోకి రాగానే ‘అసలు బాదుడు’ ఇదీ అంటూ పట్టణ వాసులకు(City Public) పన్ను వాత పెట్టారు. విలువ ఆధారిత ఆస్తి పన్ను ప్రవేశ పెట్టి...
ఆస్తిపన్ను మరోసారి 15% పెంపు
పెంచిన పన్నుతో డిమాండ్ నోటీసులు జారీ
దేశంలో ఎక్కడా లేని విధంగా పన్ను పీకుడు
ఆస్తి విలువ ఆధారితంగా పన్ను విధింపు
టీడీపీ హయాం ఐదేళ్లలో ఒక్కసారీ పెంపులేదు
పైగా పట్టణాల్లో మెరుగైన వసతుల కల్పన
జగన్ వచ్చాకే పట్టణాలపై భరించలేని భారం
ఇప్పటికే మూడు దఫాలు పెరిగిన పన్ను
దీనికి అదనంగా చెత్త పన్ను వసూలు
(అమరావతి – ఆంధ్రజ్యోతి): చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆస్తిపన్ను(Property Tax) పెంచలేదు. అయినా సరే.. ‘బాదుడే బాదుడు’ అంటూ జగన్(YS Jagan) ఊరూరా మైకు పట్టుకుని ఊదరగొట్టారు. ఆయన అధికారంలోకి రాగానే ‘అసలు బాదుడు’ ఇదీ అంటూ పట్టణ వాసులకు(City Public) పన్ను వాత పెట్టారు. విలువ ఆధారిత ఆస్తి పన్ను ప్రవేశ పెట్టి... దానిని ఏటా 15 శాతం పెంచుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు కూడా 15 శాతం పెంచిన పన్నుతో ఇంటి యజమానులకు డిమాండ్ నోటీసులు అందిస్తున్నారు. దీనికి చెత్త పన్ను అదనం. గత ఏడాది పెంచిన పన్నులే భరించలేని స్థాయికి చేరాయని ఇళ్ల యజమానులు వాపోయారు. ఇప్పుడు ఆ భారం మరింత పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాన్ని మించి విజయవాడ, గుంటూరు నగరవాసులు ఆస్తిపన్ను చెల్లించాల్సి వస్తోంది.
నాలుగేళ్లలోనే 82.27 శాతం పెంపు
కేంద్రం తెచ్చిన ఆస్తి విలువ ఆధారిత పన్నుల విధానాన్ని ఏపీలో జగన్ సర్కారు తప్ప దేశంలో మరే రాష్ట్రం అమలు చేయడం లేదు. అంతకుముందు అద్దె విలువ ఆధారంగా ఆస్తిపన్ను విధించే వారు. ఆస్తి విలువ ఆధారిత పన్నుపై స్థానికసంస్థలు పాలకమండలిలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్, ముంబయ్, బెంగళూరులాంటి మహానగరాల్లో సైతం ఈ కొత్త విధానం ఇంకా అమల్లోకి రాలేదు. కానీ ఏపీలో దీన్ని అమలు చేసి జనాల నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏటా భూముల విలువను పెంచుతోంది. దీంతో ఆస్తి విలువ కూడా పెరుగుతుంది. దానికి అనుగుణంగా ఇంటి పన్ను పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు స్టార్ హోటల్ నుంచి చిన్న షాపు వరకు అందరికీ ఒకేరకమైన పన్నురేటు నిర్ణయించారు. 2021–22 నుంచి ఆస్తి విలువ ఆధారిత పన్నును అమల్లోకి తెచ్చారు.
నాడు.. నేడు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో నివాస భవనాలకు, 2007లో వాణిజ్య భవనాలకు ఆస్తిపన్ను సవరించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రం ఆర్థికలోటులో ఉన్నప్పటికీ ఆస్తి పన్నును మాత్రం పెంచలేదు. పైగా పట్టణాల్లో అనేక వసతులను మెరుగు పరిచింది. ఎల్‌ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేసింది. కాలనీల్లో సీసీ రోడ్లు వేసింది. ఇంకా టీడీపీ హయాంలో పట్టణాలకు అనేక వసతులు సమకూరాయి. జగన్ వచ్చిన తర్వాత నగరాలు, పట్టణాల అభివృద్ధికి చేసిందేమీ లేకపోయినా పన్నుల బాదుడు మాత్రం విపరీతంగా పెంచేసింది. మూడేళ్లుగా ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని తెచ్చి... ఏటా పన్ను పోటును పెంచేస్తోంది. దాని ప్రకారం నివాస భవనాలకు రిజిస్ట్రేషన్ విలువలో 0.15 శాతం, వాణిజ్య భవనాలకు 0.30 శాతం చొప్పున ఆస్తి పన్ను నిర్ణయించారు. ఫలితంగా పన్ను కొన్ని రెట్లు పెరిగిపోయింది. ఒకేసారి అంత భారీగా పన్ను పెంచేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఏటా 15 శాతం పెంచాలని నిర్ణయించారు. 2020–21 సంవత్సరంలో ఆస్తి పన్ను డిమాండ్ రూ.1,157 కోట్లు. 2021–22లో అది రూ.1319 కోట్లు, 2022–23లో రూ.1617 కోట్లు, 2023–24 నాటికి రూ.1834 కోట్లకు పెరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా ఆస్తిపన్ను డిమాండ్ 2024–25లో రూ.2109 కోట్లు. అంటే నాలుగేళ్లలో 82.27 శాతం పన్నులు పెంచేశారు.
ఎటుచూసినా బాదుడే..
జగన్ ప్రభుత్వం వచ్చాక తాగునీరు, డ్రైనేజీ చార్జీలను విజయవాడలో ఒకేసారి 200 నుంచి 300 శాతానికి పన్నులు పెంచారు. ఆ తర్వాత ఏటా ఏడు శాతం చొప్పున పెంచుకుంటూ పోతున్నారు. ఇల్లు నిర్మించేటప్పుడు భవన నిర్మాణ ఫీజులు, సదుపాయాల కోసం అభివృద్ధి చార్జీలు, ఆఖరికి మొక్కలు వేస్తే దానిచుట్టూ వేసే ట్రీగార్డులకు సైతం ప్రజల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటిపన్నుపై అడ్మినిస్ట్రేటివ్ చార్జీలు కొన్ని చోట్ల అదనంగా వేసి ఆ తర్వాత ఇంటిపన్నులో కలిపేశారు. ఈ రకంగా పరోక్షంగానూ పన్నులు పెంచుతూ పోతున్నారు. ఇల్లు కొనుక్కొన్నప్పుడు పెరిగిన విలువను బట్టి స్టాంప్‌డ్యూటీ చెల్లిస్తారు. ఇన్‌కంట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్, ఇతర పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తారు. సొంత ఇంటిలో నివాసం ఉన్నా, కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చినా అద్దె విలువ పెరుగుతుంది తప్ప, ఆస్తి విలువ బట్టి ప్రతి సంవత్సరం అదనపు ఆదాయం రాదు. అయినా ప్రభుత్వం పెరిగిన ఆస్తి విలువకు ఏటా పన్ను చెల్లించమనడం అన్యాయమని పలువురు పేర్కొంటున్నారు.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సొంత ఇంట్లో ఉంటున్న సత్యనారాయణరావు మూడేళ్ల కిందట గ్రంథాలయ పన్ను, నీటిపన్ను, ఇంటి పన్ను కలిపి రూ.3600 చెల్లించారు. అదే చాలా ఎక్కువ అని అప్పట్లో బస్తీ వాసులు గగ్గోలు పెట్టారు. అలాంటిది ఏప్రిల్ నుంచి మొదలైన కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.11,763 చెల్లించాల్సిన పరిస్థితి. ఆస్తి పన్నును ఏటా 15 శాతం చొప్పున పెంచుతూ పోవడంతో ఆయన కట్టాల్సిన పన్నుమొత్తం మూడేళ్లలోనే ఏకంగా 226 శాతం పెరిగిపోయింది. ఎన్నికల ఏడాదిలోనైనా పన్నుపోటు నుంచి వెసులుబాటు దొరుకుతుందని పట్టణవాసులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, అలాంటిదేమీ లేదంటూ మరింత బాదుడుకు జగన్ సర్కారు సిద్ధమైంది.