Share News

Rains: భారీ వర్షాలు.. ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్

ABN , Publish Date - Nov 29 , 2024 | 03:47 PM

ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది.

Rains: భారీ వర్షాలు.. ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్

విశాఖపట్నం, నవంబర్ 29: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఇది మరింత బలపడి రానున్న ఆరు గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. శనివారం మధ్యాహ్నానానికి పుదుచ్చేరి వద్ద ఈ తుఫాన్ తీరాన్ని తానుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Also Read: కేసీఆర్ దీక్ష ఫేక్.. విచారణ జరపాలి


ఆ నాలుగు జిల్లాలు..

నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. ఆయా జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. ఇక రెండు రోజులు.. రాయలసీమతోపాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా ప్రాంతంలోని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక.. అలాగే రాష్ట్రంలోని మిగతా పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. మరోవైపు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది.


స్పందించిన విపత్తుల నిర్వహణ ఎండీ..

మరోవైపు ఈ ఫెంగల్ తుఫాన్‌పై రాష్ట్ర విపత్తుల నిర్వహణ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఇప్పటికే స్పందించారు. శనివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ తుఫాన్ ప్రభావం కారణంగా నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.


తీరం వెంబడి ఈదురు గాలులు..

ఇక పలు జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే రైతులు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


చెన్నైలో ఎడతెరిపి లేకుండా..

ఇంకోవైపు ఈ ఫెంగల్ తుపాను కారణంగా.. తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో గత రాత్రి నుంచీ ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ కారణంగా.. చెంగల్‌పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుత్తురై, తిరువారూర్ జిల్లాల్లో స్టాలిన్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక కడలూరు, నాగపట్నం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి, కారైకల్, కడలూరు ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.

For AndhraPradesh news And Telugu News

Updated Date - Nov 29 , 2024 | 04:39 PM