Revenue Conferences : 8 రోజుల్లో 62,732 ఫిర్యాదులు
ABN , Publish Date - Dec 16 , 2024 | 06:57 AM
రెవెన్యూ సదస్సులలో ప్రజల నుంచి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ సదస్సులు ప్రారంభమైన 6వ తేదీ నుంచి 13 వరకు... అంటే 8 రోజుల వ్యవధిలోనే 62,732 వినతులు వచ్చాయి.
రెవెన్యూ సదస్సుల్లో వినతుల వెల్లువ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రెవెన్యూ సదస్సులలో ప్రజల నుంచి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ సదస్సులు ప్రారంభమైన 6వ తేదీ నుంచి 13 వరకు... అంటే 8 రోజుల వ్యవధిలోనే 62,732 వినతులు వచ్చాయి. ఇందులో 32శాతం భూముల కబ్జా, దురాక్రమణ, రికార్డుల తారుమారుకు సంబంధించినవి ఉన్నాయి. మరో 45 శాతం భూముల సర్వేలో జరిగిన పొరపాట్లపై ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ సదస్సుల్లో మొత్తం 2.63 లక్షల మంది పాల్గొన్నారు. గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు విన్నపాల రూపంలో వెల్లువెత్తుతున్నాయి. దీంతో రెవెన్యూ శాఖ ఒకింత ఆశ్చర్యానికి, మరోవైపు ఆందోళనకు గురవుతోంది. రెవెన్యూ క్షేత్రస్థాయి యంత్రాంగం చేసిన తప్పులు, రీ సర్వేలో పొరపాట్ల వల్లే భారీగా భూ సమస్యలు తెచ్చిపెట్టాయన్న విషయం ఆ శాఖకు బోధపడింది. కూటమి ప్రభుత్వం రాగానే మదనపల్లె ఫైల్స్ ఉదంతం జరిగింది. అక్కడి నుంచి వరుసగా ప్రభుత్వానికి ప్రజా విన్నపాలు వస్తూనే ఉన్నాయి. టీడీపీ, జనసేన పార్టీ ఆఫీసులు, గ్రామ కార్యదర్శి కార్యాలయం నుంచి 1.74 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 73 శాతం పరిష్కరించినట్లుగా అధికారులు నివేదికలు ఇచ్చారు. ఇందులో రెవెన్యూశాఖ పరిష్కరించాల్సినవే 67 వేలు ఉండగా, ఇందులో 83 శాతం పరిష్కరించినట్లుగా చెప్పింది. పరిష్కరించామని అధికారులు నివేదిస్తున్న అంశాలే మళ్లీ రెవెన్యూ సదస్సుల్లో విన్నపాల రూపంలో ప్రభుత్వానికి చేరుతున్నాయి. అంటే పరిష్కారం అంతా మాయ అన్నమాట. రెవెన్యూ శాఖ ఇప్పుడైనా ప్రజా విన్నపాలు హేతుబద్ధ్దంగా పరిష్కరిస్తుందా? లేక గతంలో మాదిరి మిథ్యగానే మారుస్తుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. ప్రజలకు భూములు, ఆస్తులే జీవనాధారం. వాటిపై అధికారులే సమస్యలు సృష్టిస్తే తమ పరిస్థితి ఏమిటని బాధితులు వాపోతున్నారు. గతంలో మాదిరి సీఎంకు తప్పుడు నివేదికలు ఇవ్వకుండా ఇప్పటికైనా పద్ధతిగా పరిష్కరించాలని నిపుణులు కోరుతున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యాయో లేవో ఫిర్యాదులు నేరుగా ప్రభుత్వానికి తెలియజేసే విధానం అందుబాటులోకి తీసుకురావాలని సీనియర్ అధికారులు సూచిస్తున్నారు.
28 వరకు ప్రజావేదిక షెడ్యూల్
టీడీపీ కేంద్ర కార్యాలయంలో 16 నుంచి 28 వరకు జరిగే ప్రజావేదికలో పాల్గొనే నేతల వివరాలను పార్టీ కార్యాలయం ప్రకటించింది. 16న మాజీ మంత్రులు జవహర్, దేవినేని ఉమా, ఏపీఎల్‌ఐడీసీ పిల్లి మాణిక్యాలరావు వినతులు స్వీకరిస్తారని వెల్లడించింది. 17న ప్రభుత్వ సలహాదారు షరీఫ్, పొలిట్‌బ్యూరో వర్ల రామయ్య, సీడాప్ చైర్మన్ దీపక్‌రెడ్డి, 18న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జీడబ్ల్యూడీసీ చైర్మన్ సురేంద్ర, 19న మండలి చీఫ్ విప్ అనురాధ, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ బాబ్జీ, 20న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి సవిత, ఎస్‌బీ, వోసీడబ్ల్యూఏసీ చైర్మన్ రఘురామరాజు, 21న పల్లా, మంత్రి పార్థసారధి, ఆక్వా అథారిటీ చైర్మన్ వెంకట రమణారెడ్డి, 23న ఎమ్మెల్యే రామారావు, శాప్ చైర్మన్ రవినాయుడు, కుడాచైర్మన్ వెంకటేశ్వర్లు, 24న మంత్రి సంధ్యారాణి, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు, ఎస్‌వోపీసీఏ చైర్మన్ దేవదత్, 26న మంత్రి జనార్ధన్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏపీయూఎ్‌ఫఐడీసీ చైర్మన్ గోవింద సత్యనారాయణ, 27న పల్లా, మంత్రి నారాయణ, రుడా చైర్మన్ వెంకట రమణచౌదరి, 28న పల్లా, మంత్రి రామనారాయణరెడ్డి, ఎస్టీసీఎ్‌ఫసీ చైర్మన్ శ్రీనివాసులు అర్జీలు స్వీకరించనున్నారు.