Guntur : రాచమర్యాదలకు 5 లక్షలు..!
ABN , Publish Date - Nov 27 , 2024 | 05:11 AM
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అందిన రాచమర్యాదల వ్యవహారంలో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.
బోరుగడ్డకు స్టేషన్‌లో మర్యాదల వ్యవహారం
వెలుగులోకి వస్తున్న విస్తుపోయే నిజాలు
కీలక అధికారితో 5 లక్షలు పంపిన వైసీపీ నేత
గుంటూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అందిన రాచమర్యాదల వ్యవహారంలో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఐ కొంకా శ్రీనివాసరావును వీఆర్‌కు పంపగా... నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం అంతటితో ముగిసిందని అంతా భావించారు. కానీ.. పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీస్ అధికారులకు మతి పోయినంత పనైంది. పోలీస్ అధికారులకు పెద్దమొత్తంలో డబ్బు ముట్టడం వల్లే బోరుగడ్డ అనిల్.. స్టేషన్‌ను తన పిక్నిక్ పాయింట్‌గా మార్చుకున్నా.. అందరూ కళ్లు మూసుకున్నారని దర్యాప్తులో గుర్తించినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక గుంటూరుకు చెందిన వైసీపీ ముఖ్య నేత పైస్థాయిలో చక్రం తిప్పినట్టు తెలిసింది.
ఆ వైసీపీ నేతకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక పోలీస్ అధికారి ద్వారా రూ.5లక్షలు పంపినట్లు తెలుస్తోంది. అందులో రూ.2 లక్షలు మరో అధికారికి ఇవ్వగా, మిగిలిన రూ.3 లక్షలు ఎవరికి అందాయనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారిం ది. ఆ అధికారి స్టేషన్‌లో ఉండగా.. ఓ రోజు అర్ధరాత్రి సమయంలో బోరుగడ్డ తనయుడు, ఆయన భార్య, మామ దర్జాగా లోపలికి వచ్చి కూర్చున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో గుర్తించారు. బోరుగడ్డ తన కుమారుడిని అరగంట సేపు ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దాడిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనిల్‌కు కస్టడీలో ఇబ్బందిలేకుండా, నోరు విప్పకుండా చూసేందుకు వైసీపీ అధిష్ఠానం ఈ పని చేసినట్టు తెలిసింది.