TDP Leaders : ఏమి చెప్పితిరి?!
ABN , Publish Date - Dec 25 , 2024 | 05:05 AM
అరాచక, విధ్వంసక, కక్ష సాధింపు రాజకీయాలను ఐదేళ్లూ యథేచ్ఛగా నడిపించిన వైసీపీ పెద్దలకు, అధికారం పోగానే సంక్షేమ బాటలూ, అభివృద్ధి మాటలూ గుర్తుకు వస్తున్నట్టు ఉన్నాయి
వైసీపీకి కక్ష సాధింపు రాజకీయాలు తెలియవట!
గుంటూరు జైలు వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి ఉవాచ
అమరావతి, గుంటూరు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): అరాచక, విధ్వంసక, కక్ష సాధింపు రాజకీయాలను ఐదేళ్లూ యథేచ్ఛగా నడిపించిన వైసీపీ పెద్దలకు, అధికారం పోగానే సంక్షేమ బాటలూ, అభివృద్ధి మాటలూ గుర్తుకు వస్తున్నట్టు ఉన్నాయి! తమ పాలన ప్రగతిపథంలో సాగితే.. అధికార కూటమి ప్రభుత్వం పగలు, ప్రతీకార రాజకీయాలు నడుపుతున్నట్టు వారికి అనిపిస్తున్నట్టు ఉంది! టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో అరెస్టు అయిన మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శించడానికి గుంటూరుకు వెళ్లిన వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జైలు వద్ద చేసిన వ్యాఖ్యలు విన్నవారికి ఇప్పుడు ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. నాడు వైసీపీ పాలన సంక్షేమం, అభివృద్ధిపైనే దృష్టిసారించిందని, ఏనాడూ కక్షపూరితంగా వ్యవహరించలేదని ఆయన చెప్పుకొన్నారు. తాము ఆనాడు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే విపక్షాలు ఉండేవా అని సజ్జల ప్రశ్నించారు. పులిపంజా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని, తిరిగి అధికారంలోకి వస్తే వైసీపీ కార్యకర్తలను దాడులకు దిగకుండా నిలువరించలేమని వ్యాఖ్యానించారు. ‘‘కూటమి ప్రభుత్వం కక్షపూరిత పాలన చేస్తోంది. జైలులో మా నేతలకు కనీస సదుపాయాలు కూడా అందించడం లేదు. ముఖ్యమంత్రి కుమారుడు స్వయంగా పోలీసులకు ఫోన్లు చేసి మా నేతలను వేధింపులకు గురి చేయాలని ఆదేశిస్తున్నారు’’ అని సజ్జల విమర్శించారు. సీఎం చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే ఎలా వేధించాలనేది తమకు నేర్పిస్తున్నట్లుగా ఉందన్న ఆయన, ఇలా అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేయాలని శిక్షణ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ‘‘ఆరు నెలల్లోనే ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. కూటమి శిబిరంలో తగువులు పడుతున్నారు.
ఇంకో ఆరు నెలలు ఆగితే రోడ్డున పడతారు. ఆపై రెండేళ్లాగితే ఎన్నికలొస్తాయి. ఇదంతా దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు, కూటమి నాయకులు విజ్ఞతతో ఆలోచించాలి’’ అని వ్యాఖ్యానించారు. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా కుట్రలు, మాఫియా దందాలు.. బయటకు వస్తే పరదాలు.. హామీలను గుర్తుచేసిన టీచర్లు, ఉద్యోగులపై లాఠీల మోతలు.. విపక్షాలపై కేసులు.. అరెస్టులు.. జైళ్లు.. ఇలా భయపెట్టి, బెదిరించే పద్ధతుల్లో సాగిన వైసీపీ పాలన తెలిసినవాళ్లంతా సజ్జల వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తనను సీఐడీతో కొట్టించి .. దానిని వీడియోలో వైసీపీ పెద్దలు చూశారంటూ అప్పట్లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం వారు గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్షనేతగా చంద్రబాబు రాష్ట్ర పర్యటనకు అనుమతి ఇవ్వకుండా ఆనాడు ఇబ్బంది పెట్టారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వంగలపూడి అనితను అడ్డుకున్నారు. యువగళం పాదయాత్రను లోకేశ్ చేపట్టకుండా అడుగడుగునా సమస్యలు సృష్టించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టుచేసి.. జైలులో ఉంచగా, ఆయనను చూడటానికి ప్రయత్నించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపేశారు. ఇక.. సజ్జల విషయానికి వస్తే ఆయనో రాజ్యాంగేతర శక్తిగా ఆనాడు వ్యవహరించారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జైలు ఎదుట సజ్జల సుద్దులు విన్న వారంతా.. ‘‘ఏం చెప్పితిరి’’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.