Rajamahendravaram : పడవెనుక పడవ పెట్టి...!
ABN , Publish Date - Nov 29 , 2024 | 04:55 AM
నిండు గోదావరిలో పడవెనుక పడవను పెట్టి... నీటిలో మునిగి బకెట్‌తో లోపలున్న ఇసుకను తోడి.. పైకి తెచ్చి పడవలో నింపి ఒడ్డుకు చేర్చడం...
Andhrajyothi : నిండు గోదావరిలో పడవెనుక పడవను పెట్టి... నీటిలో మునిగి బకెట్‌తో లోపలున్న ఇసుకను తోడి.. పైకి తెచ్చి పడవలో నింపి ఒడ్డుకు చేర్చడం... నిత్యం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండున్నర గంటల నుంచి నడి నెత్తికి సూర్యుడు వచ్చే మధ్యాహ్నం 12 గంటల వరకూ జరిగే తంతు ఇది. చిన్న పడవలో ఐదుగురు కార్మికులు కలిసి తొమ్మిది టన్నుల ఇసుకను ఒడ్డుకు చేరుస్తారు. ఇలా 12 గంటల నిర్విరామ శ్రమతో నాలుగైదు ట్రిప్పులు వేస్తారు. టన్ను ఇసుక ఒడ్డుకు చేర్చినందుకు రూ.195లు ఇస్తారు. ఇక పెద్ద పడవలో అయితే పదిమంది కార్మికులు కలిసి 44 టన్నుల వరకూ ఇసుకను తీస్తారు. ఇవైతే రోజుకు రెండు ట్రిప్పులు వేస్తారు. ఈ ఇసుకపై సుమారు 3 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే బోట్స్‌మన్ సొసైటీలు 160 వరకూ ఉన్నాయి.
వాటి ద్వారా 1600 మంది ఉపాధి పొందుతున్నారు. ఇవికాక తూర్పుగోదావరి జిల్లా అఖండ గోదావరి ప్రాంతంలోని రాజమహేంద్రవరం వైపు గాయత్రి, కోటిలింగాల, కొవ్వూరు ర్యాంపుల్లోనూ బోట్స్‌మన్ సొసైటీల ద్వారా డీసిల్టేషన్ పేరుతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ ఇసుక తీసే పనిలో పడవలపై పనిచేసేవారంతా దాదాపు యూపీ, బిహార్ తదితర రాష్ర్టాల నుంచి వచ్చినవారే.
- రాజమహేంద్రవరం, ఆంధ్రజ్యోతి