Road Accidents : రహదారులు రక్తసిక్తం
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:30 AM
రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన 8 మంది కొత్త కారుకు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేయించి తిరిగి వస్తుండగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామం మలుపు వద్ద కారు అతివేగంగా చెట్టును ఢీకొంది.
రెండు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం
పల్నాడు జిల్లాలోచెట్టును ఢీకొన్న కారు
‘బాపట్ల’లో స్కూటర్‌ను ఢీకొట్టిన టిప్పర్ , ముగ్గురు మృత్యువాత
పిడుగురాళ్ల, కావలి రూరల్, పర్చూరు, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన 8 మంది కొత్త కారుకు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేయించి తిరిగి వస్తుండగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామం మలుపు వద్ద కారు అతివేగంగా చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో సిరిపురం గ్రామానికి చెందిన తుళ్లూరి సురేశ్(35), ఆయన భార్య తుళ్లూరి వనిత(32), ఉప్పాళ్ల యోబులు(60), కావలి మండలం వైకుంఠపురానికి చెందిన తాతా పెద్ద తిరుపతి(60) అక్కడికక్కడే మృతి చెందారు. సిరిపురానికి చెందిన ఉప్పాళ్ల ప్రణయ్‌కుమార్, ఆయన తల్లి ఉప్పాళ్ల ఆదిలక్ష్మి, ఉప్పాళ్ల శ్రీను, తాతా కౌసల్య తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పిడుగురాళ్లలోని ప్రైవేటు ఆస్పత్రికి, అనంతరం కావలిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కౌసల్య పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైకి తీసుకెళ్లారు. తుళ్లూరి సురేశ్ కరెంటు పనులు చేస్తుంటారు. ప్రతి ఏటా ఆయన కుటుంబమంతా ఆంజనేయస్వామి మాల ధరించి తిరుమలలోని జాపాలి తీర్థానికి వెళ్లి మొక్కులు తీర్చుకునే వారు. ఈ ఏడాదీ ఆంజనేయస్వామి మాల వేశారు.
కాగా, ప్రణయ్‌కుమార్ ఇటీవల కొత్తగా కారు కొన్నారు. కారుకు పూజలతోపాటు మొక్కులు తీర్చుకునేందుకు శుక్రవారం బంధువులతో కలిసి సిరిపురం నుంచి కొండగట్టుకు బయలుదేరారు. శనివారం మధ్యాహ్నం కొండగట్టులో కారుకు పూజలు చేయించారు. ఇక్కడే ఇరుముడులు చెల్లించి, తిరుగు ప్రయాణంలో దారిలోని దేవాలయాలను సందర్శిస్తున్నారు. శనివారం రాత్రికి యాదగిరిగుట్ట స్వామివారిని దర్శించుకుని కొద్దిసేపు విశ్రాంతి అనంతరం స్వగ్రామానికి బయల్దేరారు. ఉదయం 5.30 గంటల సమయంలో అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై బ్రాహ్మణపల్లి గ్రామం మలుపు వద్ద కారు అతివేగంతో హెచ్చరిక బోర్డును ఢీకొట్టి ఆ తర్వాత చెట్టును ఢీ కొట్టింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. సురేశ్, వనిత దంపతులు ప్రమాదంలో మరణించడంతో వారి ఇద్దరు చిన్న పిల్లలు అనాథలుగా మిగిలారు. కారును ప్రణయ్‌కుమార్ నడుపుతున్నారని, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. స్థానిక పోలీసులతో కలిస ఘటనా స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు.
పుట్టినరోజున దూసుకొచ్చిన మృత్యువు
బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం వద్ద పర్చూరు-వాడరేవు రోడ్డుపై ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులను కొరిశపాడు మండలం మేదరమెట్లకు చెందిన షేక్ మస్తాన్‌వలి(27), ఆయన భార్య అమీరున్(27), అత్త షేక్ బుడెమ్మ(45)గా గుర్తించారు. మేదరమెట్లకు చెందిన మస్తాన్‌వలి మోటరు మెకానిక్. ఆదివారం అమీరున్ పుట్టినరోజు కావడంతో దంపతులు కోనంకిలోని ఆమె పుట్టింటికి వెళ్లారు. అక్కడి నుంచి స్కూటర్‌పై మస్తాన్‌వలి, అమీరున్, బుడెమ్మ, అలాగే, మస్తాన్‌వలి బావమరిది కుటుంబం మరో బైక్‌పై బయలుదేరారు. చీరాల మండలం వాడరేవు వద్ద సముద్ర స్నానం చేసి సరదాగా గడిపారు. తిరుగుప్రయాణంలో అన్నంబొట్లవారిపాలెం వద్ద వీరి స్కూటర్‌ను వెనుక నుంచి వేగంగా టిప్పర్ ఢీకొట్టింది. మస్తాన్‌వలి, బుడెమ్మ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, అమీరున్‌ను ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు విడిచారు. మస్తాన్‌వలి దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమైంది. సంతానం లేరు.