AP Temples: కప్పరాడ వేంకటేశ్వర ఆలయంపై శారదా పీఠం కన్ను
ABN , Publish Date - Feb 21 , 2024 | 07:12 PM
కప్పరాడలో గల శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంపై శారదా పీఠం కన్ను పడింది. ఆలయ నిర్మాణం, భక్తుల నుంచి స్పందన రావడం, వీఐపీ భక్తులు రావడంతో అధిక ఆదాయం సమకూరుతుంది. ఈ ఆలయాన్ని ఎలాగైనా సరే దక్కించుకోవాలని అనుకుంటోంది.
విశాఖపట్టణం: రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఉంది జగన్ సర్కార్ తీరు. విశాఖ శారదా పీఠం అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తోంది. ఇక్కడికి సీఎం జగన్ (CM Jagan), మంత్రులు (Ministers), ఇతర ప్రముఖులు వస్తారనే సంగతి తెలిసిందే. తమకు ఇది కావాలని పీఠం అడిగితే చాలు వెంటనే కట్ట బెడుతుంటారు. విశాఖలో గల ప్రముఖ ఆలయాలపై శారదా పీఠం కన్ను పడింది. ఆ ఆలయ నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని కోరుతోంది. దేవాలయాల నిర్వహణ బాధ్యతలను అప్పనంగా అప్పగించే పనిలో ఉన్నారు.
ఏడాదికి రూ.కోటి ఆదాయం
కప్పరాడలో గల శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంపై శారదా పీఠం కన్ను పడింది. ఆలయ నిర్మాణం, భక్తుల నుంచి స్పందన రావడం, వీఐపీ భక్తులు రావడంతో అధిక ఆదాయం సమకూరుతుంది. ఈ ఆలయాన్ని ఎలాగైనా సరే దక్కించుకోవాలని అనుకుంటోంది. వీఐపీ భక్తులు ఎక్కువ రావడంతో ఆలయానికి ఏడాదికి కోటి రూపాయల ఆదాయం వస్తుంది. స్వామి వారికి 3 కిలోల బంగారు ఆభరణాలు, 100 కిలోల వెండి వస్తువులు, బ్యాంకులో రూ.80 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ వివరాలు తెలిసిన శారదా పీఠం నిర్వాహకులు ఎలాగైనా సరే నిర్వహణ బాధ్యతలను దక్కించుకోవాలని అనుకుంటుంది. ఇప్పుడే కాదు గత నాలుగేళ్ల నుంచి ఆ ప్రయత్నాల్లో ఉంది.
గత నాలుగేళ్లుగా ప్రయత్నం..?
ఆలయ కమిటీలో ఓ వర్గం శారదా పీఠానికి నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు 2020లో అంగీకరించింది. దీనిని మరో వర్గం వ్యతిరేకించింది. ఆ వివాదం అలా ఉండగా అప్పటి దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతి ఆలయాన్ని దేవదాయశాఖ పరిధిలోకి తీసుకున్నారు. ఆలయం, స్థిర చరాస్తులను స్వాధీనం చేసుకొని, 2020 సెప్టెంబర్ 30వ తేదీన ఈవోను నియమించారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను చూస్తామని శారదా పీఠం అంటోంది. కృష్ణా జిల్లా హంసలదీవిలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ బాధ్యతలను శృంగేరి జగద్దురు మహా సంస్థానానికి ప్రభుత్వం అప్పగించింది. అలా తమకు వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అప్పగించాలని శారదా పీఠం కోరుతోంది. ఈ మేరకు దేవదాయశాఖకు లేఖ రాసింది. ఆ లేఖ విషయం తెలిసి గతంలో వ్యతిరేకించిన కమిటీ ఆలయాన్ని పీఠానికి అప్పగించొద్దని డిమాండ్ చేస్తోంది.
ఎందుకు వద్దంటే..?
ఆలయంలో పాంచరాత్రి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు. శారదా పీఠం స్మార్త ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేసింది. పూజ విధానాలు వేరు అయినందున తేడా వస్తోందని స్పష్టం చేసింది. పీఠాలు, మఠాలకు ఆలయ నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది. దేవదాయ శాఖ పరిధిలో ఆలయం ఉంచాలని డిమాండ్ చేసింది. లేదంటే ఆలయ కమిటీకి అప్పగించాలని తెగేసి చెప్పింది. గతంలో వ్యతిరేకించిన కమిటీ ముందుకు రావడంతో అప్పగింత కార్యక్రమం ఆలస్యం అవుతోంది.
సాయి ఆలయ బాధ్యతలు
సీతమ్మధారలో ఉన్న సాయి ఆలయ నిర్వహణ బాధ్యతలను శారదా పీఠం పర్యవేక్షించింది. ఇతర కారణాల వల్ల దేవదాయశాఖకు అప్పగించారు. కప్పరాడలో గల శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయ బాధ్యతలను మాత్రం తప్పకుండా నిర్వహిస్తామని భీష్మించుకొని కూర్చొంది. తమకు అప్పగించాల్సిందేనని అంటోంది. కమిటీ వ్యతిరేకించడంతో అప్పగింత కార్యక్రమాలు కాస్త ఆలస్యం అవుతున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.