YS Sharmila : రేషన్ మాఫియాపై సిట్ సరే..
ABN , Publish Date - Dec 08 , 2024 | 04:28 AM
‘రేషన్ బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ... సోలార్ అవినీతిపై లేదెందుకు? అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా? మాజీ సీఎం స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే, నిజాలు నిగ్గు తేల్చే బాద్యత మీది కాదా?’
సోలార్ అవినీతిపై విచారణ ఏదీ?
సెకీతో విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయండి: వైఎస్ షర్మిల
అమరావతి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘రేషన్ బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ... సోలార్ అవినీతిపై లేదెందుకు? అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా? మాజీ సీఎం స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే, నిజాలు నిగ్గు తేల్చే బాద్యత మీది కాదా?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మి ల నిలదీశారు. శనివారం ఎక్స్‌లో సీఎం చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు సిట్‌ను వేయడాన్ని స్వాగతించిన ఆమె.. సోలార్ ఒప్పందాల్లో జరిగిన రూ.1,750 కోట్ల ముడుపులపై విచారణ ఏదని నిలదీశారు. ‘తీగలాగితే మాజీ సీఎంతో పాటు అదానీని కూడా అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకెంత లంచాలు ఆఫర్ చేశారు? ప్రతిపక్షంలో ఉండగా సెకీతో చేసుకొన్న ఒప్పందాల్లో భారీ అవినీతి జరిగిందన్నారు.
టెండర్లు లేకుం డా అదానీకి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చాక నిజాలు నిగ్గు తేలుస్తామంటూ గొప్ప మాటలు చెప్పారు. మరి ఇప్పుడేమైంది చంద్రబాబూ? అంటే ఆనాడు అదానీ కి జగన్ అమ్ముడు పోతే.. ఇప్పుడు మీరు అమ్ముడు పోయారనేగా అర్థం? అదానీ మిమ్మల్ని కొనకపోతే, తక్షణమే పంజరంలోంచి ఏసీబీని విడుదల చేయండి. ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించండి. సోలార్ పవర్ ఒప్పందాన్ని రద్దు చేయండి’ అని చంద్రబాబును షర్మిల డిమాండ్ చేశారు.