Share News

Shettigunta.. : శెట్టిగుంట రాజు.. రాణి!

ABN , Publish Date - Oct 15 , 2024 | 11:18 PM

అనాదిగా బొమ్మల కొలువుల్లో కొలువుదీరిన రాజు.. రాణి బొమ్మలకు లక్ష్మీపురం గ్రామం పుట్టినిల్లుగా మారింది. ఇక్కడి కళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకున్న బొమ్మలు గతంలో ఆటబొమ్మలుగా చిన్నారులను అధికంగా ఆకట్టుకునేవి.

Shettigunta.. : శెట్టిగుంట రాజు.. రాణి!
రాజురాణి బొమ్మలను తయారు చేస్తున్న కళాకారులు

Setti.gif

కొయ్య బొమ్మల తయారీలో మహిళలకు ఉపాధి

లేపాక్షి ద్వారా విక్రయాలు, పెరిగిన డిమాండ్‌

అనాదిగా బొమ్మల కొలువుల్లో కొలువుదీరిన రాజు.. రాణి బొమ్మలకు లక్ష్మీపురం గ్రామం పుట్టినిల్లుగా మారింది. ఇక్కడి కళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకున్న బొమ్మలు గతంలో ఆటబొమ్మలుగా చిన్నారులను అధికంగా ఆకట్టుకునేవి. ప్రస్తుతం దుస్తులు, పూసలు, చెమికీలు, రంగులతో సరికొత్త హంగులు దిద్దుకుని పిల్లలు, పెద్దలు సహా విదేశీయులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

రైల్వేకోడూరు,(ఆంధ్రజ్యోతి)అక్టోబరు 15:

మండలంలోని శెట్టిగుంట పంచాయతీ పరిధిలో ఉన్న లక్ష్మీగారిపల్లెలో తయారు చేస్తున్న రాజురాణి బొమ్మలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వందేళ్లుగా ఇక్కడ కొన్ని కుటుంబాలు బొమ్మల తయారీతో జీవనోపాధి పొందుతున్నాయి. ప్రస్తు తం గ్రామంలో 150 కుటుంబాల్లో 100 కుటుంబా లు రాజురాణి కొయ్య బొమ్మల తయా రీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా 6 ఇంచుల నుంచి 36 ఇంచుల ఎత్తు తో బొమ్మలను తయారు చేస్తారు.


6KDR18.gifదుస్తుల అలంకరణపై శిక్షణ ఇస్తున్న శ్రీదేవి

ఐదేళ్ల కిందట ప్రారంభం

ఐదేళ్ల కిందట విజయవాడకు చెందిన హస్తకళ అభివృద్ధి సంస్థ వారు లక్ష్మీగారిపల్లెలో రాజురాణి బొమ్మల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో పెద్ద, పెద్ద కొయ్యలను కోసేందుకు యంత్రాలు అమర్చారు. బొమ్మల తయారీకి వీలు గా అన్ని వసతులు కల్పించారు. గతంలో బొమ్మల తయారీకి ఎర్రచందనం వినియోగించేవారు. రానురాను ఎర్రచందనం విలువ పెరిగిపోవడం, అటవీశాఖ సహకరించకపోవడంతో ప్రస్తుతం టేకు, మద్ది తదితర కొయ్యలతో బొమ్మలను తయారు చేస్తున్నారు. ఒక్కో వ్యక్తి ఆరు ఇంచుల ఎత్తు బొమ్మలు రోజుకు 5 జతలు తయారు చేయగలుగుతాడు. 15 ఇంచుల బొమ్మ అయితే ఒక జత, 10 ఇంచుల బొమ్మ అయితే 2 జతలు తయారు చేస్తారు. 6 ఇంచుల రాజురాణి బొమ్మ రూ.230, 10 ఇంచి పొడవు బొమ్మ రూ.330కి విక్రయిస్తున్నారు.

మహిళలకు శిక్షణ

హస్తకళా అభివృద్ధి సంస్థ కేంద్రంలో రెండు నెలలుగా సుమారు 15 మంది మహిళలకు రాజురా ణి బొమ్మలకు దుస్తుల అలంకరణపై శిక్షణ ఇస్తున్నారు. ఇందు కోసం 30 ఏళ్ల అనుభవం కలిగిన రైల్వేకోడూరుకు శ్రీదేవిని శిక్షకురాలిగా నియమించారు. దుస్తులతో అలంకరించిన బొమ్మలను మధురై, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తిరుప తి, తిరుమల ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.


4KDR18.gif

దుస్తుల అలంకరణలో రాజు.. రాణి - దేవుని బొమ్మలు

బొమ్మలను మరింతగా మార్కెట్‌ కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం రైల్వేకోడూరులో స్టాల్‌ ఏర్పా టు చేయాలని, అటవీ శాఖ వారు బొమ్మల తయారీకి అవసరమై ఎర్రచందనం కలపను అం దుబాటులో ఉంచాలని కళాకారులు కోరుతున్నారు.

పెరిగిన డిమాండ్‌

దుస్తుల అలంకరణతో రాజురాణి బొమ్మలకు ఆదరణ పెరిగింది. మరి న్ని స్టాల్స్‌ ఏర్పాటు చేస్తే విదేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చు. రైల్వేకోడూరులో స్టాల్‌ ఏర్పాటు చేయాలి. ఎంపిక చే’టజూ దుస్తులకు డిజైన్‌ చేసి బొమ్మలకు అలంకరిస్తున్నాం. మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మార్కెట్‌లోకి పంపిస్తున్నాము.

- శ్రీదేవి, శిక్షకురాలు, రైల్వేకోడూరు

బొమ్మలు దేశవిదేశాలకు వెళ్లాలి

లక్ష్మీగారిపల్లె రాజురాణి బొమ్మలు దేశవిదేశాలకు వెళ్లాలి. ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ బొమ్మల కు మంచి డిమాండ్‌ ఉంది. కళాకారులకు తగిన పనిముట్లు ఇచ్చినా కొయ్య కొరత వేధిస్తోంది. బొమ్మల తయారీకి ప్రభుత్వం సహకారం అందించాలి

- బత్యాల మధురిమ, కళాకారిణి, లక్ష్మీగారిపల్లె

స్టాలు ఏర్పాటు చేయాలి

లక్ష్మీగారిపల్లె ప్రధాన దారి వద్ద ప్రభుత్వం రాజురాణి బొమ్మల స్టాలును ఏర్పాటు చేయాలి. దీంతో మహారాష్ట్ర, హైదరాబాద్‌, కర్నూలు, కడప, రాజంపేట తదితర ప్రాంతాలనుంచి తిరుమల, తిరుపతి దేవస్థానానికి వెళ్లేవారు బొమ్మలను చూసే అవకాశం కలుగుతుంది. దీంతో వ్యాపారం పెరుగుతుంది.

-వసంత, కళాకారిణి, లక్ష్మీగారిపల్లె

అధికారులు అడ్డుకుంటున్నారు

బొమ్మలను అమ్మేందుకు వెళుతుంటే అధికారు లు పట్టుకుంటున్నారు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మార్కెటింగ్‌ కల్పిస్తామన్న నేతలు పత్తా లేకుండా పోయారు. అధికారులు ఇచ్చన గుర్తింపు కార్డులు చూపించినపుడు మాత్రం బొమ్మలు ఇచ్చేసి పొమ్మంటున్నారు.

- వెంకటసుబ్బయ్య, కళాకారుడు, లక్ష్మీగారిపల్లె

Updated Date - Oct 15 , 2024 | 11:22 PM