SIT Investigation : ఒప్పందం ఏఆర్‌తో..సరఫరా వైష్ణవిది
ABN , Publish Date - Dec 17 , 2024 | 05:01 AM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి సరఫరా కోసం కాంట్రాక్టు కుదుర్చుకున్న ఏఆర్ డెయిరీ తాను సొంతంగా నెయ్యి సరఫరా చేయలేదని సుప్రీంకోర్టు నియమించిన సిట్ ...
కల్తీ దందాపై దాదాపుగా సిట్ నిర్ధారణ
లడ్డూలో వాడింది ఏఆర్ నెయ్యి కాదు
వైష్ణవి నుంచి నింపుకొని తిరుమలకు
డెయిరీల అధికారులను ప్రశ్నించిన సిట్
తిరుపతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి సరఫరా కోసం కాంట్రాక్టు కుదుర్చుకున్న ఏఆర్ డెయిరీ తాను సొంతంగా నెయ్యి సరఫరా చేయలేదని సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీ....టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్ ద్వారా అగ్రిమెంటు కుదుర్చుకుంది. అయితే ఏఆర్ డెయిరీ నుంచి టీటీడీకి అసలు నెయ్యే సరఫరా కాలేదని సిట్ అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం. ఏఆర్ డెయిరీ ట్యాంకర్ల రాకపోకలు, ఇతర ఆధారాల ప్రకారం ఈ విషయం సిట్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఏఆర్ డెయిరీ ఖాళీ ట్యాంకర్లు పెళ్లకూరు మండలంలోని వైష్ణవి డెయిరీకి చేరుకుని అక్కడ నెయ్యి నింపుకొని టీటీడీకి చేరవేసినట్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. అలాగే పరిమాణం విషయంలో కూడా తేడాలను గుర్తించినట్టు సమాచారం. రికార్డుల్లో నమోదు చేసిన పరిమాణంలో నెయ్యి సరఫరా కాలేదని, ప్రతి ట్యాంకరులోనూ కనీసం 500 కిలోలు తక్కువ పరిమాణంలో నెయ్యి సరఫరా చేసినట్టు సమాచారం. కాగా ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీల అధికారులను సిట్ బృందం కార్యాలయానికి పిలిపించి సుదీర్ఘంగా విచారించిందనీ, వారి నుంచి స్టేట్‌మెంట్లు నమోదు చేసిందని తెలిసింది.
వైష్ణవి డెయిరీ లైసెన్సు సస్పెన్షన్?
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పునబాకలోని వైష్ణవి డెయిరీ ప్రాసెసింగ్ యూనిట్ లైసెన్సును సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు 4రోజుల క్రితం సస్పెండ్ చేసినట్టు తెలిసింది. డెయిరీలో పాల సేకరణ, ప్రాసెసింగ్ రెండూ నిలిపివేసినట్టు తెలిసింది. ఈ నెల 13వ తేదీన ఉద్యోగులను, కార్మికులను సమావేశపరిచి సిట్ అధికారుల విచారణ నేపథ్యంలో ప్రాసెసింగ్ నిలిపివేస్తున్నామని డెయిరీ అధికారులు ప్రకటించినట్టు సమాచారం. ఉద్యోగులు విధులకు రావాలని, ప్రాసెసింగ్ జరగకపోయినా జీతాలు చెల్లిస్తామని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. క్యాజువల్ లేబర్‌ను మాత్రం రావద్దని చెప్పినట్టు తెలిసింది. 14వ తేదీన క్యాంటీన్ మూత పడి ఉండడం గమనించి డెయిరీ జనరల్ మేనేజర్‌ను ఉద్యోగులు నిలదీశారని సమాచారం. దీంతో అధికారులంతా డెయిరీ వదిలి వెళ్లిపోయారని, సెల్‌ఫోన్లు కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారని చెబుతున్నారు. ఆ క్రమంలో సోమవారం ఉద్యోగులు మళ్లీ డెయిరీకి విధులకు రాగా, అధికారులు లేకపోవడంతో ధర్నాకు దిగారు. పెళ్లకూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లి యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు.