Share News

ఇదేం క్రమ‘శిక్ష’ణ!?

ABN , Publish Date - Nov 19 , 2024 | 05:28 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)లో అమానుష ఘటన చోటుచేసుకుంది.

ఇదేం క్రమ‘శిక్ష’ణ!?

  • జి.మాడుగుల కేజీబీవీలో బాలికల జుట్టు కత్తిరించిన ఎస్‌వో సాయిప్రసన్న

  • తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళన

  • విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్‌

పాడేరు/జి.మాడుగుల, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)లో అమానుష ఘటన చోటుచేసుకుంది. బాలికల పట్ల ప్రత్యేకాధికారిణి సాయిప్రసన్న దారుణంగా ప్రవర్తించారు. పాఠశాలలో రోజువారీగా ఉదయం నిర్వహించే అసెంబ్లీ కార్యక్రమానికి హాజరు కాలేదన్న కోపంతో క్రమశిక్షణ పేరిట పలువురి జుట్టు కత్తిరించారు. సాయిప్రసన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బాలికల తల్లిదండ్రులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఘటనపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావును కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. జి.మాడుగుల కేజీబీవీలో పలువురు విద్యార్థినులు గత శుక్రవారం ఉదయం అసెంబ్లీకి హాజరు కాలేదు. ప్రత్యేకాధికారిణి బాలికల వద్దకు వెళ్లి.. ప్రార్థనకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తల స్నానాలు చేశామని, నీటి సమస్య వల్ల ఆలస్యం కావడంతో రాలేకపోయామని విద్యార్థినులు వివరణ ఇచ్చారు. ఆ సమయంలో బాలికలు జుట్టును ఆరబెట్టుకుంటూ కనిపించడంతో ప్రత్యేకాధికారిణి...‘అసెంబ్లీ ప్రార్థన, తరగతులు కంటే మీకు జుట్టే ప్రాధాన్యంగా ఉందా’ అని మండిపడ్డారు.

అంతటితో ఆగకుండా క్రమశిక్షణ లేకుండా పోయిందంటూ 18 మంది బాలికల జుట్టును 3-4 అంగుళాల మేర కత్తిరించారు. కొంత మంది ఆమె నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించగా.. వారి వెంటబడి మరీ కత్తిరించారు. ఇద్దరు ముగ్గురు తమకు మొక్కు ఉందని, కత్తిరించకూడదని చెప్పినా వినలేదు. దీనిపై బాలికల తల్లిదండ్రులు ఆదివారం విద్యాలయానికి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రత్యేకాధికారిణి కొన్నాళ్లుగా తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఈ క్రమంలోనే తమ జుట్టు కత్తిరించారని బాధిత బాలికలు వాపోయారు.


  • క్రమశిక్షణలో భాగంగానే..: ఎస్‌వో సాయిప్రసన్న

క్రమశిక్షణలో ఉంచాలనే ఆలోచనతోనే బాలికల జుట్టును కత్తిరించానని, వారిపై తనకు వ్యక్తిగత కక్ష లేదని కేజీబీవీ ప్రత్యేకాధికారిణి సాయిప్రసన్న వివరణ ఇచ్చారు. గత రెండు నెలలుగా బాలికలు క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వాళ్లు చక్కగా చదువుకోవాలని, సన్మార్గంలో ఉండాలనే ఆలోచనతోనే జుట్టును కత్తిరించానని, అంతేతప్ప మరో ఆలోచన లేదన్నారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు విచారణ చేపట్టారు. సాయిప్రసన్న, టీచర్లు, బాలికలతో వేర్వేరుగా మాట్లాడారు. బాలికల తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన తర్వాత, ఆయన నిర్ణయం మేరకు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విద్యాలయాన్ని సందర్శించి.. బాలికలు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. జిల్లా బాలికా సంరక్షణాధికారిణి సూర్యకుమారి ఘటనపై ఆరా తీశారు. సాయిప్రసన్నపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాలికల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఆమెను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. బాలికలను క్రమశిక్షణలో పెట్టాలనే వారి జుట్టు కత్తిరించానని, అది తప్పని తెలియదని, తనను క్షమించాలని సాయిప్రసన్న ఈ సందర్భంగా వేడుకున్నారు.

  • కలెక్టర్‌ను నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్‌

బాలికల జుట్టు కత్తిరింపు ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సోమవారం ఆదేశించింది. క్రమశిక్షణ పేరిట జుట్టును కత్తిరించడం, మానసికంగా వేధించడం, బాలికల ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేయడమేనని కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు, సభ్యుడు గోండు సీతారామ్‌ అభిప్రాయపడ్డారు. కలెక్టర్‌ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలతోపాటు క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని సిఫారసు చేయనున్నట్టు కమిషన్‌ పేర్కొంది.

Updated Date - Nov 19 , 2024 | 05:28 AM