TDP: కౌరవ సభను మళ్లీ గౌరవ సభగా మారుస్తాం: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2024-02-08T10:06:40+05:30 IST
అమరావతి: నిరుద్యోగ సమస్య, మహిళల భద్రతపై తెలుగుదేశం శాసనసభ పక్షం ఆందోళన చేసింది. గురువారం ఉదయం అసెంబ్లీ సమీపంలో అగ్నిమాపక కేంద్రం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు నిరసన తెలిపారు. ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు... రక్షణ లేక మహిళల ఆర్తనాదాలు అంటూ ప్రదర్శన చేపట్టారు.
అమరావతి: నిరుద్యోగ సమస్య, మహిళల భద్రతపై తెలుగుదేశం శాసనసభ పక్షం ఆందోళన చేసింది. గురువారం ఉదయం అసెంబ్లీ సమీపంలో అగ్నిమాపక కేంద్రం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు... రక్షణ లేక మహిళల ఆర్తనాదాలు అంటూ ప్రదర్శన చేపట్టారు. ప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని నిలదీశారు. రాష్ట్రంలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు ఉందంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ‘జే టాక్స్‌తో పరిశ్రమలు పరార్..., యువత బేజార్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడి నుంచి అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు.
ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రానికి వైకాపా ప్రభుత్వం రూపంలో పట్టిన శని, దరిద్రం నేటితో వదిలిపోతోందన్నారు. ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసిన ప్రతీ చట్టమూ రాష్ట్ర వినాశనం కోసమే చేసిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, మహిళల భద్రత ప్రధాన సమస్యలుగా ఉన్నాయని, 27 వేల ఖాళీలతో మెగా డీఎస్సీ ఇస్తామని జగన్ యువతను మోసగించారని అన్నారు. ఐదేళ్ల ప్రజావ్యతిరేక విధానాలపై రూపొందించిన పుస్తకాన్ని అసెంబ్లీ ముందే తగలపెడతామన్నారు. కౌరవ సభను మళ్లీ గౌరవ సభగా మారుస్తామన్నారు. శాసనసభను సైతం ఐదేళ్లుగా వైకాపా కార్యాలయంలా నడిపారని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.