Ap State Govt: బీటెక్ విద్యార్థులకు ‘స్వయం’ శిక్షణ
ABN , Publish Date - Dec 10 , 2024 | 05:06 AM
కేంద్ర ప్రభుత్వం, ఐఐటీ మద్రాసు సంయుక్తంగా అమలుచేస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమం ‘స్వయం’ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది.
కేంద్రం, ఐఐటీ మద్రాసుతో ప్రభుత్వ ఒప్పందం
అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం, ఐఐటీ మద్రాసు సంయుక్తంగా అమలుచేస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమం ‘స్వయం’ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు కేంద్రం, ఐఐటీ మద్రాసుతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉన్నత విద్యామండలి తాజాగా ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు 72 రకాల కోర్సుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా అధ్యాపకులకు ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్లు శిక్షణ ఇస్తారు. అలాగే ఆన్‌లైన్‌లోనూ విద్యార్థులకు నేరుగా శిక్షణ అందిస్తారు. ఒక సెమిస్టర్ పాటు కొనసాగే ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకు అదనంగా క్రెడిట్లు రావడంతో పాటు ఐఐటీ మద్రాసు సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ కోర్సులతో పాటు మెకానికల్, సివిల్ తదితర రంగాల్లోనూ శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థి చదువు పూర్తయ్యేలోగా అవసరమైన నైపుణ్యాలు సాధించడం ద్వారా వెంటనే ఉద్యోగం వచ్చే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. శిక్షణలో నాణ్యతతో పాటు ఐఐటీ మద్రాసు జారీచేసే సర్టిఫికెట్‌కు కూడా విలువ ఉంటుందని, దానివల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.