Heart Transplant : గాల్లో భద్రంగా.. ప్రయాణించిన గుండె!
ABN , Publish Date - Dec 18 , 2024 | 04:21 AM
ప్రకాశం జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువకుడు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు.
తిరుపతి వైద్యం, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువకుడు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దీంతో బాధితులు తిరుపతిలోని శ్రీపద్మావతి హృదయాలయంలో చేరారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహించి, వివరాలను జీవన్‌దాన్ పోర్టల్లో నమోదు చేశారు. మరోవైపు విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మురళి(50) బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అవయవదానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న వైద్యులు మంగళవారం విశాఖపట్నంలోని కిమ్స్ ఆస్పత్రికి చేరుకొని అక్కడ 11 గంటలకు గుండె సేకరణను పూర్తి చేసి, గ్రీన్‌చానల్ ద్వారా 12 గంటలకు ప్రత్యేక విమానంలో 1.30కు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి ప్రత్యేక అంబులెన్సులో 1.45కి శ్రీపద్మావతి హృదయాలయానికి చేరుకుని, ఆ గుండెను ప్రకాశం జిల్లా యువకుడికి విజయవంతంగా అమర్చారు.