Share News

AP Election Result 2024: ఉత్తరాంధ్రలో ఊడ్చేసి.. కోస్తాలో కుమ్మేసి! సీమలో రచ్చచేసి

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:04 AM

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని గుప్పిటపట్టింది. 13 ఉమ్మడి జిల్లాలకు గాను 8 జిల్లాలు.. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఆ పార్టీ ఖాతాయే తెరవలేదు. మిగతా ఐదు జిల్లాల్లో కడపలో మాత్రమే మూడు సీట్లను గెలుచుకుంది.

AP Election Result 2024: ఉత్తరాంధ్రలో ఊడ్చేసి.. కోస్తాలో కుమ్మేసి! సీమలో రచ్చచేసి

  • ఉమ్మడి జిల్లాల్లో టీడీపీ కూటమి క్లీన్‌స్వీప్‌

  • విశాఖ, ప్రకాశం, కర్నూలు, చిత్తూరుల్లో వైసీపీకి రెండేసి స్థానాలు

  • కడపలో 3 సీట్లు పొందిన జగన్‌ పార్టీ

  • మొత్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో ఆ పార్టీకి వచ్చింది 11 మాత్రమే

  • మిగతా 164 సీట్లూ కూటమికే

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని గుప్పిటపట్టింది. 13 ఉమ్మడి జిల్లాలకు గాను 8 జిల్లాలు.. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఆ పార్టీ ఖాతాయే తెరవలేదు. మిగతా ఐదు జిల్లాల్లో కడపలో మాత్రమే మూడు సీట్లను గెలుచుకుంది. ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలో రెండేసి స్థానాల్లో నెగ్గింది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని మొత్తం 34 స్థానాలకు గాను గత ఎన్నికల్లో 28 సీట్లను సాధించిన వైసీపీ.. ఈ దఫా కేవలం రెండు గెలుచుకుంది. గోదావరి-దక్షిణ కోస్తాలోని 89 స్థానాలకు గాను వైసీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆ రెండు కూడా ప్రకాశం జిల్లాల్లోనే వచ్చాయి. తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. ఇక రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 52 అసెంబ్లీ సీట్లకు గాను గత ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు ఏకంగా 49 సీట్లు కట్టబెట్టారు. ఇప్పుడు ఏడు సీట్లు ఇచ్చి సరిపెట్టుకోమన్నారు. మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు వైసీపీకి 11 మాత్రమే దక్కాయి.


‘తూర్పు’లో సునామీ తీర్పు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల సునామీ తీర్పు వైసీపీని గల్లంతు చేసేసింది. మొత్తం 19 స్థానాల్లోనూ ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అన్ని స్థానాల్లోను టీడీపీ, జనసేన, బీజేపీ భారీ మెజారిటీలు సాధించాయి. కూటమి ప్రభంజనంలో మంత్రులు పినిపె విశ్వరూప్‌ (అమలాపురం-ఎస్సీ), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (రాజమండ్రి రూరల్‌), దాడిశెట్టి రాజా (తుని) ముగ్గురూ చిత్తుగా ఓడిపోయారు. టీడీపీ, జనసేన అభ్యర్థులు ఉమ్మడి జిల్లా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వేల ఓట్ల ఆధిక్యం సాధించారు. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ ఏకంగా 70,354 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో తొలి ఫలితం రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది. ఇక్కడ టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 64,090 ఓట్ల ఆధిక్యంతో మంత్రి చెల్లుబోయినను మట్టికరిపించారు. అనపర్తి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తొలిరౌండ్‌లో కొంత వెనుకబడినా తర్వాత పుంజుకున్నారు. ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో వైసీపీ సిటింగ్‌ ఎమ్మెల్యేలను తప్పించి వేరే వారికి టికెట్లు ఇచ్చినా వారంతా పరాజయం పాలయ్యారు. కాకినాడ సిటీలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు 55,478 ఓట్లతో భారీ విజయం సాధించారు. ఇక ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం(బీజేపీ), కాకినాడ(జనసేన), అమలాపురం (టీడీపీ) లోక్‌సభ స్థానాలను కూటమి సునాయాసంగా గెలుపొందింది.


పశ్చిమలో కూటమి స్వీప్‌

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు గాను 2019లో వైసీపీ 13 గెలుచుకుంది. ఈసారి మొత్తం 15 స్థానాలను టీడీపీ కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు (తణుకు), కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం) ఘోర పరాజయం చవిచేశారు. ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేటి చంటికి అత్యధికంగా 61 వేలకు పైచిలుకు మెజారిటీ దక్కడం విశేషం. పాలకొల్లులో టీడీపీ నేత నిమ్మల రామానాయుడు హ్యాట్రిక్‌ విజయం సాధించారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీ తరఫున ఉండి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.73 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏలూరు లోక్‌సభ స్థానంలో కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు, పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌ 1.81 లక్షల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.


కృష్ణా జిల్లా పసుపుమయం!

టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు సొంత జిల్లా అయిన కృష్ణాలో ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి పసుపు సునామీ వచ్చింది. మొత్తం 16 స్థానాలను టీడీపీ కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది. 13 స్థానాల్లో టీడీపీ, 2 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో జనసేన పోటీ చేయగా అన్నింటిలోనూ కూటమి అభ్యర్థులు రికార్డు మెజారిటీతో గెలుపు సాధించారు. బూతుబాబులుగా పేరొందిన జోగి రమేశ్‌ (పెనమలూరు), కొడాలి నాని (గుడివాడ), వల్లభనేని వంశీ (గన్నవరం) ఓడిపోయారు. కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి విజయవాడ పశ్చిమలో, రాష్ట్ర మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ కైకలూరులో బీజేపీ తరఫున గెలిచారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ అవనిగడ్డలో ఈ సారి జనసేన నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొలుసు పార్థసారథి (నూజివీడు), యార్లగడ్డ వెంకట్రావు(గన్నవరం), వసంత కృష్ణ ప్రసాద్‌(మైలవరం)ను విజయం వరించగా.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాశ్‌ (విజయవాడ తూర్పు), నల్లగట్ల స్వామిదాస్‌ (తిరువూరు-ఎస్సీ) ఓటమిపాలయ్యారు. విజయవాడ లోక్‌సభ స్థానంలో తన అన్న కేశినేని నాని (వైసీపీ)పై టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని,.. మచిలీపట్నం పార్లమెంటు జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపొందారు.


గుంటూరులో వైసీపీ ఆలవుట్‌

ఉమ్మడి గుంటూరు జిల్లా ఓటర్లు మరో ఆలోచనకు, సందిగ్ధానికి తావులేకుండా టీడీపీ కూటమికి సంపూర్ణంగా మద్దతుగా నిలిచారు. మొత్తం 17 స్థానాలనూ దానికే కట్టబెట్టారు. టీడీపీ తుఫాను, రాజధాని రైతుల ఉసురు తగిలి వైసీపీ కొట్టుకుపోయింది. తెనాలిలో జనసేన అభ్యర్థి మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఘనవిజయం సాధించారు. మిగతా 16 సీట్లూ టీడీపీ కైవసమయ్యాయి. పోలింగ్‌ రోజున మాచర్లలో అరాచకానికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఇక 39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ యువనేత నారా లోకేశ్‌ 90వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. గుంటూరు లోక్‌సభలో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, నరసరావుపేటలో శ్రీకృష్ణదేవరాయలు, బాపట్లలో మాజీ ఐపీఎస్‌ అధికారి టి.కృష్ణప్రసాద్‌ టీడీపీ అభ్యర్థులుగా విజయం సాధించారు.


ప్రకాశంలో ఘోరంగా ఓడిన మంత్రులు

ప్రకాశం జిల్లాలో వైసీపీ ప్రముఖులు పరాజయం పాలయ్యారు. మంత్రులు ఆదిమూలపు సురేశ్‌ (కొండపి), మేరుగ నాగార్జున (సంతనూతలపాడు), మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)లో ఘోరంగా ఓడిపోయారు. జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా 10 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. దర్శిలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మొదటి నుంచి ఆధిక్యంలో నిలిచి.. చివరి రౌండ్లలో ఓడిపోయారు. యర్రగొండపాలెం (ఎస్సీ)లో చివరిదశలో వైసీపీ అభ్యర్థి గెలిచారు.గిద్దలూరులోనూ టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి, హోరాహోరీ పోరులో విజయం సాధించారు.


నెల్లూరులో టీడీపీ క్లీన్‌స్వీ్‌ప

నెల్లూరు జిల్లాలో టీడీపీ కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు, నెల్లూరు పార్లమెంటును వైసీపీ దక్కించుకోగా, ఈసారి ఆ స్థానాలన్నింటినీ తెలుగుదేశం తన ఖాతాలో వేసుకుంది. అందరూ గెలుస్తారని అనుకున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. నెల్లూరు సిటీ నియోజవకర్గంలో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పొంగూరు నారాయణ 72,489 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కోవూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 54,583 ఓట్ల తేడాతో విజయం సాధించారు, నెల్లూరు లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి 2,36,396 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై గెలుపొందారు.

Updated Date - Jun 05 , 2024 | 09:08 AM