Share News

TDP Coalition Government : ‘సెబ్‌’ రద్దు!

ABN , Publish Date - Aug 20 , 2024 | 04:23 AM

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తన మానస పుత్రికగా చెప్పుకొన్న స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) కాలగర్భంలో కలిసిపోనుంది. ఎలాంటి ఉపయోగమూ లేని ఈ వ్యవస్థను రద్దుచేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

TDP Coalition Government : ‘సెబ్‌’ రద్దు!

  • విఫల ప్రయోగానికి సర్కారు స్వస్తి

  • 28న కేబినెట్‌ ఆమోదం.. వెంటనే ఆర్డినెన్స్‌ అధికారులు, ఉద్యోగులు, కానిస్టేబుళ్లు..

  • అందరికీ కలిపి ఒకేసారి బదిలీలు

  • పూర్తిగా పాత స్వరూపంలోకి ఎక్సైజ్‌ శాఖ

  • చెక్‌పోస్టులు, స్క్వాడ్లు బలోపేతం

  • 24 గంటలూ పనిచేసేలా సిబ్బంది పెంపు

  • 208 సెబ్‌ స్టేషన్లు ఇక ఎక్సైజ్‌ స్టేషన్లు

అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తన మానస పుత్రికగా చెప్పుకొన్న స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) కాలగర్భంలో కలిసిపోనుంది. ఎలాంటి ఉపయోగమూ లేని ఈ వ్యవస్థను రద్దుచేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోపే ఈ వ్యవస్థను ఎత్తేసి, ఎక్సైజ్‌ శాఖకు సంపూర్ణంగా పూర్వరూపం తీసుకురానుంది. ఇందుకోసం తాజాగా ఎక్సైజ్‌ శాఖ తయారుచేసిన ప్రతిపాదనలను సాధారణ పరిపాలన, న్యాయ శాఖల పరిశీలనకు పంపుతున్నారు.

అవి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే.. ఈ నెల 28న జరిగే కేబినెట్‌ సమావేశంలో సెబ్‌ రద్దుకు ఆమోదం తెలుపుతారు. ఆ వెంటనే ఎక్సైజ్‌ చట్టంలో సవరణలతో ఆర్డినెన్స్‌ జారీచేసి సెబ్‌ను పూర్తిగా రద్దుచేస్తారు. అనంతరం ఎక్సైజ్‌, సెబ్‌లలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, కానిస్టేబుళ్లకు కలిపి ఒకేసారి బదిలీలు చేపడతారు. సెప్టెంబరు 5 నుంచి 15లోగా బదిలీలు పూర్తికావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

ఈలోగా వ్యవస్థ మొత్తాన్ని పునర్వ్యవస్థీకరించనుంది. ఎక్సైజ్‌, సెబ్‌ రెండు వేర్వేరు విభాగాల్లో ఉన్నందున అధికారులకు జీరో సర్వీసు ప్రామాణికంగా బదిలీలు చేసే అవకాశం ఉంది. కానిస్టేబుళ్లు స్టేషన్లలోనే ఉన్నందున వారికి కొంత సర్వీసును ఆధారంగా తీసుకుని బదిలీలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బలోపేతం..

ఎక్సైజ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కీలకంగా ఉంటుంది. రాష్ట్ర, జిల్లా, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ స్థాయుల్లో ప్రత్యేక స్క్వాడ్‌లు ఉంటాయి. వాటిని మరింత బలోపేతం చేసేలా ఎక్సైజ్‌ శాఖ ప్రణాళికలు రూపొందించింది. శాఖ పునర్వ్యవస్థీకరణ కోసం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది. దాని ప్రకారం ఉమ్మడి జిల్లాల తరహాలో ఎక్సైజ్‌ పాలన ఉంటుంది. ప్రతి జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌ అధిపతిగా ఉంటారు. మద్యం నేరాలకు ఒక అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ) ఉంటారు. గంజాయి, నాటుసారా ఎక్కువగా ఉండే అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాలకు అదనంగా చెరో అసిస్టెంట్‌ కమిషనర్‌ను నియమించాలని నిర్ణయించారు. అలాగే కొత్త జిల్లాల వారీగా జిల్లాకో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ (ఈఎస్‌) ఉంటారు. మార్కాపురం, రంపచోడవరం, పలాస, గూడూరుల్లో ఈఎస్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు అదనంగా ఏర్పాటుచేస్తారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ నేతృత్వంలోని స్క్వాడ్లలో కూడా సిబ్బందిని పెంచుతున్నారు. 29 చెక్‌పోస్టుల్లో ఇకపై సిబ్బంది 24 గంటలూ పనిచేసేలా కేటాయింపులు పెంచుతారు. మొబైల్‌ తనిఖీ బృందాలను కూడా పెంచనున్నారు. డీఐజీ లేదా ఐజీ స్థాయి అధికారిని ఎక్సైజ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా నియమిస్తారు. రాష్ట్రంలోని 208 సెబ్‌ స్టేషన్లను ఎక్సైజ్‌ స్టేషన్లుగా మారుస్తారు.


అక్రమాలకు ఆసరాగా సెబ్‌..

జగన్‌ ప్రభుత్వం మద్యంలో దోపిడీకే సెబ్‌ను సృష్టించిందనే ఆరోపణలున్నాయి. 2020 మేలో దీనిని ఏర్పాటు చేశారు. సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) పరిధిలో ఉంటూ పోలీసులు బాస్‌లుగా ఉండే విధానం తెచ్చారు. జిల్లాల్లో అదనపు ఎస్పీలు సెబ్‌కు బాస్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం ఎక్సైజ్‌ శాఖను రెండు ముక్కలు చేసి 30 శాతం సిబ్బందినే ఎక్సైజ్‌లో ఉంచారు. మిగిలిన 70 శాతం మందిని సెబ్‌కు కేటాయించారు. మద్యంతో పాటు ఇసుక, గుట్కా, గ్యాంబ్లింగ్‌ అంటూ అనేక బాధ్యతలు అప్పగించారు. కానీ మద్యం మినహా ఇతరత్రా నేరాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసే అధికారం సెబ్‌కు ఇవ్వలేదు. ఫలితంగా కొత్త వ్యవస్థను సృష్టించాక అక్రమాలు తగ్గుతాయనుకుంటే భారీగా పెరిగాయి. 2019-24 మధ్య కాలంలో గంజాయి కేసులు 27 శాతం అదనంగా పెరిగాయి. ఎన్‌డీపీఎల్‌ అక్రమాలు 66 శాతం పెరిగాయి. మద్యం సంబంధిత నేరాలు 64 శాతం, అరెస్టులు 161 శాతానికి చేరుకున్నాయి. 2017లో రాష్ట్రంలో దాదాపుగా అన్ని జిల్లాలను నాటుసారా రహిత జిల్లాలుగా ప్రకటిస్తే.. వైసీపీ హయాంలో మళ్లీ తెరపైకి వచ్చింది. ఎక్సైజ్‌ శాఖను అడ్డగోలుగా విడగొట్టడంతోనే ఈ విధంగా నేరాలు పెరిగిపోయాయని ప్రభుత్వం గుర్తించింది. అందుకే సెబ్‌ అనే విఫల ప్రయోగాన్ని పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది.


పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇలా..

సెబ్‌ను రద్దుచేసి ఎక్సైజ్‌ను పాత విధానంలోకి తీసుకొస్తే ప్రధాన కార్యాలయంలో ఒక అదనపు కమిషనర్‌, ముగ్గురు జాయింట్‌ కమిషనర్లు ఉంటారు. మొత్తంగా 67 మంది ఇక్కడ ఉంటారు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో 36 మంది, డిస్టిలరీ విభాగంలో 302 మంది, జిల్లాల్లో 96 మంది, ఎక్సైజ్‌ స్టేషన్లలో 3,333 మంది, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందా ల్లో 295 మంది, ఈఎస్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాల్లో 334 మంది, చెక్‌పోస్టుల్లో 313 మంది, మద్యం డిపోల్లో 138 మంది చొప్పున సిబ్బంది ఉంటారు.

Updated Date - Aug 20 , 2024 | 04:23 AM