Share News

TDP Leader Sridharsharma : జగన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Jun 17 , 2024 | 05:33 AM

క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రజాధనం దోపిడీ చేయడమే కాకుండా ఓటమి అనంతరం ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్ల ఖరీదైన సామగ్రిని తన ఇంట్లో అక్రమంగా ఉంచుకుని వాడుకుంటున్న మాజీ సీఎం జగన్‌, ఆయనకు సహకరించిన అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకుడు, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్‌ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ

TDP Leader Sridharsharma : జగన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోండి

  • క్యాంపు ఆఫీసు ముసుగులో ప్రజాధనం దోపిడీ

  • ప్రభుత్వానికి రూ.కోట్ల సామగ్రి అప్పగించకుండా

  • ఇంట్లో అక్రమంగా వాడుకుంటున్నారు

  • గుంటూరులో బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

  • మాజీ స్పీకర్‌ కోడెలపై నిందలు వేశారు

  • ఇప్పుడు జగన్‌కు నిబంధనలు పట్టవా?

  • మంత్రులు అనగాని, సంధ్యారాణి ఫైర్‌

అమరావతి (ఆంధ్రజ్యోతి), గుంటూరు, సాలూరు, జూన్‌ 16: క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రజాధనం దోపిడీ చేయడమే కాకుండా ఓటమి అనంతరం ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్ల ఖరీదైన సామగ్రిని తన ఇంట్లో అక్రమంగా ఉంచుకుని వాడుకుంటున్న మాజీ సీఎం జగన్‌, ఆయనకు సహకరించిన అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకుడు, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్‌ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం తెలుగు యువత, బ్రాహ్మణ చైతన్య వేదిక నాయకులతో కలసి గుంటూరు ఎస్పీ కార్యాలయంలో సీసీఎస్‌ అదనపు ఎస్పీ శ్రీనివాసరావుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందించారు.

జగన్‌ తాడేపల్లిలోని తన సొంత ఇంటికి సుమారు రూ.45.54 కోట్ల విలువైన ప్రజాధనం వెచ్చించి హంగు ఆర్భాటాలతో విలాసవంతమైన మౌలిక సదుపాయాలు కల్పించుకున్నారని పేర్కొన్నారు. శ్రీధర్‌ మీడియాతో మాట్లాడుతూ.. మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు విషయంలో గతంలో జగన్‌ ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించిందో, ఇప్పుడు జగన్‌ విషయంలో కూడా కొత్త ప్రభుత్వం అదేవిధంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. అప్పట్లో కోడెల ముందుగానే ఫర్నీచర్‌ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని, ఇప్పుడు జగన్‌ మాత్రం మీడియా బయట పెట్టేవరకూ గుట్టుగా ఉంచారన్నారు. కోడెల మీద పెట్టిన కేసులోని సెక్షన్‌ల కంటే జగన్‌పై అదనపు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

  • జగన్‌ ఫర్నిచర్‌ దొంగ: అనగాని

జగన్‌ ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్‌ను సరెండర్‌ చేయకుండా వాడుకుంటూ వైసీపీ నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ విమర్శించారు. గతంలో ఫర్నిచర్‌ విషయంలో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌పై అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. గన్‌కు ఏ మాత్రం నైతిక విలువలున్నా ప్రభుత్వ సొమ్ముతో తన ఇంట్లోకి కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ని ప్రభుత్వానికి అప్పగించాలని అనగాని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా ప్రభుత్వ ఆస్తులను వాడుకుంటున్న జగన్‌కు నిబంధనలు పట్టవా? అని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రశ్నించారు. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఆమె మాట్లాడుతూ.. లక్షలాది రూపాయలు విలువ చేసే ఫర్నిచర్‌ అప్పగించలేదని నాడు మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ ప్రభుత్వం నిందలు మోపిందన్నారు.

  • ఖరీదెందో చెబితే చెల్లిస్తాం!

లేళ్ల అప్పిరెడ్డి స్పందన

మాజీ సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌, ఇతర వివరాలు అందిస్తే వాటి ఖరీదు చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. జగన్మోహన్‌రెడ్డి సొంత ఇంట్లో ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన వాటి ఖరీదెంతో చెబితే చెల్లించేందుకు తాము సిద్ధమంటూ వైసీపీ తన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ద్వారా ప్రకటన ఇప్పించింది.

Updated Date - Jun 17 , 2024 | 05:33 AM