MLA Kolikapudi Srinivas : మద్యం షాపులపై కొలికపూడి చిందులు
ABN , Publish Date - Dec 18 , 2024 | 04:29 AM
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మద్యం దుకాణాల నిర్వాహకులపై చిందులు తొక్కారు.
తిరువూరులో 4 మద్యం షాపుల మూత
బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని ఆగ్రహం
24 గంటల్లో బెల్టు తొలగించాలని డిమాండ్
లేకుంటే తానే రంగంలోకి దిగుతానని అల్టిమేటం
చర్చనీయాంశంగా మారిన టీడీపీ ఎమ్మెల్యే తీరు
విజయవాడ/తిరువూరు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మద్యం దుకాణాల నిర్వాహకులపై చిందులు తొక్కారు. బెల్టు దుకాణాలకు మద్యం విక్రయిస్తున్నారని, పాఠశాలలకు సమీపంలో ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ తిరువూరు పట్టణంలోని నాలుగు మద్యం షాపులను బలవంతంగా మూసివేయించారు. ఎమ్మెల్యే తీరుపై దుకాణాల యజమానులు భగ్గుమన్నారు. ప్రభుత్వానికి డబ్బులు కట్టి అధికారికంగా నిర్వహించుకుంటున్న తమ షాపులను ఎమ్మెల్యే వ్యక్తిగత కారణాలతో మూసివేయించడం ఏమిటని నిలదీశారు. ఈ వ్యవహారంపై టీడీపీ నాయకులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. దుకాణాల నిర్వహణలో లోపాలుంటే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసి, వారి ద్వారా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించడం ఏమిటని వారు కూడా ప్రశ్నించారు. తిరువూరు పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే కొలికపూడి పర్యటించారు. ఆ సమయంలో మద్యం షాపుల వద్దకు వెళ్లిన ఆయన అక్కడే కొందరు మద్యం తాగుతుండటాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టణంలోనూ నియోజకవర్గంలోను సుమారు 150కి పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయని ఆరోపిస్తూ అప్పటికప్పుడు కొన్ని బెల్టు షాపుల్ని గుర్తించి, ఆయా షాపుల్లో ఉన్న మద్యం బాటిళ్లను పోలీసులకు అప్పగించారు. అనంతరం, బెల్టుషాపులతో పాటు పట్టణంలో ఉన్న నాలుగు మద్యం షాపులకు దగ్గరుండి తాళాలు వేయించారు. పట్టణంలో జనావాసాలు, పాఠశాలల దగ్గరే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువూరు పట్టణంలో బెల్టు షాపులు లేకుండా ఉండాలంటే ఉన్న నాలుగు మద్యం షాపుల లైస్సులు రద్దు చేయాలని, లేనిపక్షంలో 48 గంటల తర్వాత తానే ప్రత్యక్ష కార్యచరణకు దిగి, నియోజకవర్గంలో మద్యం షాపులు, మద్యం లేకుండా చేస్తానని ప్రకటించారు. నియోజకవర్గంలోని బెల్టుషాపుల్ని 24 గంటల్లో తొలగించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఉన్న లైసెన్సు మద్యం దుకాణాలను ఊరి బయటకు తరలించాలని హుకుం జారీ చేశారు.