Buddha Venkanna : వైసీపీ ఎమ్మెల్యేలురాజీనామా చేయాలి
ABN , Publish Date - Dec 16 , 2024 | 06:33 AM
అసెంబ్లీకి హాజరుకాని 11మంది వైసీపీ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
అసెంబ్లీకి హాజరుకాకుండా ఎన్నుకున్న
ప్రజల్ని అవమానిస్తున్నారు: బుద్దా వెంకన్న
విజయవాడ(వన్‌టౌన్), డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీకి హాజరుకాని 11మంది వైసీపీ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా ఎన్నుకున్న ప్రజలనే అవమానిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీకి హాజరుకాకున్నా ప్రతినెలా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.1.75 లక్షలు పడుతున్నాయని చెప్పారు. అయినా వారు ప్రజల గురించి ఏ ఒక్కరోజూ మాట్లాడలేదన్నారు. అసెంబ్లీకి హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేలను మేకలుగా పరిగణిస్తామని, వైసీపీలో 11మేకలు ఉన్నాయని, అవి ప్రజాధనాన్ని శుభ్రంగా మేస్తున్నాయని మండిపడ్డారు. వాటిలో పెద్ద మేక ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదని, గతంలో సీఎంగా పనిచేసిన ఆ వ్యక్తికి ప్రజలు తగిన బుద్ధి చెప్పటంతో బెంగళూరుకు పారిపోయాడని విమర్శించారు.
అసెంబ్లీకి హాజరుకాని వారికి ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత లేదన్నారు. అసెంబ్లీకి హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతినెలా తీసుకునే డబ్బులు వెనక్కు ఇచ్చేసి రాజీనామా చేయాలని తేల్చిచెప్పారు. జగన్‌కు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకివెళ్లి ప్రజల తరఫున మాట్లాడాలని డిమాండ్ చేశారు. అడ్రస్ లేకుండా పోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీల ఆచూకీ తెలిపితే రూ.1,116 బహుమానంగా ఇస్తానని చెప్పారు. జగన్ విధానాలు, పోకడలు నచ్చక అనేక మంది వైసీపీని వీడుతున్నారని, త్వరలో వైసీపీ ఖాళీ అవటం ఖాయమన్నారు.